Site icon HashtagU Telugu

AP PRC Issue : ‘నిర్మ‌ల‌మ్మ‌’ సోయ ‘సజ్జ‌ల‌’కు లేక‌పాయే.!

Sajjala Nirmala

Sajjala Nirmala

ఏపీ ఉద్యోగ సంఘం నేత‌లు ప్ర‌భుత్వాన్ని, కార్య‌నిర్వాహ‌ణ వ్య‌వ‌స్థ‌ను శాసించాల‌ని ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నేరుగా సీఎం జ‌గ‌న్ తోనే తేల్చుకుంటామ‌నే స్థాయికి వ‌చ్చారు. ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొట్టగ‌లం..నిల‌బెట్ట‌గ‌లం అంటూ వారం క్రితం ఉద్యోగ సంఘం నేత‌లు బండి శ్రీనివాసరావు, బొప్ప‌రాజు వార్నింగ్ ఇచ్చారు. ఆ త‌రువాత సోష‌ల్ మీడియా వేదిక‌గా వ్య‌తిరేక‌త పెల్లుబికింది. దాంతో వాళ్లు నాలుక‌ను స‌వ‌రించుకునే ప్ర‌య‌త్నం చేశారు. మ‌ళ్లీ ఇప్పుడు ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ ఇచ్చిన పీఆర్సీ నివేదిక పై వార్నింగ్ ఇస్తున్నారు. అంతేకాదు, ఐఏఎస్ లు చెప్పిన మాట‌లు వినొద్ద‌ని, వాళ్లు ఇచ్చిన సిఫార‌స్సులు చెల్ల‌వ‌ని సీఎం జ‌గ‌న్ కు శుద్ధులు చెబుతున్నాడు బండి శ్రీనివాస‌రావు.
ఉద్యోగ సంఘాల నేత‌ల‌కు, సీఎం జ‌గ‌న్ కు మ‌ధ్య స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌క్రిష్ణారెడ్డి ఉన్నాడు. ఆయ‌న ఉద్యోగుల ప‌క్షాన తొలి రోజుల్లో నిలిచాడు. అన్ని వ‌ర్గాల నుంచి వ‌స్తోన్న వ్య‌తిరేక‌త‌ను గ‌మ‌నించి ఉద్యోగుల‌ను సున్నితంగా మంద‌లించాడు. రాజ‌కీయ ప్ర‌మేయంతో కూడిన మాటలు ఆపండ‌ని హిత‌వు ప‌లికాడు. కానీ, ఏపీ ఆర్థిక ప‌రిస్థితి గురించి ఉద్యోగుల‌కు న‌చ్చ చెప్ప‌డంలో స‌జ్జ‌ల విఫ‌లం అయ్యాడు. పీఆర్సీ సిఫార‌స్సుల‌ను వ్య‌తిరేకిస్తోన్న ఉద్యోగ సంఘ నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్నాడు. ఐఏఎస్ ల సిఫార‌స్సుల‌ను ప‌క్క‌న పెట్ట‌మ‌ని వార్నింగ్ ఇస్తోన్న బండి శ్రీనివాస‌రావు లాంటి వాళ్ల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డంపై సజ్జ‌ల విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొంటున్నాడు.

KCR Politics : ఔను! వాళ్లిద్ద‌రూ చెరోదారి!!

దేశంలోని ఏ రాష్ట్ర ఉద్యోగుల‌కు ఇవ్వ‌నంత‌గా ఏపీ ఉద్యోగులకు ల‌బ్ది చేకూరుతోంది. తెలంగాణ ఉద్యోగుల కంటే ఎక్కువ‌గా జీతాల‌ను, పెన్ష‌న్ల‌ను అనుభ‌విస్తున్నారు. ఆ మేర‌కు 14వ ఆర్థిక సంఘం నివేదిక‌ను ప‌రిశీలిస్తే అర్థం అవుతోంది. రాష్ట్రం మొత్తం ఖ‌ర్చులో 60శాతం వ‌ర‌కు ఉద్యోగుల జీత‌భ‌త్యాల‌కు వెళుతోంది. ఏ రాష్ట్రంలోనూ ఇంత వాటా ఉద్యోగుల‌కు లేద‌ని స‌మీర్ శ‌ర్మ ఆధ్వ‌ర్యంలోని క‌మిటీ తేల్చింది.వాస్త‌వాల‌ను బ‌య‌ట‌పెట్టిన ఐఏఎస్ ల‌ను ఇప్పుడు ఏపీ ఉద్యోగ సంఘాల నేత‌లు టార్గెట్ చేయ‌డం చ‌ర్చ‌నీయాశంగా మారింది. ప్ర‌స్తుతం ఏపీ ఆర్థిక ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లాసీతారామ‌న్ మంగ‌ళ‌వారం విడ‌మ‌రిచి చెప్పింది. ఆర్థిక క్ర‌మ‌శిక్ష‌ణ ఏపీలో క‌నిపించ‌డంలేద‌ని పార్ల‌మెంట్ వేదిక‌గా మొత్తుకుంది. కేంద్రం సైతం ఏపీ ఆర్థిక ప‌రిస్థితిపై ఆందోళ‌న చెందుతోంది. కానీ, ఉద్యోగులు మాత్రం గొంత‌మ్మ కోర్కెలు తీర్చాల‌ని 71 డిమాండ్ల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ముందు పెట్టారు.
రాజ‌కీయ ల‌బ్ది కోసం విప‌క్ష పార్టీలు కూడా ఉద్యోగ సంఘాల‌కు మ‌ద్ధ‌తుగా నిలుస్తున్నాయి. టీడీపీతో పాటు మిగిలిన రాజ‌కీయ పార్టీలు ఏపీ ఆర్థిక ప‌రిస్థితిని ప‌ట్టించుకోకుండా ఉద్యోగుల‌కు పీఆర్సీ ఇవ్వాల‌ని చెబుతున్నాయి. ఇలాంటి ప‌రిణామ‌మే గ‌తం నుంచి ఉద్యోగులకు కాసులు కురిపిస్తోంది. ఇప్పటికైనా ఏపీ ఆర్థిక ప‌రిస్థితిని దృష్టిలో పెట్టుకుని అటు ప్ర‌భుత్వం ఇటు విప‌క్షాలు మాట్లాడాలి. రాజ‌కీయాల‌కు అతీతంగా ఆలోచించ‌క‌పోతే, భ‌విష్య‌త్ లో కొంద‌రు ఉద్యోగుల `బ్లాక్ మెయిల్ ` కు అనుగుణంగా ప్ర‌భుత్వాల‌ను న‌డ‌పాల్సిన అగ‌త్యం ఏర్ప‌డుతుంది.