AP Police : కేసు దర్యాప్తులో సూపర్ ఫాస్ట్ .. ఏపీ పోలీసుల మరో రికార్డు!!

తక్షణ న్యాయం.. ఇది ఒక స్వప్నం!! దీన్ని సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకు వేసింది. దేశంలోని ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలిచేలా.. ఏపీ పోలీసులు ఒక సరికొత్త రికార్డు సృష్టించారు.

  • Written By:
  • Publish Date - May 8, 2022 / 09:25 PM IST

తక్షణ న్యాయం.. ఇది ఒక స్వప్నం!! దీన్ని సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందుకు వేసింది. దేశంలోని ఇతర రాష్ట్రాల పోలీసులకు ఆదర్శంగా నిలిచేలా.. ఏపీ పోలీసులు ఒక సరికొత్త రికార్డు సృష్టించారు. ఒక అత్యాచార యత్నం కేసు దర్యాప్తు ప్రక్రియను 14 రోజుల్లోనే పూర్తి చేశారు. ఇందులో ఇద్దరు నిందితులకు 57 రోజుల్లోనే శిక్ష కూడా పడింది. ఈవివరాలను ఆంధ్రప్రదేశ్ డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. నేరాలకు పాల్పడే వాళ్లకు దడ పుట్టాలంటే.. దర్యాప్తు పక్రియ వేగంగా జరగాలని ఆయన అన్నారు. ఈ దిశగా ఏపీ పోలీసులు ముందుకు వెళ్తున్నారని, ఈక్రమంలోనే నెల్లూరు పోలీసులు 14 రోజుల్లో కేసు దర్యాప్తును పూర్తి చేశారని చెప్పారు.

ఏమిటా కేసు..

2022 మార్చి 8న నెల్లూరు జిల్లాలో ఒక అటవీ మార్గం మీదుగా వెళ్తున్న లిథువేనియా యువతిపై ఇద్దరు వ్యక్తులు రేప్ కు యత్నించారు. ఎలాగోలా ఆ యువతి తప్పించుకొని బయటపడి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో 3 గంటల్లోనే ఆ ఇద్దరు నిందితులను ఖాకీలు పట్టుకున్నారు. 2022 మార్చి 16న కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేశారు. బాధిత యువతి స్వదేశం లిథువేనియా కు వెళ్లాల్సి ఉన్నందున నెల్లూరు సెషన్స్ కోర్టులో కేసు ప్రాసిక్యూషన్ త్వరగా జరిగేలా లిస్టింగ్ చేశారు. కేసు విచారణ మార్చి 29 నుంచి మొదలై మూడు రోజుల్లోనే పూర్తయింది. ఆ తర్వాత ఒక్కరోజులోనే నెల్లూరు సెషన్స్ కోర్టులో సాక్షుల విచారణ ముగిసింది. అత్యాచారానికి యత్నించిన ఇద్దరు నిందితులు ఏప్రిల్ 6, 7 తేదీల్లో కోర్టు ఎదుట తమ వాదనలు వినిపించారు. చివరకు ఈ కేసుకు సంబంధించిన తీర్పును మే నెల 5న కోర్టు వెలువరించింది. నిందితులు సాయి కుమార్, ఆబిద్ లకు 7 ఏళ్ల జైలు, రూ.15000 జరిమానా విధించింది. ఈనేపథ్యంలో తనకు సత్వర న్యాయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ బాధిత లిథువేనియా యువతి ఏపీ డీజీపీకి వీడియో మెసేజ్ పంపింది. 2021 సంవత్సరంలో ఏపీలో పొక్సో, రేప్ కేసులకు సంబంధించి 92.21 శాతం మేర ఛార్జ్ షీట్లు దాఖలు చేశామని డీజీపీ కె.వి.రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు . ఈవిషయంలోనూ దేశంలో నంబర్ 1 స్థానంలో ఏపీ పోలీసులు ఉన్నారని చెప్పారు.