కాలం దేనినైనా మారుస్తుంది అంటారు. జగమొండిని అనిపించుకున్న ఏపీ సీఎం జగన్ ను కూడా అలాగే కాలం మార్చిందా? ఇటీవలి పరిణామాలను పరిశీలిస్తే.. అవుననే అంటున్నారు విశ్లేషకులు. అందుకే తన క్యాబినెట్ మొత్తాన్ని మారుస్తానని చెప్పిన జగన్.. 11 మంది పాతవారిని కొనసాగించాల్సి వచ్చింది. ముందు ఒకరిద్దరు పాతవారికే ఛాన్స్ అన్నారు. తరువాత ఐదారుగురు అన్నారు. ఆపై 11 మందికి ఓకే చెప్పాల్సి వచ్చింది. పదవి పోయిన మంత్రులు అలగడంతో వారిని బుజ్జగించడానికి జగనే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చింది. సజ్జల, మోపిదేవి వంటివారిని రంగంలోకి దించినా ఫలితం లేకపోయింది. అందుకే బాలినేని, సుచరిత లాంటివారితో స్వయంగా భేటీ కాక తప్పలేదు. వారి డిమాండ్లకు తలొగ్గారనీ అంటున్నారు. ఒంగోలు పర్యటన సమయంలో బాలినేనికి కీలక పదవిని ఇస్తామని ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. ఇక సుచరిత సంగతి కూడా అంతే.
పదవి పోయి అలిగిన ఇతర మాజీ మంత్రులతోపాటు మంత్రి పదవిని ఆశించి భంగపడ్డ ఎమ్మెల్యేలతోనూ జగన్ భేటీ కావాల్సి వచ్చింది. మధ్యవర్తుల ద్వారా చేసిన రాజీ ప్రయత్నాలు అస్సలు వర్కవుట్ కాలేదు. అందుకే వేరే దారి లేక జగనే వారిని బుజ్జగించి.. వారికి తగిన హామీలను ఇవ్వాల్సి వచ్చిందంటున్నాయి వైసీపీ వర్గాలు. అంటే జగన్ రాజకీయంగా ఓ మెట్టు దిగాడనే భావిస్తున్నారు విశ్లేషకులు. 2019లో 151 ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుని రావడం వల్ల తనకు ఎదురులేదనే భావన జగన్ లో కనిపించింది. తొలి మూడేళ్లు దాదాపుగా అదే నడిచింది. కానీ ఇప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో జగన్ కు అసమ్మతి పవర్ ఏమిటో తెలిసొచ్చింది. తన మాటే శాసనం అనుకునే స్థాయి నుంచి.. చెప్పింది వినడం కూడా అలవాటు చేసుకోవడం వరకు వచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పార్టీలో ఎక్కడా అసమ్మతి రాగం వినపడకుండా ముందే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. దీనిలో భాగంగానే పార్టీ నేతల ఒత్తిళ్లకు లొంగుతున్నారంటున్నారు విశ్లేషకులు.