Telugu states : ఏపీ, తెలంగాణ‌కు మ‌రో నేష‌న‌ల్ హైవే! విలీనమా?

ఏపీ ,తెలంగాణ రాష్ట్రాల‌ను(Telugu States) క‌లిపే మ‌రో జాతీయ ర‌హ‌దారి రాబోతుంది.

  • Written By:
  • Publish Date - December 19, 2022 / 01:33 PM IST

ఏపీ ,తెలంగాణ(AP-Telangana) దూరం త‌గ్గిపోనుంది. రెండు రాష్ట్రాల‌ను(Telugu states) క‌లిపేలా మ‌రో జాతీయ ర‌హ‌దారి రాబోతుంది. అందుకు సంబంధించిన స‌మాచారాన్ని కేంద్రం వెల్ల‌డించింది. రెండేళ్ల వ్య‌వ‌ధిలోనే ఈ ర‌హ‌దారిని పూర్తి చేయాల‌ని కేంద్రం ప్లాన్ చేస్తోంది. అందుకు సంబంధించిన ప్యాకేజీల‌ను ప్రాథ‌మికంగా నిర్థారించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి(2023) తొలి వారంలో టెండర్ల ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఈ జాతీయ ర‌హ‌దారిని ఏడాదిన్నర కాలంలో పూర్చి చేయాలని కేంద్రం ల‌క్ష్యంగా పెట్టుకుంది. తెలంగాణ(Telangana)లోని నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి ఏపీ(AP)లోని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు 255 కిలోమీటర్ల మేర ఈ రహదారి నిర్మాణం కానుంది. అందుకోసం రూ. 4,706 కోట్ల వ్యయం చేయ‌డానికి కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ రహదారిని నిర్మించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదం తెలిపింది. ఈ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా ఇప్పటికే కృష్ణానదిపై బ్రిడ్జ్ నిర్మాణానికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా టెండర్ల ప్రక్రియను చేపట్టిన విష‌యం విదిత‌మే. ఇప్పుడు నాలుగు లేన్ల రహదారి నిర్మాణాన్ని చేపట్టబోతోంది. ఈ రహదారిని తెలంగాణలో 91 కిలోమీటర్లు, ఏపీలో 164 కిలోమీటర్ల మేర నిర్మాణం కానుంది. మొత్తం ఏడు ప్యాకేజీల కింద రహదారి నిర్మాణాన్ని చేపట్టనున్నారు.

మరో జాతీయ రహదారి

ఏపీ, తెలంగాణ(AP-Telangana) రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణాన్ని వేగం చేయ‌డం ఇప్పుడు రాజ‌కీయాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. రెండు రాష్ట్రాల‌ను(Two States) మ‌ళ్లీ విలీనం చేయ‌డానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామ‌ని వైసీపీ చెబుతోంది. ఏపీలోని ఎంట్రీ ఇవ్వ‌డానికి బీఆర్ఎస్ సిద్ధం అయింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు ప్ర‌గ‌తి ప‌థాన న‌డ‌వాల‌ని బీఆర్ఎస్, వైసీపీ సంయుక్తంగా కోరుకోవ‌డం యాదృశ్చిక‌మా? వ్యూహాత్మ‌క‌మా? అనేది మ‌రో జాతీయ ర‌హ‌దారికి కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన త‌రువాత సందేహం క‌లుగుతోంది.

వాస్త‌వంగా దేశ రెండో రాజ‌ధాని అంశం బీజేపీ మేనిఫెస్టోలో ఉంది. దాన్ని సాకారం చేయ‌డానికి బీజేపీ ఈసారి అడుగులు వేస్తుంద‌ని తెలుస్తోంది. రాజ్యాంగాన్ని ర‌చించిన అంబేద్క‌ర్ కూడా దేశ రెండు రాజ‌ధాని అంశాన్ని అప్ప‌ట్లోనే ప్ర‌తిపాద‌న చేశారు. ఆ విష‌యాన్ని త‌ర‌చూ రాజ‌కీయ నేత‌లు చెబుతుంటారు. రెండేళ్ల క్రితం సీఎం కేసీఆర్ కూడా దేశ రెండో రాజ‌ధానిగా హైద‌రాబాద్ ను చేయ‌డానికి అంగీక‌రిస్తూ ప్రైవేటు ఛాన‌ల్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఆ త‌రువాత త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం చెన్నై న‌గ‌రాన్ని రెండో రాజ‌ధానిగా చేయాల‌ని తీర్మానం చేసింది. ఇంకో వైపు బెంగుళూరును దేశ రెండో రాజ‌ధానిగా చేయాల‌ని క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం తీర్మానం చేసింది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి ప్ర‌స్తుతం 33వేల ఎక‌రాలు ఉంది. అక్క‌డ దేశ రెండో రాజ‌ధాని చేయ‌డానికి అనువైన ప్రాంతంగా కొంద‌రు చెబుతున్నారు. ఇలా దేశ రెండో రాజ‌ధాని కోసం ద‌క్షిణ భార‌త రాష్ట్రాలు ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. అయితే, తాజాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌కు మ‌రో జాతీయ ర‌హ‌దారిని వేగంగా కేంద్రం చేప‌ట్ట‌డానికి సిద్దం కావ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఏపీ, తెలంగాణ మ‌ళ్లీ విలీనం

ఏపీ, తెలంగాణ మ‌ళ్లీ విలీనం కావ‌డానికి అవకాశం ఉందా? ఇరు రాష్ట్రాల రాజ‌కీయ లీడ‌ర్లు ఇటీవ‌ల రెండు రాష్ట్రాల విలీనాన్ని ర‌క్తిక‌ట్టించారు. అసెంబ్లీలో తీర్మానం చేస్తామ‌ని కూడా వైసీపీ ఒకానొక సంద‌ర్భంలో ముందుకు వ‌చ్చింది. తెలుగు రాష్ట్రాలు క‌లిసి ఉండాల‌ని కోరుకుంటున్నారు. పైగా ఇరు రాష్ట్రాల ఆస్తుల పంప‌కం ఇంకా పూర్తి కాలేదు. సుప్రీం కోర్టులో ఇటీవ‌ల జ‌గ‌న్ స‌ర్కార్ పిటిష‌న్ వేసింది. సుమారు 6ల‌క్ష‌ల కోట్ల విలువైన ఆస్తుల పంప‌కం జ‌ర‌గ‌లేదు. వాటి పంప‌కం జ‌ర‌గ‌డం సంక్లిష్టంగా ఉంది. పార్ల‌మెంట్లో విభ‌జ‌న బిల్లును ఆమోదించిన తీరు రాజ్యాంగ విరుద్ధంగా ఉంద‌ని కూడా సుప్రీం కోర్టులో పిటిష‌న్ ఉంది. ఓటింగ్ జర‌గ‌కుండా, చీక‌ట్లో బిల్లును పాస్ చేసిన అంశంపై ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ కూడా ప్ర‌స్తావించారు. తాజాగా చోటుచేసుకున్న ప‌రిణామాలు, లీడ‌ర్ల వ్యాఖ్య‌ల‌ను నిశితంగా గ‌మ‌నిస్తే మ‌ళ్లీ ఏపీ, తెలంగాణ విలీనం కాబోతున్నాయా? అనే సందేహం రేకెత్తుతోంది. దానికి బ‌లం చేకూరేలా తాజాగా మ‌రో జాతీయ ర‌హ‌దారిని కేంద్రం ప్ర‌క‌టించ‌డం స‌రికొత్త సందేహాల‌కు తావిస్తోంది.

Also Read : AP Telangana Merger : ఏపీ, తెలంగాణ మ‌ళ్లీ విలీనం?