ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో బార్ లైసెన్సు( Bar License)ల దరఖాస్తు గడువును ఆగస్ట్ 29 వరకు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. వినాయక చవితి పండుగ, బ్యాంకు సెలవుల కారణంగా దరఖాస్తు చేసుకునే వారికి సౌకర్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. లైసెన్సుల కేటాయింపులో పారదర్శకత కోసం ఆగస్ట్ 30 ఉదయం ఎనిమిది గంటలకు లాటరీ నిర్వహించనున్నారు. అయితే ఒక్కో బార్ లైసెన్సుకు కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే లాటరీ చేపడతామని ప్రభుత్వం స్పష్టంచేసింది. ఈ కారణంగా కొన్ని ప్రాంతాల్లో దరఖాస్తులు తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది.
Festival Season : భారీగా క్యాష్‌బ్యాక్ ఇస్తున్న SBI
సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త బార్ పాలసీ కింద, ప్రభుత్వం లైసెన్స్ ఫీజులు మరియు దరఖాస్తు ఫీజులను భారీగా తగ్గించింది. గతంలో కోట్లు దాటిన లైసెన్స్ ఫీజును గణనీయంగా తగ్గించి సులభతరం చేసింది. ఉదాహరణకు, కడపలో 1.97 కోట్లుగా ఉన్న లైసెన్స్ ఫీజును 55 లక్షలకు తగ్గించారు. అనంతపురంలోనూ ఇదే విధంగా రూ.1.79 కోట్ల ఫీజును రూ.55 లక్షలకు తగ్గించారు. 50 వేల లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.35 లక్షలు, 50 వేల నుండి 5 లక్షల వరకు జనాభా ఉన్న పట్టణాల్లో రూ.55 లక్షలు, ఐదు లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో రూ.75 లక్షలుగా లైసెన్సు ఫీజు నిర్ణయించారు.
అలాగే దరఖాస్తు ఫీజును రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతిగా రూ.5 లక్షలుగా నిర్ణయించారు. గతంలో ఇది ప్రాంతానికొకలా, రూ.10 లక్షల వరకు ఉండేది. ఇక లైసెన్సు ఫీజును ఒకేసారి కాకుండా ఆరు వాయిదాలలో చెల్లించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించింది. కొత్త విధానంలో గీతకార్మికులకు కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తూ, పది శాతం బార్లను కేటాయించనున్నారు. దీంతో సామాజిక వర్గాలకు కూడా కొత్త అవకాశాలు లభించనున్నాయి. మొత్తంగా కొత్త బార్ పాలసీతో వ్యాపారులకు సౌకర్యం కల్పించడం, ఆదాయ వనరులను పెంచడం, పారదర్శకతను కాపాడడం లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది.