Punganur : పుంగ‌నూరు అల్ల‌ర్ల‌లో మ‌రో తొమ్మిది మంది అరెస్ట్‌

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా చెలరేగిన పుంగనూరు హింసాత్మక ఘటనకు సంబంధించి

  • Written By:
  • Updated On - August 8, 2023 / 07:02 AM IST

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పుంగ‌నూరు  పర్యటన సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనకు సంబంధించి మరో తొమ్మిది మందిని చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు ఈ కేసులో 72 మందిని అరెస్టు చేశారు. హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు, పుంగనూరు టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి చల్లా బాబు పరారీలో ఉన్నారు. ఆయ‌న్ని పట్టుకునేందుకు ఆరు పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. ఏఎస్పీ శ్రీలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. చంద్రబాబు పుంగనూరులో బైపాస్ రోడ్డు వేలాల్సి ఉండగా.. పుంగ‌నూరు టౌన్‌లోకి వ‌చ్చేందుకు ప్ర‌య‌త్నించార‌ని తెలిపారు. దీంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆ స‌మ‌యంలో టీడీపీ కార్య‌క‌ర్త‌లు విధ్వంసం సృష్టించార‌ని ఏఎస్పీ తెలిపారు. పుంగనూరులో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు నిందితులు కుట్ర పన్నారని… రాళ్లు, కర్రలు, ఖాళీ బీరు బాటిళ్లతో వచ్చి పోలీసులతో వాగ్వాదానికి దిగారని తెలిపారు. అల్ల‌ర్ల‌ సమయంలో పోలీసులపై దాడి చేసి రెండు పోలీసు వాహనాలకు నిప్పుపెట్టారని ఏఎస్పీ తెలిపారు
.
పోలీసుల ఆంక్షలు ఉన్నా పుంగనూరులో చంద్ర‌బాబు ప్రవేశించేందుకు వీలుగా చల్లా బాబు పథకం రచించారు. చంద్ర‌బాబును పట్టణంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే పోలీసులపై దాడి చేయాలని టీడీ కార్యకర్తలను చ‌ల్లా బాబు రెచ్చ‌కొట్టార‌ని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఆగస్టు 4న టీడీపీ కార్య‌క‌ర్త‌ల‌ను రెచ్చగొట్టేందుకు ప్రణాళిక రూపొందించేందుకు ఆగస్టు 2న సమావేశం నిర్వహించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. పుంగనూరు హింసాత్మక ఘటనపై విచారణ ముమ్మరం కాగా, చల్లాబాబును అరెస్ట్ చేసేందుకు జిల్లా పోలీసులు ప్రయత్నాలు కొనసాగించారు. ఏపీ-కర్ణాటక సరిహద్దులోని చెక్‌పోస్టు నుంచి సీసీటీవీ ఫుటేజీలతో సహా ఆధారాలు సేకరిస్తున్న అధికారులు ఆగస్టు 4న అనంతపురం, బెంగళూరు, రాయచోటి నుంచి వచ్చిన టీడీపీ కార్య‌క‌ర్త‌ల కదలికలపై వివరాలు సేకరిస్తున్నారు.