AP – Telangana : పోరాడి గెలిచిన చంద్రబాబు.. సత్తా చాటుకున్న రేవంత్

ఈనెల 4న వెలువడిన ఎన్నికల ఫలితాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో అనూహ్య మార్పులను తీసుకొచ్చాయి.

  • Written By:
  • Updated On - June 6, 2024 / 12:50 AM IST

by DINESH AKULA

AP – Telangana : ఈనెల 4న వెలువడిన ఎన్నికల ఫలితాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలలో అనూహ్య మార్పులను తీసుకొచ్చాయి. తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 17 స్థానాలకుగానూ కాంగ్రెస్, బీజేపీలు చెరో ఎనిమిది స్థానాలను కైవసం చేసుకోగా.. బీఆర్ఎస్ జీరోగా మిగిలింది. ఈ ఫలితం అందరినీ ఆశ్చర్యపర్చింది. మరోవైపు ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకుగానూ 21 చోట్ల ఎన్డీయే కూటమి అభ్యర్థులు గెలిచారు. వీటిలో 16 స్థానాలు ఒక్క టీడీపీకే వచ్చాయి. జనసేనకు 2, బీజేపీకి 3 లోక్‌సభ సీట్లు దక్కాయి. వైఎస్సార్ సీపీ కేవలం 4 స్థానాల్లోనే గెలిచింది. ఇక ఏపీలోని 175 అసెంబ్లీ సీట్లలో  టీడీపీ 135 దక్కాయి. జనసేన 21 స్థానాల్లో గెలవగా.. అనూహ్యంగా వైఎస్సార్ సీపీకి కేవలం 11 సీట్లే వచ్చాయి.  ఈ రిజల్ట్ తర్వాత ఇరు తెలుగు రాష్ట్రాల్లో(AP – Telangana) ఏం జరగబోతోందో ఇప్పుడు చూద్దాం..

We’re now on WhatsApp. Click to Join

పెరిగిన రేవంత్ ఇమేజ్..

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో కాంగ్రెస్ హైకమాండ్ దృష్టిలో సీఎం రేవంత్ ఇమేజ్ మరింత పెరిగింది. ఎందుకంటే 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు 3 సీట్లే వచ్చాయి. ఇప్పుడు సీఎం రేవంత్ సారథ్యంలో ఆ సీట్ల సంఖ్య 8కి చేరింది. నల్గొండ, ఖమ్మం, భువనగిరి, వరంగల్‌, మహబూబాబాద్‌, పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌ వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ భారీ మెజార్టీతో విజయం సాధించింది. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రచారానికి నాయకత్వం వహించిన నల్గొండలో కాంగ్రెస్ రాష్ట్రంలోనే అత్యధికంగా 5,59,000 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. కొన్ని కీలకమైన పట్టణ ప్రాంతాల్లో కాంగ్రెస్ సవాళ్లను ఎదుర్కొంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లా మహబూబ్‌నగర్‌లో హస్తం  పార్టీ 4,500 ఓట్ల స్వల్ప తేడాతో బీజేపీ చేతిలో ఓడిపోయింది.

Also Read :Lok Sabha Poll : దేశ వ్యాప్తంగా అత్యధిక మెజార్టీ సాధించిన అభ్యర్థులు వీరే

బీజేపీకి మరింత బలం.. 

లోక్‌సభ సీట్లు రెట్టింపు కావడంతో బీజేపీ కూడా తెలంగాణలో ఫుల్ జోష్‌లో ఉంది. ఇక్కడ బీజేపీ విజయంలో “మోడీ ఫ్యాక్టర్” కీలక పాత్ర పోషించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో పార్టీకి మంచి ఫలితాలు వచ్చాయి. బాగా ఓట్లు పడ్డాయి. గతంలో బీఆర్ఎస్ చేతిలో ఉన్న మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఇది బీజేపీ బలమైన ప్రచారం, వ్యూహాత్మక అభ్యర్థి ఎంపికల వల్లే సాధ్యమైంది. ఈ విజయాలు భవిష్యత్తులో రాష్ట్ర ఎన్నికలలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లను సవాలు చేసే స్థాయికి బీజేపీని చేర్చాయి.

బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్

బీఆర్ఎస్ పార్టీ 17 లోక్‌సభ స్థానాల్లో పోటీచేయగా.. 14 చోట్ల ఓట్లపరంగా మూడో ప్లేసులో నిలిచింది. పార్టీ అగ్ర నాయకత్వం అహంకార పూరిత వైఖరి, అగమ్యగోచరత వల్లే ఇలా జరిగిందనే టాక్ వినిపిస్తోంది. హామీల అమలులో వైఫల్యం.. దళితులు, నిరుద్యోగులను పట్టించుకోకపోవడం బీఆర్ఎస్‌ను దెబ్బతీసింది. ఈ ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. తమ పార్టీ ఫీనిక్స్ పక్షి లాగా  మళ్లీ ఎదుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ఆశావాదపు ప్రకటనలు .. మెదక్, కరీంనగర్, నిజామాబాద్ వంటి బీఆర్ఎస్ కంచుకోటల్లో పార్టీకి ఎదురైన ఓటమిని కప్పిపుచ్చలేవు. బీఆర్ఎస్ బలహీనపడిందనే నిజాన్ని దాచలేవు. హైదరాబాద్‌లో మజ్లిస్, బీజేపీ, కాంగ్రెస్‌లతో పోలిస్తే బీఆర్ఎసే చాలా వెనుకబడింది.

ఏపీలో మళ్లీ చంద్రబాబు

ఏపీలో నారా చంద్రబాబు నాయుడు మళ్లీ సీఎం కానున్నారు. ఆయన సీఎం కానుండటం ఇది నాలుగోసారి. బీజేపీ, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ (జేఎస్పీ)తో పొత్తు పెట్టుకున్న టీడీపీ..  వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్సీపీ)ని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించింది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌ ఆరోపణలతో గత ఏడాది సెప్టెంబర్‌లో సీఐడీ పోలీసులతో చంద్రబాబును  జగన్ అరెస్టు చేయించారు. ఆయన్ను  జైలులో పెట్టించారు. ఈ క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొని.. సుప్రీంకోర్టు దాకా వెళ్లి న్యాయపోరాటం చేసి.. బెయిల్ పై బయటికొచ్చి కూటమిని ఏర్పాటు చేసి.. మళ్లీ సీఎం కావడం కేవలం చంద్రబాబుకే సాధ్యమైంది.  ఆయన పోరాట పటిమ అమోఘం. ఈసారి కేంద్రంలోని ఎన్డీయే సర్కారులోనూ చంద్రబాబు చక్రం తిప్పబోతున్నారు. ఈసారి ఎన్డీయే కూటమికి యువత ఓట్లు పడటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు.

కాంగ్రెస్ ఘోర వైఫల్యం

ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కానీ..  ఒక్క లోక్‌సభ స్థానాన్ని కానీ గెలవలేకపోయింది. కడప లోక్‌సభ స్థానంలో తన బంధువు వైఎస్‌ అవినాష్‌రెడ్డిపై పోటీ చేసిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మూడో స్థానంలో నిలిచారు. ఆమె ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినా.. పార్టీ  హైకమాండ్ ఆశించిన ఫలితం పెద్దగా రాలేదు.