Heavy Rainfall Alert: ఏపీలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు (Heavy Rainfall Alert) కురుస్తాయని రాష్ట్ర వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, వైఎస్సార్ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలో భారీ వర్షాల కారణంగా రాయలసీమ జిల్లాలకి (కర్నూలు, నంద్యాల, అన్నమయ్య, వైఎస్ఆర్, అనంతపురం, శ్రీ సత్యసాయి, తిరుపతి, చిత్తూరు) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే స్కూల్స్, కాలేజీలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు కోరారు. ఈనెల 16, 17 తేదీల్లో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దన్నారు.
రేపు స్కూళ్లకు సెలవు ఉందా?
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు బలపడనుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని అధికారులు తెలిపారు. దీంతో ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో స్కూళ్లకు మంగళవారం సెలవు ఇవ్వాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. సోమవారం తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో స్కూళ్లకు సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే.
Also Read: CM Chandrababu : అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్: సీఎం చంద్రబాబు
భారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తం
క్షేత్రస్థాయిలో ప్రతి అధికారి అందుబాటులో ఉండి అన్ని జిల్లాలో తుఫాను నష్టాలు ధీటుగా ఎదుర్కొనేలా ప్రజలందర్నీ అప్రమత్తం చేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి విజ్ఞప్తి చేసారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అధికారులను మంత్రి అప్రమత్తం చేశారు.
ఏపీలో భారీ వర్షాలు.. సీఎస్ సమీక్ష
ఏపీలో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం నేపథ్యంలో పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్‌రూమ్ నుంచి సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షణ చేశారు. భారీవర్షాల నేపధ్యంలో జిల్లా కలెక్టర్లు, అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీచేశారు. పోలీసు, పంచాయితీరాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ అధికారులు అలర్ట్ గా ఉండాలని స్పష్టం చేశారు.