మోడీకి జగన్ రిక్వెస్ట్.. వెంటనే జోక్యం చేసుకోవాలంటూ..!

దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటం.. బొగ్గు ఉత్తత్పి చేసే కంపెనీల్లో పనులు నిలిచిపోవడంతో అంతటా విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు.

  • Written By:
  • Publish Date - October 11, 2021 / 04:39 PM IST

దేశవ్యాప్తంగా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తుండటం.. బొగ్గు ఉత్తత్పి చేసే కంపెనీల్లో పనులు నిలిచిపోవడంతో అంతటా విద్యుత్ సంక్షోభం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ రెడ్డి ప్రధాని మోడీకి లేఖ రాశారు. రాష్ట్రంలో విద్యుత్ తీవ్ర సంక్షోభం ఉన్నందున వెంటనే జోక్యం చేసుకోవాలని రిక్వెస్ట్ చేశారు. అనంతరం రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గత ఆరు నెలల్లో 15 శాతం, గత నెల నుండి 20 శాతం పెరిగిందని.. బొగ్గు నిల్వలు ఆందోళనకరస్థాయిలో పడిపోవడంతో ఆయన కేంద్ర సహకారాన్ని కోరారు. ఇక, ఏపీ జెన్ కో అధీనంలోని థర్మల్ ప్లాంట్‌ స్థాపిత సామర్థ్యంలో 50 శాతం మాత్రమే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాయని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు సీఎం వైఎస్‌ జగన్. ఏపీకి 20 బొగ్గు ర్యాక్స్ ను కేటాయించాల్సిందిగా కేంద్ర రైల్వే, బొగ్గు శాఖకు ఆదేశించాలని లేఖలో ప్రధాని మోడీకి విజ్ఞప్తి చేశారు. ఓఎన్జీసీ, రిలయన్స్ నుంచి అత్యవసర ప్రాతిపదికన రాష్ట్రంలో గ్యాస్ ప్లాంట్లకు గ్యాస్ సరఫరా చేయాలని లేఖలో కోరిన ఏపీ సీఎం.. బొగ్గు కొనుగోళ్ల కోసం డిస్కమ్ లకు సంక్షోభం నుంచి బయటపడే వరకు ఉదారంగా రుణాలు ఇవ్వాలని విన్నవించుకున్నారు.

ప్రస్తుతం అన్ని థర్మల్ విద్యుత్ ప్లాంట్ల లోను వంద శాతం ఉత్పత్తి జరగడం లేదని ఏపీ అధికారులు పేర్కొంటున్నారు. బొగ్గు సరఫరా లేక పోవడం వల్లే బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. గత నెలలో16 తేదీన లో యూనిట్ కు 4.60 పైసలు ఉంటే ఇప్పుడు ఆగస్టు 7 తేదీన 14 రూపాయలకు చేరిందన్నారు. పీక్ డిమాండ్ ఉన్న సమయంలో అధిక రేటు పెట్టి కొనాల్సి ఉంటుందన్నారు. ఒక్కోసారి విద్యుత్ కూడా అందుబాటులో లేని పరిస్థితి వచ్చిందని చెప్పారు. బొగ్గు ఉంటే జెన్కో ప్లాంట్ ల నుంచి మరో 40 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేసుకోవచ్చని వివరించారు.

బొగ్గు కొరత నేపథ్యంలో డిమాండ్, సరఫరా మధ్య తీవ్ర అంతరం ఏర్పడింది. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఒకటి రెండు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వినియోగంపై ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఏసీల వాడకం నిలిపివేయాలని కోరడం విద్యుత్ సంక్షోభానికి తీవ్ర అద్దం పడుతోంది.