Crimes against Women: ఏపీలో మ‌హిళ‌ల‌పై పెరిగిన నేరాలు..!

ఏపీలో 2021 వ సంవ‌త్సరంలో మ‌హిళ‌ల‌పై నేరాలు పెరిగాయి. ఈ ఏడాదికి సంబంధించి వార్షిక నేర స‌మీక్షా స‌మావేశంలో డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు.

  • Written By:
  • Updated On - December 30, 2021 / 11:30 PM IST

ఏపీలో 2021 వ సంవ‌త్సరంలో మ‌హిళ‌ల‌పై నేరాలు పెరిగాయి. ఈ ఏడాదికి సంబంధించి వార్షిక నేర స‌మీక్షా స‌మావేశంలో డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్ వివ‌రాల‌ను వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్‌లో గత ఏడాది 14,603 కేసులు నమోదవగా.. ఈ ఏడాది 17,736 కేసులతో మహిళలపై నేరాలు 21% పెరిగాయి. నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆపరేషన్ పరివర్తన కింద విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో 7,226 ఎకరాల్లో గంజాయి పంటను స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) ధ్వంసం చేసింది. మాదక ద్రవ్యాలు, హానికరమైన పదార్థాల అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది. ఎస్ఈబీ నాశనం చేసిన మొత్తం గంజాయి పంట బహిరంగ మార్కెట్‌లో రూ. 8,875 కోట్లుగా ఉంది.

మ‌హిళ‌ల‌పై కేసుల సంఖ్య పెరగడానికి ఎఫ్‌ఐఆర్‌ల ఉచిత నమోదు, రాష్ట్ర పోలీసులు ప్రారంభించిన వివిధ ఔట్రీచ్ ప్రోగ్రామ్‌లు కారణమని డీజీపీ స‌వాంగ్ అన్నారు. ఔట్‌రీచ్ ప్రోగ్రామ్‌లు 36% కేసుల నమోదుకు కారణమయ్యాయ‌ని.. రాష్ట్రంలో వివిధ నేరాలకు సంబంధించిన మొత్తం 1,27,127 కేసులు 2020లో 1,22,987 కేసులు నమోదయ్యాయని తెలిపారు. మొత్తంగా మహిళలపై నేరాలు 14% (17,736 కేసులు), శారీరక నేరాలు 17%, రోడ్డు ప్రమాద కేసులు 14% ఆస్తి నేరాలు 11%, వైట్ కాలర్ నేరాలు 7%, IPC సెక్షన్ల కింద ఇతర నేరాలు 37%.గా ఉన్నాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

2021లో అత్యధికంగా మహిళలపై నేరాలు నమోదయ్యాయి. 2017లో 14,813, 2018లో 14,338, 2019లో 15,665, 2020లో 14,603 కేసులు నమోదయ్యాయి. మహిళలు, పిల్లలపై జరిగే నేరాల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారని. ఏమాత్రం సహించేది లేదని కేసుల సంఖ్య పెరుగుదల సూచిస్తుందని.. నమోదైన కేసుల సంఖ్య పెరగడం పోలీసుల సమర్థతకు అద్దం పడుతోంద‌ని డీజీపీ గౌతం సవాంగ్ అన్నారు. బహిరంగ మార్కెట్‌లో రూ.8,875 కోట్ల విలువైన గంజాయి పంటను ఎస్ఈబీ ద్వంసం చేసింద‌ని .. 314 కోట్ల విలువైన గంజాయిని కూడా స్వాధీనం చేసుకున్నామ‌ని డీజీపీ తెలిపారు. పోలీసులు తీసుకుంటున్న పటిష్టమైన చర్యలతో 2022లో గంజాయి స్మగ్లింగ్ తగ్గుముఖం పడుతుందని డీజీపీ తెలిపారు.

పోలీసింగ్‌లో సాంకేతికతను అవలంబించడంలో ఏపీ పోలీసులు అగ్రగామిగా ఉన్నారని పునరుద్ఘాటించిన సవాంగ్.. సమర్థత, పనితీరు వంటి వివిధ రంగాల్లో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. స్మార్ట్ పోలీసింగ్‌పై ఇండియన్ పోలీస్ ఫౌండేషన్ నిర్వహించిన సర్వేలో తాము మొదటి స్థానంలో నిలిచామని.. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, SKOCH, NCRB, FICCI, ఇతరుల నుండి 150 కంటే ఎక్కువ జాతీయ స్థాయి అవార్డులను పొందామన్నారు. వేలిముద్రలు, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో రాష్ట్ర పోలీసులు మొదటి స్థానంలో నిలిచారని డీజీపీ తెలిపారు. మాట్రిక్స్ ఆఫ్ చేంజ్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ విధానాన్ని అమలు చేయడం ద్వారా పోలీసు శాఖ పనితీరులో మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. పారదర్శకతను పెంపొందించేందుకు, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు సామర్థ్యాల పెంపుదలపై దృష్టి సారించేందుకు పోలీసులను పరిశీలనలో ఉంచుతున్నామని డీజీపీ తెలిపారు.