Nellore Politcs: మాజీ, తాజా మంత్రుల మ‌ధ్య వార్

ఉన్న నాలుకకు మందేస్తే.. కొండ నాలుక ఊడిందట. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఇలాగే తయారైందా?

  • Written By:
  • Updated On - April 15, 2022 / 12:20 PM IST

ఉన్న నాలుకకు మందేస్తే.. కొండ నాలుక ఊడిందట. ఇప్పుడు వైసీపీ పరిస్థితి ఇలాగే తయారైందా? ఎందుకంటే.. మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ విధానం.. వైసీపీలో కొంతమందికి అస్సలు నచ్చలేదు. మంత్రులుగా మాజీలు అయినవాళ్లలో కొందరికి తృప్తి లేదు. కొత్తగా మంత్రులు అవుతామనుకున్నవాళ్లు… దానికోసం ఎదురుచూసి భంగపడ్డారు. అలాంటి నేతలకూ బాధ తగ్గడం లేదు. అందుకే నెల్లూరు జిల్లా నేతలు అయిన అనిల్ కుమార్ యాదవ్ వర్సెస్ కాకాని అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఇది ఎక్కడ ఇతర జిల్లాలకు పాకుతుందో అని పార్టీ నాయకత్వం ఆందోళనతో ఉన్నట్టు తెలుస్తోంది.

నెల్లూరు జిల్లా.. వైసీపీకి చాలా కీలకం. అలాంటి చోట ఇలా వర్గపోరు మొదలైతే.. అది మొదటికే చేటు తీసుకురావడం ఖాయం. ఎందుకంటే కాకాణికి మీరు సహకారం అందిస్తారా అని అనిల్ కుమార్ ను అడిగితే.. తాను మంత్రిగా ఉన్నప్పుడు కాకాణి ఎలాంటి ప్రేమ, వాత్సల్యం, సహకారం అందించాలో.. తను కూడా రిటర్న్ గిఫ్ట్ గా వాటిని అందిస్తామన్నారు. దీనిని బట్టి జిల్లాలో ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యా రాజకీయవైరం తప్పదు అని స్పష్టంగా అర్థమవుతోంది. మంత్రివర్గ ప్రమాణస్వీకారానికి తనను కాకాణి పిలవలేదని.. అలాంటప్పుడు తాను ఎలా వెళతానని
అనిల్ కుమార్ చెప్పారు. జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రిగా కాకాణి అవసరం అని భావిస్తే ఆహ్వానిస్తామన్నారు అనిల్. దీనిని బట్టి ఇద్దరు నేతల మధ్యా పొలిటికల్ వార్ ఫుల్ రేంజ్ లో ఉందని అర్థమవుతోంది. ఇక రాజకీయాల్లో శత్రువులు ఉండరని అంటారు. అందుకే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డితో చేతులు కలిపారు అనిల్. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలో ఉన్న సజ్జపురంలో వీరి భేటీ జరిగింది.

ఇప్పుడు కోటంరెడ్డి, అనిల్.. ఇద్దరూ జిల్లా రాజకీయాలను ఎలాంటి మలుపు తిప్పబోతున్నారు అన్నది హాట్ టాపిక్ గా మారింది. కాకాణితో కలిసి అడుగులు వేస్తారా.. లేక రాజకీయ వైరాన్ని కొనసాగిస్తారా అన్న చర్చ వైసీపీ కార్యకర్తల మధ్య మొదలైంది. కాకాణి జిల్లాకు వచ్చే రోజే అనిల్ కార్యకర్తల సమావేశం పెట్టారు. అంటే కాకాణి స్వాగత కార్యక్రమానికి ఎవరూ వెళ్లకుండా ప్లాన్ చేశారా అన్న చర్చ నడుస్తోంది. దీంతో నెల్లూరు జిల్లా రాజకీయాలు ఇప్పుడు హాట్ హాట్ గా మారాయి.