Andhrapradesh: ఏపీ ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్.. 9 మంది విద్యార్థులు ఆత్మహత్య

ఏపీ (Andhrapradesh) ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు (Intermediate Results) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 9 మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, తక్కువ మార్కులు వచ్చాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు.

  • Written By:
  • Publish Date - April 28, 2023 / 10:35 AM IST

10వ తరగతి, ఇంటర్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు ఏటా జరుగుతున్నాయి. తాజాగా ఏపీ (Andhrapradesh) ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు (Intermediate Results) విడుదలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన 9 మంది విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని, తక్కువ మార్కులు వచ్చాయని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మరో ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం ఈతవాకిలికి చెందిన విద్యార్థిని అనూష(17) ఇంటర్‌లో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపం చెంది గురువారం చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.

అనూష ఇటీవల కర్ణాటకలోని తన అమ్మమ్మ గ్రామానికి వెళ్లింది. బుధవారం విద్యార్థిని తల్లి ఫోన్ చేసి ఓ సబ్జెక్టులో ఫెయిల్ అయ్యిందని చెప్పింది. రెండు రోజుల్లో వచ్చి పరీక్ష ఫీజు కట్టి ఈసారి పాస్ చేస్తానని తల్లితో చెప్పింది. అయితే ఉదయం కుమార్తె మరణవార్త విని దిక్కుతోచని తల్లిదండ్రులు కర్ణాటక వెళ్లి కన్నీరుమున్నీరుగా విలపించారు. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లెకు చెందిన కృష్ణప్ప కుమారుడు బాబు (17) ఇంటర్ ఎంపీసీ ద్వితీయ సంవత్సరంలో గణితం సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించలేదు. దీంతో బుధవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Also Read: Helicopters Crash: కూలిపోయిన రెండు ఆర్మీ హెలికాప్టర్లు.. అమెరికాలో ఘటన

అనకాపల్లికి చెందిన కారుబోతు రామారావు, అప్పలరమణ దంపతుల చిన్న కుమారుడు కారుబోతు తులసి కిరణ్ (17) ఇంటర్ మొదటి సంవత్సరం మార్కులు తక్కువ రావడంతో గురువారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పరీక్ష రాయకపోవడంతో మనస్తాపానికి గురైన శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం గ్రామానికి చెందిన బాలక తరుణ్ (17) గురువారం తెల్లవారుజామున టెక్కలిలో రైలు ఢీకొని మృతి చెందాడు.

విశాఖపట్నానికి చెందిన ఆత్మకూరు అఖిలశ్రీ(16) ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదనే మనస్తాపంతో గురువారం ఆత్మహత్య చేసుకుంది. తల్లి కూలి పనులు చేస్తూ కూతురిని చదివిస్తోంది. మృతదేహాన్ని రహస్యంగా శ్మశాన వాటికకు తరలిస్తుండగా.. పోలీసులు అడ్డుకుని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. విశాఖ పల్నాటి కాలనీ శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్న బోనెల జగదీష్ (18) ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సబ్జెక్టులో ఉత్తీర్ణత సాధించకపోవడంతో మనస్తాపం చెంది గురువారం ఉదయం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం హనకనహాల్ గ్రామానికి చెందిన మహేష్ (17) ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయలేదు. బుధవారం ఫలితాలు వెలువడడంతో తల్లిదండ్రులు ప్రశ్నించారు. దీంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు.