Site icon HashtagU Telugu

WhatsApp scam:వాట్సాప్ లో వచ్చిన లింక్ క్లిక్ చేస్తే.. బ్యాంకు ఖాతాలో రూ.21 లక్షలు ఖాళీ!

Whatsapp Scam

Whatsapp Scam

సైబర్ మోసాలపై ఎన్నో వేదికలు, మాధ్యమాల ద్వారా అవగాహన కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నా.. కొందరు మోసపోతూనే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఓ టీచర్ కూడా అలాగే తాజాగా మోసపోయారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం రెడ్డప్ప నాయుడు కాలనీకి చెందిన వరలక్ష్మి తనకు జరిగిన మోసంపై పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగు చూసింది.

ఆమెకు గుర్తు తెలియని నంబర్ నుంచి లింక్ ఒకటి వాట్సాప్ సందేశంగా వచ్చింది. దానిపై క్లిక్ చేయగా, బ్యాంకు ఖాతా నుంచి రూ.21 లక్షలను సైబర్ నేరస్థులు ఊడ్చేశారు. లింక్ పై క్లిక్ చేసిన తర్వాత ఆమె బ్యాంకు ఖాతాను హ్యాక్ చేసి, ఖాతాలో ఉన్న బ్యాలన్స్ అంతటినీ ఒకే లావాదేవీగా ట్రాన్స్ ఫర్ చేసేశారు.

దీంతో ఆమె బ్యాంకును ఆశ్రయించగా, ఖాతాలో మోసం చోటు చేసుకుందని, ఖాతా నుంచి రూ.21 లక్షలు దొంగిలించినట్టు వారు చెప్పారు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు. లింక్ లను క్లిక్ చేసిన వెంటనే, బాధితుల ఫోన్ నంబర్ ఆధారంగా వారి బ్యాంకు ఖాతా, ఇతర వివరాలను తెలుసుకుని మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే వెబ్ లింక్ ను క్లిక్ చేయవద్దని సూచిస్తున్నారు.

Exit mobile version