అంధ‌కారంలోకి ఆంధ్రా.. థ‌ర్మ‌ల్ కేంద్రాల మూసివేత‌, క‌రెంట్ కోత‌

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశంలో క‌రెంట్ స‌ర‌ఫ‌రా చేయ‌లేని రాష్ట్రాల్లో ప్ర‌ధ‌మంగా ఏపీ ఉంది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో మిగిలిన అన్నింటి కంటే బొగ్గు నిల్వ‌లు త‌క్కువ‌గా ఉన్న రాష్ట్రం ఏపీ. ఇప్ప‌టికే మూడు ధ‌ర్మ‌ల్ కేంద్రాల‌ను గ‌త వారం మూసివేసింది.

  • Written By:
  • Publish Date - October 12, 2021 / 05:14 PM IST

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వ‌హించిన స‌మీక్షా స‌మావేశంలో క‌రెంట్ స‌ర‌ఫ‌రా చేయ‌లేని రాష్ట్రాల్లో ప్ర‌ధ‌మంగా ఏపీ ఉంది. ద‌క్షిణాది రాష్ట్రాల్లో మిగిలిన అన్నింటి కంటే బొగ్గు నిల్వ‌లు త‌క్కువ‌గా ఉన్న రాష్ట్రం ఏపీ. ఇప్ప‌టికే మూడు ధ‌ర్మ‌ల్ కేంద్రాల‌ను గ‌త వారం మూసివేసింది. ముంద‌‌స్తు ప్ర‌ణాళిక లేక‌పోవ‌డం కార‌ణంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌రో వారం త‌రువాత పూర్తి అంధ‌కారంలోకి వెళ్ల‌బోతుంది. ఆ విష‌యం అమిత్ షా కేంద్ర విద్యుత్‌, బొగ్గు శాఖ‌ల మంత్రులు, ఉన్న‌తాకారుల‌తో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో స్ప‌ష్టం అయింది. ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా బొగ్గు నిల్వ‌లు ద‌క్షిణాది రాష్ట్రాల్లో బాగా త‌గ్గిపోయాయి. ఇంకో వైపు బొగ్గును పూర్తి సామ‌ర్థ్యం మేర‌కు చేయ‌లేక‌పోతున్నారు. అందుకే మిగిలిన రాష్ట్రాలు నీటి, సోలార్ ఆధారిత వ‌న‌రుల‌ను స‌మ‌కూర్చుకుంటున్నాయి.
బొగ్గు నిల్వ‌లు అత్య‌ధికంగా ఉన్న తెలంగాణ కూడా హైడ‌ల్, సోలార్ ప‌వ‌ర్ ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని పెంచుకునే ప్ర‌య‌త్నం చేస్తోంది. ప‌ది రోజుల‌కు స‌రిప‌డా బొగ్గు నిల్వ‌లు తెలంగాణ‌కు ఉన్నాయి. ఇక క‌ర్నాట‌క రాష్ట్రానికి 4వేల ట‌న్నులు సామ‌ర్థ్యం ఉండే 14 ర్యాక్ ల బొగ్గు ప్ర‌తి రోజూ అవ‌స‌రం. ఆ విష‌యాన్ని ఆ రాష్ట్ర సీఎం బ‌స‌వ‌రాజ్ ముంబాయ్ కేంద్రానికి తెలియ ‌చేశాడు. ప్ర‌స్తుతం రోజుకు 6 నుంచి 10 ర్యాక్ ల‌ను మాత్ర‌మే అందించ‌గ‌లుగుతోంది. మూడు థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్ స్టేష‌న్స్ 5020 మెగా వాట్ల విద్యుత్ ను ఉత్ప‌త్తి చేస్తాయి. వీటికి బొగ్గు క‌నీసం 11 ర్యాక్ లు అవ‌స‌రం. ఇక త‌మిళ‌నాడు సాధార‌ణంగా మూడు వారాల‌కు స‌రిప‌డా బొగ్గు నిల్వ‌ల‌ను పెడుతోంది. కానీ, ఇప్పుడు నాలుగు రోజుల‌కు స‌రిప‌డే నిల్వ‌లు మాత్ర‌మే ఉన్నాయి. ఇప్పుడున్న నిల్వ‌ల ఆధారంగా ప‌ది రోజులు క‌రెంట్ ను నిరంత‌రాయంగా స‌ర‌ఫ‌రా చేయోచ్చ‌ని ఆ రాష్ట్రం అంచ‌నా వేస్తోంది.
ఏపీ మిగిలిన రాష్ట్రాల కంటే దారుణ‌మైన ప‌రిస్థితిలో ఉంది. ప్ర‌తి రోజూ ధ‌ర్మ‌ల్ స్టేష‌న్స్ కు 70వేల ట‌న్నుల‌కు గాను కేవ‌లం 40వేల ట‌న్నుల బొగ్గును అంద‌చేయ‌గ‌లుతోంది. బొగ్గు నిల్వ‌లు లేక‌పోవ‌డంతో గ‌త వారం మూడు విద్యుత్ కేంద్రాల‌ను మూసివేసింది. కేవ‌లం రెండు రోజులకు స‌రిప‌డే నిల్వ‌లు మాత్ర‌మే ఏపీ వ‌ద్ద ఉన్నాయి. అత్య‌వ‌స‌ర స‌ర‌ఫరా కోసం కేంద్రాన్ని సీఎం జ‌గ‌న్ అభ్య‌ర్థించాడు. కేర‌ళ రాష్ట్రం ఎప్ప‌టికప్పుడు క‌రెంట్ స‌ర‌ఫ‌రా, ఉత్ప‌త్తిని స‌మీక్షిస్తోంది. అత్య‌ధికంగా కరెంట్ వినియోగించే స‌మ‌యాల్లో 120 నుంచి 200 మెగా వాట్ల విద్యుత్ త‌క్కువ‌గా ఉంద‌ని అంచ‌నా వేసింది. బొగ్గు నిల్వ‌లు ప్ర‌స్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రం 10 రోజుల పాటు నిల్వ‌ల‌ను ఉంచుకుంది. ప్ర‌తి రోజూ 34 ర్యాక్ ల బొగ్గును సింగ‌రేణి ఉత్ప‌త్తి చేస్తోంది. 30ర్యాక్ ల‌ను కేంద్రం ఆదేశాల మేర‌కు ఏపీకి స‌ర‌ఫ‌రా చేయ‌డానికి రెడీగా ఉంది. మొత్తం మీద గంట పాటు అమిత్ షా నిర్వ‌హించిన ద‌క్షిణాది రాష్ట్రాల విద్యుత్ కొర‌త‌, బొగ్గు నిల్వ‌ల స‌మీక్ష‌లో ఏపీ త్వ‌ర‌లోనే చీక‌ట్లోకి వెళ్ల‌నుంద‌ని తేలింది. ఉన్న‌తాధికారులు మాత్రం అనుకున్నంత క్లిష్ట ప‌రిస్థితులు రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డానికి అవకాశం ఉంద‌ని, ఫోక‌స్ చేసినంత‌గా విద్యుత్ కోత‌లు ఉండ‌క‌పోవ‌చ్చ‌ని అమిత్ షాకు వివ‌రించారు. మ‌రో వారం రోజుల్లో ఏ రాష్ట్రం ఎన్ని గంట‌లు కోతలు విధిస్తాయో తేల‌బోతుంది.