ఆంధ్రప్రదేశ్ 2025-26 బడ్జెట్(AP Budget 2025-26)లో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రసంగంలో అన్నదాత సుఖీభవ (Annadata Sukhibhava) పథకం కింద ప్రతి రైతుకు ఏటా రూ.20,000 అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అనే దృష్టితో ఈ కొత్త పథకాన్ని అమలు చేయనున్నారు. మే నెల నుంచి అమలులోకి రానున్న ఈ పథకానికి రూ.9,400 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా రైతులు విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ ఖర్చులకు తగిన ఆర్థిక సాయం పొందగలుగుతారు.
బడ్జెట్ లో వ్యవసాయానికి మరిన్ని ప్రోత్సాహకాలు
రైతులకు మద్దతుగా ప్రభుత్వం మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 21.87 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 9 గంటల ఉచిత పగటిపూట విద్యుత్ అందించనున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే, మత్స్యకారులకు చేపల వేట నిషేధ కాలంలో అందించే ఆర్థిక సహాయాన్ని రూ.10,000 నుంచి రూ.20,000 కు పెంచుతున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు, వ్యవసాయ రాబడిని మెరుగుపరిచేందుకు ధాన్యం సేకరణ ప్రక్రియను ప్రామాణికంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2024 ఖరీఫ్ కాలంలో 5.50 లక్షల మంది రైతుల నుంచి 32.7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి, రూ.7,564 కోట్లు చెల్లించినట్లు మంత్రి వివరించారు.
రైతుల సంక్షేమానికి నూతన ఆర్థిక ప్రణాళికలు
రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను చేపడుతోంది. మథ్యాహ్న భోజన పథకం క్రింద ప్రభుత్వ పాఠశాలలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేయనున్నట్లు వెల్లడించారు. అంతేగాక, గత ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ధాన్యం బకాయిలను పూర్తిగా చెల్లించినట్లు తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తిని పెంపొందించేందుకు, రైతులకు తగిన మద్దతు ధర, సమర్థవంతమైన రబీ, ఖరీఫ్ ప్రణాళికలను రూపొందిస్తున్నామని మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మరింత అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.