AP Assembly : మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా తీర్మానం చేసిన ఏపీ అసెంబ్లీ

మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ అనంతరం మహిళా రిజర్వేషన్‌కు మద్దతుగా ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం

  • Written By:
  • Updated On - September 26, 2023 / 04:05 PM IST

మహిళా సాధికారతపై స్వల్పకాలిక చర్చ అనంతరం మహిళా రిజర్వేషన్‌కు మద్దతుగా ఏపీ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందకముందే ముఖ్యమంత్రి వై.ఎస్. జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి రాష్ట్రంలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు మూడేళ్ల ముందే హామీ ఇచ్చారని తెలిపారు. వైఎస్‌ఆర్‌సి ప్రభుత్వం ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ నాయకత్వంలో మహిళా సాధికారత కోసం చర్యలు ప్రారంభించిందని తెలిపారు. వైయస్ఆర్‌సి పార్టీలో కూడా ఆయన మహిళలను రాజ‌కీయంగా ప్రోత్స‌హిస్తున్నార‌ని తెలిపారు. పార్లమెంట్‌లో చారిత్రాత్మక మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు అందజేస్తున్న సాయం, అవకాశాలపై ప్రత్యేక చర్చ నిర్వహించారు.

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు యువత అభివృద్ధి పేరుతో డబ్బులు దోచుకున్నారని, ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో యువతను మోసం చేశారన్నారని మంత్రి ఉషాశ్రీ చ‌ర‌ణ్ ఆరోపించారు. తన కుటుంబానికి చెందిన హెరిటేజ్‌కు ప్రయోజనం చేకూర్చేందుకు చంద్ర‌బాబు నాయుడు ఇతర పాల డెయిరీలను నిర్వీర్యం చేశారని ఆమె ఆరోపించారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో మహిళా సాధికారత కోసం గత ప్రభుత్వాల కంటే పదిరెట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామని ఆమె పేర్కొన్నారు.

పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా మాట్లాడుతూ కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతివ్వడం గర్వకారణమని.. బిల్లుకు త‌మ పార్టీ, ప్ర‌భుత్వం పూర్తిగా మద్దతిస్తోందని తెలిపారు. గత నాలుగేళ్లుగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేపడుతున్న అన్ని సంక్షేమ పథకాలు, విధానాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, ఇప్పుడు మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించినా.. ఆంధ్రప్రదేశ్‌లో తాము ఇప్పటికే 50 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్నామని గర్వంగా చెప్పుకోవచ్చని రోజా తెలిపారు. వివిధ సంక్షేమ పథకాల ద్వారా రాష్ట్రంలోని మహిళా లబ్ధిదారులకు సీఎం గత నాలుగేళ్లలో రూ.2.53 లక్షల కోట్లు బదిలీ చేశారని ఆమె తెలిపారు.

Follow us