Site icon HashtagU Telugu

Bits Pilani In AP: అమరావతిలో మరో ప్రతిష్టాత్మక విద్యాసంస్థ… భూమి కోసం వెతుకులాట?

Bits Pilani In Ap

Bits Pilani In Ap

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని నగరంలో మరో ప్రతిష్టాత్మక విద్యా సంస్థ స్థాపనకి సిద్ధమైంది. 2016లో అమరావతిలో వెల్లూర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మరియు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలు తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేశాయి. 2019 తర్వాత ఐదేళ్ల పాటు అమరావతిలో విద్యా సంస్థల అభివృద్ధి ప్రగతి నిలిచిపోయింది. రాజధాని తరలింపుపై వైసీపీ విభిన్న ప్రయత్నాలు చేసింది. కానీ, రాజధాని ప్రాంతంలో ఇప్పటికే ప్రముఖ విద్యా సంస్థలకు భూములు కేటాయించిన ప్రాంతంలో, దాదాపు 50 ఎకరాల్లో క్యాంపస్ ఏర్పాటు చేయడానికి బిట్స్ ఆసక్తి చూపిస్తోంది. ఇప్పటికే నవులూరు పరిసర ప్రాంతాల్లో రెండు చోట్ల బిట్స్‌ తన క్యాంపస్‌ను ఏర్పాటు చేయడానికి అనువైన స్థలాలను పరిశీలించాయి.

బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (బిట్స్) తన కొత్త క్యాంపస్‌ను అమరావతిలో ఏర్పాటు చేయాలని ఆసక్తి చూపిస్తున్నట్లు సిఆర్‌డిఏ వర్గాలు తెలియజేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏపీలో పెట్టుబడులు పెట్టాలనుకునే అన్ని ప్రముఖ సంస్థలను ఆహ్వానిస్తూ, విద్యా సంస్థల ఏర్పాటు కోసం అందుబాటులో ఉన్న అవకాశాలను వివరిస్తోంది. రాజధానిలో ఇప్పటికే కొన్ని విద్యా సంస్థలు విజయవంతంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో, బిట్స్‌ కూడా అమరావతిలో తన క్యాంపస్‌ను స్థాపించడానికి సుముఖత వ్యక్తం చేసింది.

అందులో భాగంగా, బిట్స్‌ తన క్యాంపస్‌ కోసం ఏపీలో ప్రాంగణం నిర్మించేందుకు ఉత్సాహంగా ఉంది. రాజస్థాన్‌లోని పిలానీలో ఉన్న బిట్స్‌ ఇప్పటికే గోవా, హైదరాబాద్, దుబాయ్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు, అమరావతిలో నాలుగో క్యాంపస్‌ స్థాపనకు సిద్ధమవుతోంది. బిట్స్‌ 50 ఎకరాల విస్తీర్ణంలో క్యాంపస్‌ ఏర్పాటు కోసం అనువైన స్థలాలను ఏపీ రాజధాని ప్రాంతంలో పరిశీలిస్తోంది.

బుధవారం, సీఆర్డీఏ అధికారులతో కలిసి బిట్స్ ప్రతినిధులు కురగల్లులోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్శిటీ సమీపంలోని స్థలం మరియు వెంకటపాలెం బైపాస్ వద్ద ఉన్న స్థలాలను పరిశీలించారు. బిట్స్‌ యాజమాన్యంతో చర్చలు జరిపిన తర్వాత, క్యాంపస్ ఏర్పాటు పై తుది నిర్ణయం తీసుకోవాలని బిట్స్ ప్రతినిధులు సీఆర్డీఏ వర్గాలకు తెలియజేశారు. బిట్స్ క్యాంపస్ అమరావతిలో ఏర్పాటు అయితే, రాజధాని ప్రాంతం విద్యా కేంద్రంగా మరింత అభివృద్ధి చెందే అవకాశముంది.