Violences In AP: మాన‌భంగాల ప‌ర్వంలో ఏపీ ‘హృద‌య‌’ నిర్వేదం!

ఏపీలో మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌ల సంఖ్య పెరుగుతోంది.

  • Written By:
  • Updated On - April 22, 2022 / 02:45 PM IST

ఏపీలో మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు, హ‌త్య‌ల సంఖ్య పెరుగుతోంది. సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు తీసుకున్న త‌రువాత తొలి ఏడాది 7శాతం మ‌హిళ‌ల‌పై నేరాల సంఖ్య పెరిగింది. రెండో ఏడాది 14 శాతం మూడో ఏడాది అంటే 2021న 25శాతం పెర‌గ‌డం గ‌మ‌నార్హం. తాజాగా విజ‌య‌వాడలోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో రెండు రోజుల పాటు సామూహిక అత్యాచారం సంఘ‌ట‌న బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ సంఘ‌ట‌న ప‌లువున్ని క‌లిచివేస్తోంది. పోలీసులు నిర్ల‌క్ష్యం కార‌ణంగా సామూహిక అత్యాచారం జ‌రిగిందని బాధితురాలి పేరెంట్స్ బోరును విల‌పిస్తున్నారు. రాష్ట్రంలోని లా అండ్ ఆర్డ‌ర్ ప‌రిస్థితిపై ప్ర‌తిప‌క్ష టీడీపీ నిలదీస్తోంది. గ‌తంలోనే హైకోర్టు జ‌డ్జి ఏపీలోని లా అండ్ ఆర్డ‌ర్ గ‌ట్టుత‌ప్పింద‌ని సుప్రీంకు నివేదిక ఇచ్చారు. రూల్ ఆఫ్ లా ఏపీలో క‌నిపించ‌డంలేద‌ని ఏడాదిన్న‌ర క్రిత‌మే హైకోర్టు జ‌డ్జి ఇచ్చిన నివేదిక ఆనాడు సంచ‌ల‌నం క‌లిగించింది. కానీ, విజ‌య‌వాడ ఆస్ప‌త్రిలో జ‌రిగిన సామూహిక అత్యాచారం సంఘ‌ట‌న వెలుగులోకి వ‌చ్చిన త‌రువాత ఆనాడు జ‌డ్జి ఇచ్చిన నివేదిక నిజ‌మే క‌దా, అనే భావం క‌లుగ‌క మాన‌దు.

మ‌హిళ‌ల భ‌ద్రత కోసం దిశ చ‌ట్టం, యాప్ ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా నేరాలు తగ్గుతాయ‌ని జ‌గ‌న్ స‌ర్కార్ భావించింది. కానీ, గ‌త రెండేళ్లుగా నేరాల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. మ‌హిళ‌ల‌పై 25శాతం నేరాలు పెరిగాయ‌ని గ‌త ఏడాది పోలీసు రికార్డ్ చెబుతోంది. రాష్ట్రంలో జ‌రిగిన వివిధ నేరాల్లో మ‌హిళ‌ల‌పై జ‌రిగిన నేరాల వాట 14శాతంగా ఉంది. ఏపీ సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ప్ర‌తి ఏడాది మ‌హిళ‌ల‌పై జ‌రుగుతోన్న నేరాల సంఖ్య పెరుగుతూనే ఉంది. పోలీస్ రికార్డ్స్ ప్ర‌కారం 2020లో 14,603నేరాలు మ‌హిళ‌ల‌పై జ‌ర‌గ‌గా, 2021లో 17,736 నేరాలు ఏపీ మ‌హిళ‌ల‌పై జ‌రిగాయ‌ని తేలింది. అంటే, జ‌గ‌న్ పాల‌న‌లో ప్ర‌తి ఏడాది మ‌హిళ‌ల‌పై దౌర్జ‌న్యాలు, అత్యాచారాలు, హ‌త్య‌లు పెరిగాయ‌ని స్ప‌ష్టం అవుతోంది.

మహిళల భద్రత కోసం రూపొందించిన మా దిశ యాప్ 98 లక్షలకు పైగా డౌన్‌లోడ్‌లను కలిగి ఉంది. గ‌త ఏడాది ఏడు రోజుల వ్య‌వ‌ధిలోనే 75 రేప్ కేసులు, 1,061 లైంగిక నేరాల కేసులు నమోదయ్యాయని పోలీసు ప్రజెంటేషన్ తెలిపింది. అనంతపురం జిల్లాలో 19 ఏళ్ల దళిత యువతి గ‌త ఏడాది డిసెంబర్ 23న ధర్మవరం మండలం బడన్నపల్లి సమీపంలోని పొలాల్లో సగానికి కాలిపోయి శవమై కనిపించింది. లైంగిక వేధింపులకు గురై ఆమె గొంతుకోసి హత్య చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అత్యాచారం జరిగే అవకాశం లేదని పోలీసులు కొట్టిపారేశారు.
డిసెంబర్ 7న కడపలోని పులివెందులలోని లింగాల మండలం పెదకుడాల గ్రామానికి చెందిన 42 ఏళ్ల మహిళ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పొలంలో శవమై కనిపించారు. ఆమె కూడా దళితురాలే. ఆమెపై అత్యాచారం చేసి బండరాళ్లతో కొట్టినట్లు చూపుతోంది. అత్యాచారం జరిగే అవకాశం లేదని పోలీసులు కొట్టిపారేశారు. గ‌త ఏడాది డిసెంబరులోనే రాయలసీమ ప్రాంతంలోని పులివెందుల, ధర్మవరంలో నమోదైన కేసులతో సహా రాష్ట్రంలో నాలుగు అత్యాచారాలు, హత్య కేసులు నమోదయ్యాయి. 2019కి సంబంధించి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) నివేదికలో అంతకుముందు సంవత్సరం కంటే 7% పెరిగిందని పేర్కొంది.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచన, ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు, 2019 (ఆంధ్రప్రదేశ్ క్రిమినల్ లా (సవరణ చట్టం, 2019)ని డిసెంబర్, 2019లో అసెంబ్లీ ఆమోదించింది. కేంద్రం ఆమోదం పొందడంలో విఫలమైన ఈ బిల్లు, అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసులను 21 రోజులలోపు దర్యాప్తు, విచారణకు హామీ ఇవ్వడంతో పాటు రేపిస్టులకు మరణశిక్ష విధించాలని కోరింది. పోలీసులు దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ కోసం ఏడు రోజులు మరియు 14 రోజులలోపు న్యాయవ్యవస్థ ద్వారా విచారణ కోసం చ‌ట్టం రూపొందించింది. దీని అమలుకు రాష్ట్ర ప్రభుత్వం దిశా పోలీస్ స్టేషన్లు, వన్-స్టాప్ సెంటర్లు, కొత్త ఫోరెన్సిక్ ల్యాబ్‌లు, విచారణ కోసం ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయడం ప్రారంభించింది. దిశ యాప్‌ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వ నిర్భయ చట్టానికి విరుద్ధంగా దిశ చ‌ట్టం ఉంద‌ని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మానసిక వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం జ‌రిగింది. స్థానిక పోలీసులు వ్యవహరించిన తీరుపై విమ‌ర్శ‌లు రావ‌డంతో నున్న సీఐ, సెక్టార్ ఎస్సైలపై జ‌గ‌న్ స‌ర్కార్ సస్పెన్షన్ వేటు వేసింది. వివ‌రాల్లోకి వెళితే, కుమార్తె కనిపించడం లేదని బాధితురాలి తల్లిదండ్రులు నున్న పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. సాయంత్రం రావాలంటూ నిర్లక్ష్యంగా పోలీసులు స‌మాధానం ఇచ్చారు. ఫలానా నంబర్ నుంచి చివరి సారిగా ఫోన్ వచ్చిందంటూ ఆధారాన్ని ఇచ్చినా స్పందించలేదు. ఈ విషయం బయటకు రావడంతో పోలీసుల తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. వివిధ పార్టీలు, ప్రజాసంఘాలు నున్న పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ నేపథ్యంలో సీఐ హనీశ్, సెక్టర్ ఎస్సై శ్రీనివాసరావును విజయవాడ పోలీస్ కమిషనర్ క్రాంతా రాణా టాటా సస్పెండ్ చేశారు.

సామూహిక అత్యాచారం జ‌రిగిన సంఘ‌ట‌న‌పై ప్ర‌తిప‌క్ష టీడీపీ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌కు దిగింది. ఆ పార్టీ అధినేత చంద్ర‌బాబు, తెలుగు మ‌హిళా లీడ‌ర్లు ఆస్ప‌త్రి వ‌ద్ద‌కు వెళ్లారు. ఆ సంద‌ర్భంగా అక్క‌డ‌కు వ‌చ్చిన ఏపీ మ‌హిళా చైర్ ప‌ర్సన్‌ వాసిరెడ్డి పద్మను అడ్డుకున్నారు. ఆసుప‌త్రి నుంచి వెళ్లిపోవాలంటూ నినాదాలు చేశారు. అత్యాచార బాధితురాలిని పరామర్శించి వెళ్లిపోతాన‌ని వాసిరెడ్డి చెప్పారు. చివ‌ర‌కు ఆమెను పోలీసులు బాధితురాలి వ‌ద్ద‌కు తీసుకు వెళ్లారు. దీంతో టీడీపీ మ‌హిళా నేతలు ఆసుప‌త్రి ద్వారం వద్దే బైఠాయించి నిర‌స‌నకు దిగారు.

విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జ‌రిగిన దారుణం వివ‌రాలు ఇవి. విజయవాడలోని పాయకాపురం వాంబేకాలనీకి చెందిన దారా శ్రీకాంత్‌ (26) ప్రభుత్వాస్పత్రిలో పెస్ట్‌ కంట్రోల్‌ కాంట్రాక్టర్‌ వద్ద ఫాగింగ్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. సీతారామపురం ప్రాంతానికి చెందిన చెన్నా బాబూరావు(23) అక్కడే పనిచేస్తున్నాడు. శ్రీకాంత్‌ తన ఇంటికి సమీపాన ఉన్న 23 ఏళ్ల యువతితో పరిచయం పెంచుకున్నాడు. పెళ్లి చేసుకుని, అదే ప్రభుత్వాస్పత్రిలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. శ్రీకాంత్‌ మాటలు నమ్మిన ఆ యువతి ఈ నెల 19వ తేదీన ఒక బ్యాగ్‌లో దుస్తులు సర్దుకుని, ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేసింది. శ్రీకాంత్‌ విధుల్లో ఉన్నప్పుడు ఆమె ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. ఓపీ బ్లాక్‌లో రెండో అంతస్తులో లిఫ్ట్‌కు పక్కన పెస్ట్‌ కంట్రోల్‌ సరుకులు భద్రపరుచుకోవడానికి ఓ చిన్న గది ఉంది. శ్రీకాంత్‌ ఆ గదిలో ఆమెను ఉంచాడు. 19వ తేదీ రాత్రి ఆమెపై అత్యాచారం చేశాడు. ఈ తర్వాత ఈ విషయాన్ని తోటి ఉద్యోగి బాబూరావుకు చెప్పాడు. అతడూ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత బాబూరావు వించిపేటకు చెందిన స్నేహితుడు జె.పవన్‌ కల్యాణ్‌ను ఆస్పత్రికి రప్పించుకున్నాడు.

ముగ్గురూ క‌లిసి ఆమెను రేప్ చేశారు. ఆస్ప‌త్రిలోనే ఉండాల‌ని ఆమెకు చెప్పారు. కుమార్తె క‌నిపించ‌డంలేద‌ని పేరెంట్స్ పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసుల‌కు శ్రీకాంత్ పై అనుమానం వ్య‌క్తం చేస్తూ క్లూ ఇచ్చారు. దీంతో పోలీసులు నిదానంగా విచార‌ణ చేసి శ్రీకాంత్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో మొత్తం వ్య‌వ‌హారాన్ని బ‌య‌ట‌పెట్టాడు. దిశ , నిర్భ‌య చ‌ట్టాల కింద కేసును న‌మోదు చేసి విచార‌ణ చేస్తున్నారు. కానీ, ఫిర్యాదు చేసిన వెంట‌నే పోలీసులు స్పందించ‌క‌పోవ‌డంపై ప్ర‌జాగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఇలా..ఎన్నో నేరాలు మ‌హిళ‌ల‌పై గ‌త మూడేళ్లుగా జ‌రుగుతున్నాయి. స‌రైన రీతిలో నేర‌గాళ్ల‌కు శిక్ష‌లు ప‌డ‌డం జ‌ర‌గ‌లేదు. ఫ‌లితంగా ప్ర‌తి ఏడాది మ‌హిళ‌ల‌పై జ‌రిగే నేరాల సంఖ్య జ‌గ‌న్ సీఎం అయిన త‌రువాత పెరుగుతున్నాయ‌ని విప‌క్షాలు చేస్తోన్న ఆరోప‌ణ‌.