Andhra Pradesh: 14న ఏపీ ప్రత్యేక హోదా డిమాండ్!

  • Written By:
  • Publish Date - November 5, 2021 / 12:08 AM IST

విజయవాడ: నవంబర్ 14న తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తడానికి సిద్ధమైంది. కేంద్రం, పొరుగు రాష్ట్రాల నుండి పెండింగ్ బకాయిలు, నదుల అనుసంధానం చేయాలన్న కేంద్రం ప్రతిపాదనపై చర్చతోపాటు పొరుగునే ఉన్న తెలంగాణలోని కృష్ణాపై జూరాల ప్రాజెక్టును కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిధిలోకి తీసుకురావాలనే అంశాన్ని కూడా లేవనెత్తాలని సీఎం జగన్ నిర్ణయించారు. రాష్ట్రాల మధ్య మెరుగైన సమన్వయం కోసం, పెండింగ్లో ఉన్న అంతర్రాష్ట్ర సమస్యల పరిష్కారానికి జోనల్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతాయి.ఈ జోనల్ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ మరియు పుదుచ్చేరి ముఖ్యమంత్రులు, పుదుచ్చేరి, అండమాన్ మరియు నికోబార్ దీవుల లెఫ్టినెంట్ గవర్నర్లు, లక్షద్వీప్ అడ్మినిస్ట్రేటర్ హాజరవుతారు.

కౌన్సిల్ సమావేశంలో చర్చించాల్సిన ఎజెండాపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులతో సమావేశమయ్యారు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా సమస్యను లేవనెత్తాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.రాష్ట్రానికి సంబంధించి పరిష్కరించాల్సిన కీలక అంశాలను బయటకు తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. జోనల్ కౌన్సిల్ సమావేశానికి పూర్తి స్థాయిలో అధికారులు సిద్ధంగా ఉండాలని… ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఇతర రాష్ట్రాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించారు.

ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పెండింగ్లో ఉన్న పోలవరం ప్రాజెక్టుతో పాటు రాష్ట్రానికి రావాల్సిన రూ.6,300 కోట్ల విద్యుత్ బకాయిలను అజెండాలో చేర్చినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.అలాగే తెలుగు గంగ ప్రాజెక్టుకు తమిళనాడు నుంచి పెండింగ్లో ఉన్న బకాయిలు, రెవెన్యూ లోటు, తెలంగాణ నుంచి పెండింగ్లో ఉన్న పౌరసరఫరాల బకాయిలు, కేంద్రం ఇస్తున్న పీడీఎస్ బియ్యం కేటాయింపులను కూడా ఎజెండాలో చేర్చారు. నదీజలాల పంచుకోవడంపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య వివాదం తీవ్రరూపం దాల్చడం, తెలంగాణ ఇంకా ఆమోదం తెలపని కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ అధికార పరిధిని కేంద్రం నోటిఫై చేయడంతో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మార్చి 4న తిరుపతిలో జరగాల్సిన సదరన్ కౌన్సిల్ సమావేశానికి అమిత్ షా హాజరు కాకపోవడంతో రద్దయింది.ఇప్పడు మళ్లీ నవంబర్ 14న ఈ సమావేశం జరగనుంది.