ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన రాజ్యసభ సీటుపై ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏర్పడిన ఖాళీకి ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. నామినేషన్లకు నెలాఖరు వరకు గడువు ఉన్నప్పటికీ, ఈ సీటు కూటమి (టీడీపీ-బీజేపీ-జనసేన) కైవసం చేసుకోవడం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీ అభ్యర్థిని నిలబెట్టే పరిస్థితిలో లేనందున పోటీ లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ఈ సీటును కూటమిలోని ఏ పార్టీకి కేటాయించబోతున్నారన్నదే ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
Raj Kasireddy: ఏపీ మద్యం కుంభకోణంలో ప్రధాన నిందితుడు కసిరెడ్డి అరెస్ట్!
తమిళనాడుకు చెందిన బీజేపీ నేత అన్నామలై (Annamalai) పేరు అనూహ్యంగా తెరపైకి రావడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. మొదట్లో కిరణ్ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించినా, తాజాగా అన్నామలై పేరు బలంగా వినిపిస్తోంది. తమిళనాడులో బీజేపీకి రాజ్యసభకు అవసరమైన బలం లేకపోవడంతో పాటు, అన్నాడీఎంకేతో పొత్తు సాధించేందుకు అన్నామలైను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించడం ఆయనకు న్యాయం జరగలేదన్న భావన కలిగించిందని అంటున్నారు. అందుకే బీజేపీలో ఆయనకు పదవిని ఇచ్చి, పార్టీ కష్టపడిన వారికి గౌరవం ఇస్తుందన్న సంకేతం పంపించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇది తొలి సారి కాదు – ఇప్పటికే ఏపీ నుంచి పలువురు ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలు రాజ్యసభకు ఎన్నికయ్యారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు ఆర్. కృష్ణయ్య, గుజరాత్‌కు చెందిన పారిమళ్ నత్వానీ, తెలంగాణకు చెందిన లాయర్ నిరంజన్ రెడ్డిలు వైసీపీ తరఫున ఏపీ నుంచి ఎంపీలుగా రాజ్యసభకు వెళ్లారు. ఇప్పుడు అన్నామలై కూడా అదే బాటలో నడిస్తే, ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లే నాలుగో ఇతర రాష్ట్రం వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు.
ఈ అంశంపై రాష్ట్ర ప్రజలలో అసహనం కూడా వ్యక్తమవుతోంది. స్థానిక ఎమ్మెల్యేలు గెలిపించిన ఓట్లతో ఇతర రాష్ట్రాల నాయకులను ఏపీ తరఫున రాజ్యసభకు పంపడాన్ని ప్రజలు సెంటిమెంట్‌గా తీసుకుంటున్నారు. ఈ తరహా నిర్ణయాలు ప్రాంతీయ గర్వానికి భంగం కలిగించే అవకాశం ఉండడంతో, కూటమి నాయకులు ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అయినా కూడా అన్నామలై పేరు ప్రచారంలోకి రావడం, బీజేపీ అంతర్గత పరిణామాలను చూస్తే, ఆయనకు ఈ అవకాశం దక్కే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.