Ambulance Unavailable: అంబులెన్స్ ‘డెత్’ సైరన్!

ఏపీలో అంబులెన్స్ దందా కొనసాగుతూనే ఉంది. డ్రైవర్ల దందా కారణంగా సామాన్యులు ఇబ్బందులు పడుతున్నారు.

  • Written By:
  • Updated On - May 6, 2022 / 03:31 PM IST

ఏపీలో అంబులెన్స్ దందా కొనసాగుతూనే ఉంది. డ్రైవర్ల దందా కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. శవాన్ని తరలిచేందుకు నో చెప్తుండటంతో ద్విచక్ర వాహానాలపై తరలించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఏపీలో 10 రోజుల వ్యవధిలో రెండో సంఘటన జరగడం చర్చనీయాంశమవుతోంది. ఈ వరుస ఘటనలు ప్రభుత్వ ఆస్పత్రుల వైఖరిని స్పష్టం చేస్తున్నాయి. ఎనిమిదేళ్ల బాలుడి మృతదేహాన్ని అంబులెన్స్ డ్రైవర్ నిరాకరించడంతో, బంధువులు మోటర్‌సైకిల్‌పై తీసుకెళ్లారు. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో బుధవారం జరిగింది. సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహాలను శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు ఉద్దేశించిన ‘మహాప్రస్థానం’ వాహనం అందుబాటులో లేదని చెబుతూ.. ‘108’ అంబులెన్స్ డ్రైవర్ మృతదేహాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించాడని బంధువులు ఆరోపించారు.

కాగా కనిగిరి జలాశయం ప్రధాన కాలువలో బుధవారం ప్రమాదవశాత్తు శ్రీరాములు, ఈశ్వర్ (10) గల్లంతయ్యారు. ఈశ్వర్ మృతదేహాన్ని బంధువులు కాలువపై నుంచి ఇంటికి తీసుకెళ్లగా, శ్రీరామ్‌ను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీరామ్ బంధువులు ప్రభుత్వం ఉచితంగా నిర్వహించే 108 అంబులెన్స్‌ను సంప్రదించగా.. నిబంధనలు అనుమతించడం లేదని డ్రైవర్ నిరాకరించాడు. ‘మహాప్రస్థానం’ వాహనం కూడా అందుబాటులో లేకపోవడంతో మరో వాహనం ముందుకు రాకపోవడంతో బాలుడి బంధువులు మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తీసుకెళ్లారు. 10 రోజుల్లో రాష్ట్రంలో ఇలాంటి ఘటన జరగడం ఇది రెండోసారి.

గత నెల ఏప్రిల్ 25న తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్ భారీగా డబ్బులు డిమాండ్ చేయడంతో ఓ వ్యక్తి తన 10 ఏళ్ల కుమారుడి మృతదేహాన్ని మోటర్‌బైక్‌పై తీసుకెళ్లాడు. చార్జీలు చెల్లించలేక ఆ వ్యక్తి మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. బాలుడు అనారోగ్యంతో RUIA ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఆసుపత్రి వద్ద అంబులెన్స్ డ్రైవర్లు మృతదేహాన్ని తరలించేందుకు రూ.10 వేలు డిమాండ్ చేశాడనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.