Site icon HashtagU Telugu

Vizag : విశాఖలో మరో ఐటీ క్యాంపస్

Vizag It Capital

Vizag It Capital

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నంలో ఐటీ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖలోని కాపులుప్పాడ ప్రాంతంలో అత్యాధునిక క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్ (Quarkx Technosoft Limited) సంస్థ ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ. 115 కోట్ల పెట్టుబడి రానుంది. ఈ క్యాంపస్ ద్వారా నేరుగా 2 వేల మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక పరోక్షంగా కూడా అనేక వందల మంది యువతకు ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో విశాఖ మరోసారి ఆంధ్రప్రదేశ్ ఐటీ మ్యాప్‌లో ప్రముఖ స్థానాన్ని సంపాదించనుంది.

Delhi Blast: ఢిల్లీ బ్లాస్ట్‌లో ఉప‌యోగించిన ర‌సాయనం ఇదే.. దీన్ని ఎలా త‌యారు చేస్తారంటే?

ఈ కొత్త క్యాంపస్‌లో ప్రధానంగా అడ్వాన్స్‌డ్ డిజిటల్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతిక విభాగాలపై దృష్టి సారించనున్నారు. ఈ రంగాల్లో పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రతి ఎకరాకు రూ. 1 కోటి చొప్పున నాలుగు ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే, ప్రాజెక్టు ప్రారంభ దశలో అవసరమైన అన్ని మౌలిక వసతులు, అనుమతులు, ప్రోత్సాహకాలను అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఏపీ ఐటీ మరియు జీసీసీ పాలసీ 4.0 ప్రకారం సంస్థకు అన్ని రకాల సబ్సిడీలు, మినహాయింపులు ఇవ్వాలని ఐటీ, ఎలక్ట్రానిక్స్ విభాగం కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు.

క్వార్క్స్ టెక్నోసాఫ్ట్ లిమిటెడ్ సంస్థ రెండేళ్లలో తొలి దశ కార్యకలాపాలను ప్రారంభించి, ఐదేళ్లలో మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయనుంది. ఈ ప్రాజెక్టు విశాఖలో ఐటీ రంగ విస్తరణకు కొత్త దిశ చూపనుంది. ఇప్పటికే గూగుల్ అనుబంధ సంస్థ రూ. 1.35 లక్షల కోట్లతో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. అంతేకాక మరో సంస్థ సైతం రూ. 80 వేల కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో విశాఖపట్నం త్వరలోనే దక్షిణ భారతదేశంలో డేటా సెంటర్లు, ఐటీ ఇన్నోవేషన్ హబ్‌గా మారబోతోందని టెక్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Exit mobile version