Sajjala: అంగన్‌వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలి: సజ్జల

  • Written By:
  • Updated On - January 13, 2024 / 06:03 PM IST

Sajjala: వేతనాల పెంపుతో పాటు గ్రాట్యుటీ కోసం అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు ఆందోళన చేస్తున్నారు. సమ్మె చేస్తున్న అంగన్ వాడీ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపింది. అయితే ఈ చర్చలు సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో అంగన్‌వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలని, తెగే వరకు లాగొద్దని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హెచ్చరించారు. ఈ సమ్మె వెనుక పొలిటికల్ అజెండా ఉందని.. తెగేవరకు లాగకుండా అంగన్‌వాడీలు సమ్మె విరమించి విధుల్లో చేరాలని మళ్లీ కోరుతున్నామన్నారు. జులైలో జీతాలు పెంచుతామని ఆయన వివరించారు.

అంగన్‌వాడీలకు ఎన్నికల తర్వాత జీతాలు పెంచుతామన్నారు. జీతాలు ఐదు సంవత్సరాలు వరకు పెంచకూడదన్న నియమం ఏర్పరచుకున్నామని తెలిపారు. పట్టుదలకి పోకుండా విరమించాలని సూచించారు. అంగన్‌వాడీలు విధుల్లో చేరకుంటే నిబంధనల ప్రకారం కొత్తవారిని రిక్రూట్‌ చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, పిల్లలకు ఇబ్బంది కలుగకూడదనే ఎస్మా పరిధిలోకి తెచ్చామన్నారు. అయితే, అంగన్‌వాడీల ఉద్యమం కొనసాగుతుందని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సుబ్బారావమ్మ, బేబీ రాణి, ఎన్‌సీహెచ్‌ సుప్రజ స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో సమ్మె చేస్తున్న అంగన్ వాడీలపై ప్రభుత్వం ఊహించని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అంగన్ వాడీలపై ఎస్మా చట్టం ప్రయోగించింది. అంగన్ వాడీలను ఎమర్జెన్సీ సర్వీసులలోకి చేర్చి, ఆరు నెలల పాటు సమ్మెలు, నిరసనలు నిషేధమంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శనివారం జీవో నెం.2 విడుదల చేసింది. గడిచిన రోజులుగా సమ్మె చేస్తున్న అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్ల వేతనాల్లోనూ ప్రభుత్వం కోత విధించింది. సమ్మెలో ఉన్న కాలానికి సంబంధించి వేతనం కట్ చేసింది.

నెలనెలా వర్కర్ల ఖాతాలో పడుతున్న రూ. 10 వేల వేతనం స్థానంలో ప్రభుత్వం ఈ నెల రూ.8050 మాత్రమే జమ చేసింది.  దీంతో అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు సమ్మె నిర్వహిస్తున్నారు. ఎస్సెన్సియల్ సర్వీసెస్ మెయిన్ టెనెన్స్ యాక్ట్ నే ఎస్మాగా పిలుస్తారు. సమ్మెలు, ఇతరత్రా నిరసన కార్యక్రమాలతో ప్రజల సాధారణ జీవనానికి ఇబ్బందులు కలగకుంగా ఉండేందుకు గాను 1981లో ఎస్మా చట్టాన్ని రూపొందించారు.