Site icon HashtagU Telugu

Green Tax Burden : గ్రీన్ ట్యాక్స్ ఏపీలో ఎక్కువ.. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో తక్కువ.. ఎందుకు ?

Green Tax Burden

Green Tax Burden

Green Tax Burden : గ్రీన్ ట్యాక్స్ వ్యవహారంతో ఆంధ్రపదేశ్‌ ప్రజల్లో రాష్ట్ర సర్కారుపై వ్యతిరేకత పెరుగుతోంది.. గ్రీన్ ట్యాక్స్ తెలంగాణలో గరిష్టంగా రూ.1500లోపే ఉండగా.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రూ.6,660 వసూలు చేస్తున్నారని భారీ వాహనాల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. తమిళనాడులో రూ. 500, కర్ణాటకలో రూ.200 మాత్రమే గ్రీన్ ట్యాక్స్ ఉందని గుర్తు చేస్తున్నారు.  గతంలో ఏపీలోనూ  గ్రీన్ ట్యాక్స్   200 రూపాయలే ఉండేదని .. ఇప్పుడు దాన్ని తాము భరించలేనంతగా పెంచారని లారీ ఓనర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  అయితే గ్రీన్ ట్యాక్స్ పెంపు ద్వారా పాత వాహనాలు రోడ్లపైకి రాకుండా నియంత్రించగలమని ఏపీ రవాణా శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ అంటున్నారు. తద్వారా పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ఆయన వాదిస్తున్నారు.  కేంద్ర ప్రభుత్వం ఆదేశించడం వల్లే తాము గ్రీన్ ట్యాక్స్ పెంచామని ఆయన స్పష్టం చేస్తున్నారు.

Also read : Royal Enfield Himalayan 450: రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 లాంచ్ ఎప్పుడంటే..? ధర ఎంతంటే..?

ఏమిటీ గ్రీన్ ట్యాక్స్ ? 

దేశంలోని 6 శాతం వాహనాల నుంచే 65 శాతం వరకు కాలుష్య కారకాలు వెలువడుతున్నాయని పలు అధ్యయనాల్లో తేలింది. దీంతో ఆ పాత వాహనాలను నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం  గ్రీన్ ట్యాక్స్ ను పెంచింది. దాంతో పాటే లైఫ్ టైమ్ ట్యాక్స్, షార్ట్ టైమ్ ట్యాక్స్, క్వార్టర్లీ ట్యాక్స్, గ్రీన్ ట్యాక్స్, బోర్డర్ ట్యాక్స్, కాంపోజిట్ ట్యాక్స్ లను కూడా పెంచారు. ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ రూపొందించిన ‘‘ఏపీ మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు-2021’’కు ఆ ఏడాది నవంబర్ 24న అసెంబ్లీలో ఆమోదం దక్కింది. అయితే 2022-23 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ పన్నుల పెంపును ఏపీలో అమల్లోకి తెచ్చారు. దీంతో ఏపీ ప్రభుత్వానికి ఆదాయం భారీగా పెరిగింది.

Also read : World Humanitarian Day : మనిషిలోని మానవతకు ఒక రోజు.. సెలబ్రేట్ చేసుకోండి

ఏపీలో గ్రీన్ ట్యాక్స్ ఇలా..  

  • ఆంధ్రప్రదేశ్ లో 7-10 ఏళ్ల వయసులో ఉన్న వాహనాలకు క్వార్టర్లీ ట్యాక్స్‌పై 50 శాతం మేర గ్రీన్ ట్యాక్స్ వసూలు చేయాలని నిర్ణయించారు.
  • 10-12 ఏళ్ల వయసు వాహనాలకు క్వార్టర్లీ ట్యాక్స్‌తో సమానంగా, 12 ఏళ్లు పైబడిన వాహనాలకు క్వార్టర్లీ ట్యాక్స్‌‌కు రెట్టింపు మొత్తంలో గ్రీన్ టాక్స్ ఉండాలని(Green Tax Burden) నిర్ణయించారు.
  • ప్రస్తుతం 16 టైర్లున్న పెద్ద లారీకి క్వార్టర్లీ ట్యాక్స్ రూ.15,400గా ఉంది. అదే ఆరు టైర్ల లారీకి రూ. 4,790 వరకూ ఉంది. దాంతో గ్రీన్ ట్యాక్స్ సగటున ఏడాదికి రూ.2,395 నుంచి రూ. 30,820 వరకూ చెల్లించాల్సి వస్తోంది.
  • పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్‌తో పాటు కొత్త వాహనాలకు వాటి ఖరీదు రూ. 5 లక్షల లోపు ఉంటే ఒక శాతం, రూ.10 నుంచి 20 లక్షల మధ్య ఉండే వాహనాలపై 3 శాతం, రూ. 20 లక్షల కంటే ఎక్కువ ధర ఉండే లగ్జరీ వాహనాలపై మూడు శాతం చొప్పున పన్ను పెంపుదల జరిగింది.
  • లగ్జరీ వాహనాలపై మొత్తం పన్నులు 18 శాతం వరకూ ఉంటాయి.

తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో గ్రీన్ ట్యాక్స్ ఇలా..  

  • తెలంగాణలో కూడా గ్రీన్ ట్యాక్స్ విధించడం కోసం చట్ట సవరణ చేసి ఏపీలో మాదిరిగానే స్లాబులు మార్చారు. 7-10 ఏళ్లు ఒక స్లాబ్, 10-12 ఏళ్లు మరో స్లాబ్, 12 ఏళ్లు నిండిన వాహనాలకు మరో స్లాబ్‌ పెట్టారు.
  • తెలంగాణలోని లారీ యజమానుల సంఘాల నుంచి వ్యతిరేకత రావడంతో కేసీఆర్ ప్రభుత్వం వెనక్కు తగ్గింది.
  • ప్రస్తుతం తెలంగాణలో ఏడేళ్ల నుంచి 12 సంవత్సరాలు నిండిన వాహనాలకు ఏడాదికి రూ. 1500, ఆపై వాహనాలకు రూ. 3 వేలు మాత్రమే  వసూలు చేస్తున్నారు.
  • కర్ణాటకలో హరిత పన్ను ఏడాదికి 200 రూపాయలు ఉండగా.. తమిళనాడులో 500 రూపాయలు వసూలు చేస్తున్నారు.
  • ఏపీలో మాత్రం మూడు స్లాబులు కొనసాగుతున్నాయి. పైగా పన్నులు కూడా ఎక్కువ.