Andhra Pradesh CM Chandrababu Naidu అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి కుమార స్వామి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఈ స్టీల్ ప్లాంట్ విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే పెద్దదని వెల్లడించారు. లక్ష మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధిలో కీలక ముందడుగు పడింది. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్, నిప్పాన్ స్టీల్ ఇండియా స్టీల్ ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కుమారస్వామి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగసభలో మాట్లాడిన చంద్రబాబు.. నక్కపల్లి స్టీల్ ప్లాంట్ ద్వారా ఉత్తరాంధ్రలో కొత్త చరిత్రను లిఖిస్తున్నామని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కంటే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ రాజయ్యపేటలో ఏర్పాటవుతోందని చంద్రబాబు సంతోషం వ్యక్తం చేశారు. దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ఏపీలో ఏర్పాటు కావటం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్రం అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులకు మద్దతునిస్తున్న పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబు ధన్యవాదాలు తెలియజేశారు. 5,465 ఎకరాల్లో అనకాపల్లి స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చంద్రబాబు అన్నారు. స్టీల్ ప్లాంట్‌కు కాదు, స్టీల్ సిటీకి శంకుస్థాపన చేశామన్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. రెండు దశలలో అనకాపల్లి స్టీల్ ప్లాంట్ నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు అన్నారు. డిసెంబర్ 2028 నాటి నుంచి స్టీల్ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మరోవైపు ఆర్సెలార్ స్టీల్‌ప్లాంట్ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలకు అధికంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే దార్శనికత ఉన్న నాయకుడు కావాలని, అది చంద్రబాబు వల్లే సాధ్యమని పవన్ కళ్యాణ్ అన్నారు. రాజకీయ దురంధరుడు చంద్రబాబు వలనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయని కొనియాడారు. మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు శ్రద్ధ, చొరవతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోతోందని కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి అన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వలన రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతోందని కొనియాడారు.
మరోవైపు సుమారు లక్షా 35 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నారు. దీని నిర్మాణం రెండు దశలలో జరగనుంది.
