Site icon HashtagU Telugu

Tech Homes: జగనన్న ఇండ్లకు కొత్త హంగులు..!

Jagan Homes

Jagan Homes

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నిర్మించబోయే ఇండ్లు నూతన టెక్నాలజీతో నిర్మితంకానున్నాయి. దేశంలో మొదటిసారి ఇంధన సామర్థ్యంతో నిర్మించనున్నారు. దీంతో ఇండ్లు నిర్మించుకోబోయే పేద లబ్ధిదారులకు మరింత లబ్ధి చేకూరనుంది. ఇదే విషయమై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (హౌసింగ్) అజయ్ జైన్ మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద గృహనిర్మాణ కార్యక్రమం అయిన అందరికీ ‘హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్‌’లో ప్రపంచ స్థాయి ఇంధన సామర్థ్య సాంకేతికతను అమలు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించబోతోంది అని అన్నారు. డిసెంబర్ 16న నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ వీక్-2021లో భాగంగా రెసిడెన్షియల్ ఇసిబిసి కోడ్‌పై ‘ఎకో-నివాస్ సంహిత’ సెమినార్‌లో ప్రసంగిస్తూ.. అందరికీ తక్కువ ఖర్చుతో కూడిన ఇల్లు.. తక్కువ ఆదాయ వర్గాలకు వరంగా ఉంటుందని జైన్ పేర్కొన్నారు.

గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడే ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ఆధునిక సాంకేతికతలతో సుమారు 28.3 లక్షల ఇళ్లను నిర్మించే దేశంలోనే మొదటి రాష్ట్రం A.P అని ఆయన అన్నారు. రాష్ట్రంలో ‘పీఎంఏవై-నవరత్నాలు పెదలందరికీ ఇల్లు’ కింద మొదటి దశలో ₹28,000 కోట్ల అంచనా వ్యయంతో 15.6 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని, 10,055 లేఅవుట్లలో 10.72 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. “ఈ ఇళ్ల నిర్మాణంలో ఇంధన సామర్థ్య చర్యలను అనుసరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. A.P. స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ శక్తి సామర్థ్య చర్యలను అనుసరించడానికి BEEతో ఒప్పందం చేసుకుంది. ప్రతి ఇంటికి బల్బులు, ట్యూబ్ లైట్లు, ఫ్యాన్లు వంటి ఇంధన సామర్థ్య ఉపకరణాలను ప్రభుత్వం అందజేస్తోంది. గృహాల నిర్మాణంలో ఇంధన సామర్థ్య బిల్డింగ్ డిజైన్‌లను ఉపయోగించడం గృహనిర్మాణ పథకం లబ్ధిదారులకు ఒక ఎంపిక మాత్రమే కానీ తప్పనిసరి కాదు ” అని ఆయన అన్నారు.

వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలకు సీసీ రోడ్లు, డ్రైన్లు, మంచినీటి వసతి, విద్యుద్దీకరణ, ఇంటర్నెట్‌ తదితర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ప్రభుత్వ కార్యదర్శి (ఇంధనం) శ్రీకాంత్ నాగులపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోని మొత్తం వార్షిక వినియోగం 60943 మెగా యూనిట్లలో 42% విద్యుత్‌ను ఏపీ భవన నిర్మాణ రంగం ఒక్కటే వినియోగిస్తోంది. “ఈ టెక్నాలజీ వల్ల రాష్ట్రానికి దాదాపు 15,000 MU విద్యుత్‌ను ఆదా చేసే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మేము ఇంధన పొదుపు, శక్తి సామర్థ్య కార్యక్రమాలను అమలు చేశాం. ఇవి ఏటా దాదాపు 5,600 MU వరకు ఇంధన పొదుపును సాధించగలవని శ్రీకాంత్ చెప్పారు. బీఈపీ ఇండియా డైరెక్టర్ డాక్టర్ సమీర్ మైథేల్ మాట్లాడుతూ.. ఈ రకమైన నిర్మాణంతో బయటి ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇళ్ల లోపల ఉష్ణోగ్రతను 3 నుంచి 5 డిగ్రీలకు తగ్గకుండా తగ్గించడంలో సహాయ పడుతుందని చెప్పారు. ఇది తగినంత సహజ వెంటిలేషన్, డే లైటింగ్, కనీసం 20% విద్యుత్ ఆదా, భవనంలో ఆరోగ్యకరమైన వాతావరణంతో ఆకట్టుకుంటాయన్నారు.

Exit mobile version