Good Bye To RC Cards : ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ కీలక నిర్ణయం ప్రకటించింది. వాహనదారులకు రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్‌సీలు ఇకపై కార్డు రూపంలో ఉండవని వెల్లడించింది. సంబంధిత యాప్‌లో డౌన్‌లోడ్ చేసిన పత్రాలే దీనికి సరిపోతాయని తెలిపింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు లైసెన్సులు, ఆర్సీ కార్డులకు రూ.200, పోస్టల్ సర్వీస్‌కు రూ.25 కలుపుకొని మొత్తం రూ.225 చలానాతో కలిపి వసూలు చేసేవారు. ఇకపై ఆ ఛార్జీలను వసూలు చేయరు. ఇప్పటికే లైసెన్సులు, ఆర్సీలకు డబ్బులు చెల్లించిన వాహనదారులకు మాత్రం త్వరలోనే కార్డులను అందజేయనున్నారు. రవాణా శాఖకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ‘పరివాహన్ ’తో సేవలన్నీ ఆన్‌లైన్ చేసింది. లైసెన్సులు, ఆర్సీ కార్డులను తొలగించి, డిజిటల్ రూపంలోనే పత్రాలను తీసుకొచ్చింది. ఇప్పుడు ఏపీలోనూ అదే పద్ధతిని అమల్లోకి తెచ్చారు.
ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..
రవాణాశాఖ వెబ్‌సైట్ “ఏపీ ఆర్‌టీఏ సిటిజన్”లోకి వెళ్లి మనం ఫారం 6 లేదా ఫారం 23ని డౌన్‌లోడ్ చేసుకొని సర్టిఫికెట్ పొందొచ్చు. ‘ఏపీఆర్‌టీఏ సిటిజన్’ ఆండ్రాయిడ్ మొబైల్ యాప్ ద్వారా కూడా దీన్ని డౌన్‌లోడ్ (Good Bye To RC Cards) చేసుకోవచ్చు. వెహికల్స్ చెకింగ్ సందర్భంగా పోలీసు, రవాణాశాఖ అధికారులకు ఇలా డౌన్‌లోడ్ చేసిన పత్రాలను చూపిస్తే సరిపోతుంది.