సామాజిక న్యాయభేరి యాత్ర సందర్భంగా రెండో రోజు జరిగిన సభలో స్పీకర్ తమ్మినేని సీతారాం మళ్లీ కాబోయే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అంటూ జోస్యం చెప్పారు. పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు పాలనలో దళితులకు జరిగిన అవమానాన్ని గుర్తుచేసిన ఆయన , అప్పటి మేనిఫెస్టోను అమలు చేయలేదని మండిపడ్డారు. అమలాపురం ఘటనపై తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ప్రభుత్వం పరువు తీసేలా ప్రతిపక్షాలు అల్లర్లు సృష్టిస్తున్నాయని, దళిత మంత్రి ఇంటిపై దాడిని ఖండించారు.
సామాజిక న్యాయ భేరి పేరుతో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సు యాత్ర రెండో రోజు శుక్రవారం విశాఖపట్నంలో కొనసాగింది. పాత గాజువాక వైఎస్‌ఆర్ విగ్రహం వద్ద నుంచి బస్సుయాత్ర ప్రారంభమైంది. కాగా, అక్కడ జరిగిన సభలో హోంమంత్రి తానేటి వనిత ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 70 శాతం సీట్లు ఇచ్చారని తెలిపారు.
దేశంలో వెనుకబడిన తరగతులకు ఇలాంటి పదవులు ఇచ్చిన దాఖలాలు లేవని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు గతంలో ఎవరూ ఇంత గౌరవం, అధికారం ఇవ్వలేదన్నారు. గతంలో అమలాపురం అల్లర్లపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి వనిత, అమలాపురం ఘటనలో టీడీపీ, జనసేన పాత్ర స్పష్టంగా ఉందని పునరుద్ఘాటించారు. అరెస్టయిన వారు రెండు పార్టీల సభ్యులని ఆమె తెలిపారు.