AP Power Cuts: ఈచీకట్లకు బాధ్యులెవరు?

పరిమితికి మించి విద్యుత్ కోతలు విధిస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

  • Written By:
  • Updated On - April 8, 2022 / 12:23 PM IST

గత రెండురోజులుగా ఆంధ్రప్రదేశ్ లో అంధకారం నెలకొంది. పరిమితికి మించి విద్యుత్ కోతలు విధిస్తుండటంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యుత్ కోతల కారణంగా అమానవీయ సంఘటనలు సైతం చోటుచేసుకుంటున్నాయి. కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని గంటలపాటు విద్యుత్ కోత కారణంగా డాక్టర్లు సెల్ ఫోన్ టార్చ్, కొవ్వొత్తుల సాయంతో ప్రసవం చేయవలసి వచ్చింది. దాదాపు ఎనిమిది గంటల పాటు కరెంటు కోతలు విధించడంతో గురువారం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. పూర్తిగా చీకట్లు అలుముకోవడంతో ఓ మహిళ టార్చ్ లైట్ సాయంతో పసిబిడ్డ సపర్యలు చేస్తున్న దృశాలు సైతం ప్రతిఒక్కరిని కలిచివేస్తున్నాయి. కరెంటు కోత వల్ల ఆసుపత్రిలో అనేక మంది రోగులు ఇబ్బంది పడుతున్నారు.

“ఇది పేరుకే పెద్ద ఆస్పత్రి, కానీ కనీస సౌకర్యాలు లేవు. జనరేటర్ కూడా పాడైపోయినట్లు తెలుస్తోంది. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో దోమల భయం కూడా నెలకొంది’’ అని సంబంధిత రోగి అటెండర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయమై విశాఖపట్నం జిల్లా కోఆర్డినేటర్ హాస్పిటల్ సర్వీసెస్ రమేష్ కిషోర్  (DCHS) మాట్లాడుతూ నర్సీపట్నంలోని ఆసుపత్రికి సంబంధించిన ప్రత్యేక ఘటనపై అధికారులు ఆరా తీశారని చెప్పారు. ”ఆసుపత్రి డీజిల్ ఇన్వర్టర్ జనరేటర్‌లో కొన్ని గంటల పాటు పనిచేసింది. ఆ తర్వాత పనిచేయడం నిలిచిపోయింది. డీజిల్ కూడా అందుబాటులో లేదు. దీనికితోడు కరెంట్ కూడా లేదు. అంతకు మించి చేసేదేమీ లేకపోవడంతో డెలివరీ చేయాల్సి వచ్చింది. సాంకేతిక నిపుణులు సందర్శించి జనరేటర్‌ను సరిచేశారు ”అని అతను చెప్పాడు. “రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల నిన్న (ఏప్రిల్ 6) కరెంటు కోత ఏర్పడింది. అనకాపల్లి, నర్సీపట్నం లాంటి శివార్లలో కూడా విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయన్నారు. కరెంట్ కోతలతపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సహా ప్రతిపక్ష టీడీపీ నాయకులు ఈ అంశాన్ని హైలైట్ చేశారు.

“ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీకటిలో పడింది. తీవ్ర కరెంటు కోతలతో ప్రజలు నరకం చూస్తున్నారు. గ్రామాల్లో అనధికార కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రసూతి ఆసుపత్రుల్లో గర్భిణులు, బాలింతలు పడుతున్న అవస్థలపై ముఖ్యమంత్రి స్పందన ఏమిటి?’’ “మన రాష్ట్రంలో ఈ చీకటికి బాధ్యులెవరు? అసలు రాష్ట్రంలో కరెంటు ఎందుకు లేదు? కరెంటు కోతలపై ప్రశ్నించిన సామాన్యులపై బెదిరింపులు ఆపాలి. సమస్యను పరిష్కరించాలి‘‘ చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రకటించిన విద్యుత్ ఛార్జీల పెంపునకు వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు నిన్న రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. పెంపును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాలు, ర్యాలీలు, వినూత్న నిరసనలు నిర్వహించాయి. టార్చ్ లైట్ సాయంతో ప్రసవం జరిగిన ఘటన ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారింది.