Site icon HashtagU Telugu

Balakrishna : బాల‌య్య దెబ్బ‌కు వైసీపీ ఫ‌టాఫ‌ట్‌

Balakrishna Jagan Peddireddy

Balakrishna Jagan Peddireddy

అనంత‌పురం జిల్లా హిందూపురం నియోజ‌క‌వ‌ర్గం తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి కంచుకోట‌. అక్క‌డ ఇత‌ర పార్టీలు గెలువ‌డం దాదాపుగా సాధ్యంకాద‌ని స్థానిక ఓట‌ర్లు చెబుతుంటారు. నంద‌మూరి కుటుంబీకుల‌కు అడ్డాగా ఉంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల హవాలోనూ టీడీపీ గాలి ప‌దిలంగా ఉండే హిందూపురం మీద ఇప్పుడు వైసీపీ క‌న్నేసింది. స్థానిక లీడ‌ర్ల మ‌ధ్య ఉండే గ్రూప్ విభేదాల‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి టీడీపీ ఎమ్మెల్యే బాల‌య్య‌ను ఓడించి వైసీపీ జెండా ఎగ‌ర‌వేసేలా తాడేప‌ల్లికి పంచాయ‌తీ చేరింది.

మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి హిందూపురం వైసీపీ గ్రూప్ విభేదాల‌ను తీర్చ‌లేకపోయారు. ప‌రిష్కారం కోసం తాడేప‌ల్లి నివాసంలోని జ‌గ‌న్ ఎదుట ఎమ్మెల్సీ షేక్ మ‌హ్మ‌ద్‌ ఇక్బాల్, అబ్దుల్ ఖ‌నీల‌ను ప్ర‌వేశ‌పెట్టార‌ని తెలుస్తోంది. 2014 ఎన్నిక‌ల్లో హిందూపురం నుంచి పోటీ చేసిన న‌వీన్ నిశ్చ‌ల్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్ ఘ‌నీ వ‌ర్గాల మ‌ధ్య గ‌త కొంత‌కాలంగా ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమంటోంది. హిందూపురం ప్రెస్‌క్ల‌బ్ వేదిక‌గా ఇటీవ‌ల ఇరువ‌ర్గాలు రాళ్ల దాడులు చేసుకున్న విష‌యం విదిత‌మే. ఆ క్ర‌మంలో ఇరు వ‌ర్గాల‌ను మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అమ‌రావ‌తిలోని స‌చివాల‌యానికి పిలిపించుకున్నారు. మంత్రి స‌మ‌క్షంలోనే ప‌ర‌స్ప‌రం వాదులాట‌కు దిగినట్టు తెలుస్తోంది.

పెద్దిరెడ్డి వారించ‌డంతో కాస్తంత వెన‌క్కు త‌గ్గిన ఇరు వ‌ర్గాలు ప‌రస్ప‌రం ఫిర్యాదులు చేసుకున్నట్టు సమాచారం. ఈ సంద‌ర్భంగా ఇక్బాల్ వ‌ర్గంపై న‌వీన్ నిశ్చ‌ల్‌, అబ్దుల్ ఘ‌నీలు సంయుక్తంగా ఫిర్యాదు చేశారు. హిందూపురం స‌మ‌న్వ‌యక‌ర్త‌గా ఇక్బాల్‌ను కొన‌సాగిస్తే ప‌నిచేయ‌లేమ‌ని తేల్చేశార‌ట‌. హిందూపురం పార్టీ శాఖలో గొడ‌వ‌లు వ‌ద్ద‌నుకుంటే ఇక్బాల్‌ను త‌ప్పించాల్సిందేన‌ని తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. స్థానికేత‌రుడైన ఇక్బాల్‌కు హిందూపురం టికెట్ ఇవ్వ‌వ‌ద్ద‌ని సూచించ‌డంతో పాటు ఆయ‌న‌తో క‌లిసి ప‌నిచేయ‌లేమ‌ని తేల్చేశార‌ట‌.

ఇలాంటి ఫిర్యాదును గ‌మనించిన ఇక్బాల్ అస‌హ‌నానికి గుర‌య్యారు. హిందూపురం నియోజ‌క‌వ‌ర్గాన్ని వ‌దిలి వెళ్లేందుకు సిద్ధ‌మేన‌ని ఇక్బాల్ చెప్పినట్టు సమాచారం. సీఎం జ‌గ‌న్ చెబితే ఇప్ప‌టికిప్పుడే నియోజ‌క‌వ‌ర్గాన్ని వీడ‌తాన‌ని పెద్దిరెడ్డికి ఆయ‌న‌ చెప్పారట. ప‌రిస్థితి చేజారిపోతోంద‌ని గ్ర‌హించిన పెద్దిరెడ్డి ఇరు వ‌ర్గాల‌ను శాంతింప‌జేసే య‌త్నం చేసిన‌ట్టు తెలుస్తోంది. హిందూపురం పంచా‌యితీని సీఎం జ‌గ‌న్ వ‌ద్దే తేల్చాల‌ని పెద్దిరెడ్డి నిర్ణ‌యించార‌ట‌. తాడేప‌ల్లి నివాసం నుంచి వ‌చ్చే సంకేతాల‌కు అనుగుణంగా ఇక్బాల్ రాజ‌కీయ భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంది.