Site icon HashtagU Telugu

AP Assembly : అసెంబ్లీ నుంచి టీడీపీ ఎమ్మెల్యేల బ‌హిష్క‌ర‌ణ‌

రెండో రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ నుంచి స‌స్పెండ్ అయ్యారు. స‌భ‌కు అంత‌రాయం క‌లిగిస్తున్నార‌ని భావించిన స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం ప్ర‌తిప‌క్ష స‌భ్యుల్ని ఒక రోజు స‌స్పెండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యుల తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యుల సమయాన్ని వృథా చేస్తున్నారని మండిపడ్డారు. సమావేశం రెండోరోజు కూడా టీడీపీ సభ్యులు నినాదాలతో మంత్రులు, స్పీకర్ ప్రసంగాలను అడ్డుకున్నారు. దీంతో వాళ్ల‌ను బ‌హిష్క‌రించారు.

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది బిల్లులను ప్రవేశపెట్టింది. సివిల్‌ సర్వీసెస్‌ రద్దు బిల్లు, వ్యవసాయం, మార్కెటింగ్‌ బిల్లు, ల్యాండ్‌ టైటిల్‌ బిల్లు, యూనివర్సిటీల చట్టం సవరణ బిల్లు, పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు తదితరాలను సభలో ప్రవేశపెట్టారు. మరోవైపు ఆర్థికాభివృద్ధిపై చిన్నపాటి చర్చ జరిగింది. రెండో రోజు ఏపీ శాసనసభ సమావేశాల్లో భాగంగా అంబటి రాంబాబు వ్యవసాయ సమస్యలపై మాట్లాడుతుండగా టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగా శాసనమండలిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. రెండో రోజు సభ ప్రారంభమైన తర్వాత స్పీకర్ క్వశ్చన్‌ అవర్‌ను నిర్వహించగా, ఆయా అంశాలపై మంత్రులు వివరించారు. మంత్రులు గుడివాడ అమర్‌నాథ్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విడుదల రజిని తదితరులు తమ శాఖల్లో జరుగుతున్న పనులను సభకు వివరించారు.