AP Debts : అప్పుల కుప్పగా మారిన ఆంధ్రప్రదేశ్.. ఒక్కొక్కరిపై ఎంత అప్పు ఉందంటే..!

ఆంధ్రప్రదేశ్ ను అప్పుల బాధలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రూ.7.76 లక్షల కోట్లు రుణభారం రాష్ట్రానికి ఉంది.

  • Written By:
  • Publish Date - March 29, 2022 / 11:44 AM IST

ఆంధ్రప్రదేశ్ ను అప్పుల బాధలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే రూ.7.76 లక్షల కోట్లు రుణభారం రాష్ట్రానికి ఉంది. ఇందులో పెండింగ్ బిల్లులు కూడా కలిసి ఉన్నాయి. రాష్ట్ర జీఎస్డీపీలో ఏటా 4 శాతానికి మించి రుణాలు తీసుకోకూడదు. కానీ ఏపీ సర్కార్ మాత్రం అప్పులు తీర్చడానికి మళ్లీ అప్పులు చేస్తోంది. ఇది ప్రమాదకరమైన సంకేతాలను పంపిస్తోందని కాగ్ ఇప్పటికే హెచ్చరించింది. మరిప్పుడు ఏపీ పరిస్థితి ఏమిటి?

ప్రభుత్వాలు అప్పు తీసుకోవడం మామూలే. గతంలో బహిరంగ మార్కెట్ లో ఐదేళ్లలోపు కాలపరిమితితో అప్పు తీసుకునేవారు. అంటే ఒక ప్రభుత్వం చేసిన అప్పును తరువాతి ప్రభుత్వ హయాంలో తీరేది. కానీ కొన్నాళ్లుగా ఈ పరిమితి విషయంలో వెసులుబాటు ఇచ్చారు. దీనివల్ల 20 ఏళ్ల కాలపరిమితితో కూడా రుణాలు తీసుకోవచ్చు. అలా కూడా ఏపీ సర్కారు తీసుకుంటోంది. దీంతో అప్పుల భారం పెరిగిపోతోంది.

అప్పుల మాట అటుంచితే.. మూడేళ్లుగా.. కాంట్రాక్టర్లకు, సరఫరాదారులకు, ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ సర్కార్ చెల్లించాల్సిన బకాయిలే దాదాపు రూ.1,50,000 కోట్లు ఉన్నాయి. సీఎఫ్ఎంఎస్ వెబ్ సైట్ లో సమాచారం ప్రకారం చూసినా.. ఈ మొత్తం రూ.60 వేల కోట్లు దాటేసింది. అందుకే అప్పుల భారం మొత్తాన్ని లెక్కేస్తే.. రూ.7.76 లక్షల కోట్లకు చేరిందని అంచనా వేస్తున్నారు. ఇది ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది.

2021-22 ఆర్థిక సంవత్సంలో చివరి విడత రుణ అవకాశాన్నీ కూడా ఏపీ సర్కారు వదలలేదు. అందుకే రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలంలో పాల్గొని.. రూ.943 కోట్ల రుణాన్ని పొందడానికి ప్లాన్ చేసింది. రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా.. 20 ఏళ్ల కాలపరిమితితో ఈ అప్పును తీసుకోవడం వల్ల భారం మరింతగా పెరుగుతుంది. అప్పులతోపాటు దానికి కట్టాల్సిన వడ్డీలు కూడా భారీగా ఉన్నాయి. ఏపీలో తలసరి అప్పు దాదాపు రూ. 1,00,000 కు చేరి ఉండొచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి.