AP Crimes: నేరాల నియంత్రణకు ‘స్మార్ట్’ సొల్యూషన్!

కొన్ని నెలల క్రితం తాడేపల్లి రైల్వే బ్రిడ్జి కింద చీకట్లో తన స్నేహితురాలితో కలిసి ఉన్న యువతిని కత్తితో బెదిరించి వేధింపులకు పాల్పడ్డారు కొంతమంది దుండగులు.

  • Written By:
  • Publish Date - February 15, 2022 / 02:07 PM IST

కొన్ని నెలల క్రితం తాడేపల్లి రైల్వే బ్రిడ్జి కింద చీకట్లో తన స్నేహితురాలితో కలిసి ఉన్న యువతిని కత్తితో బెదిరించి వేధింపులకు పాల్పడ్డారు కొంతమంది దుండగులు. అయితే ఆ ప్రాంతంలో సీసీ కెమెరాల నిఘా లేకపోవడంతో కచ్చితమైన ఆధారాలు లభ్యంకాకపోవడంతో గుంటూరు అర్బన్ పోలీసులకు కేసు ఛేదించేందుకు వారాల తరబడి సమయం పట్టింది. ఈ సంఘటన ఏపీలో కలకలం రేపింది.

నేరాల నియంత్రణకు చెక్ పెట్టేందుకు గుంటూరు పోలీసులు టెక్నాలజీ అనే అయుధాన్ని ఉపయోగించనున్నారు. ఈ మేరకు గుంటూరు అర్బన్ పోలీసు సూపరింటెండెంట్ కె. ఆరిఫ్ హఫీజ్ అదిరిపొయే ఐడియాను కనుగొన్నారు. దాని పేరే ‘పోర్టబుల్ మోషన్ అలర్ట్’. టెక్నాలజీతో కూడిన మోషన్ డిటెక్షన్ సిస్టమ్‌తో కూడిన స్మార్ట్ సోలార్ లైట్ మానవరహిత ప్రాంతాల్లో నేరాలను నియంత్రించడానికి ఒక శక్తివంతమైన సాధనం. కుంచనపల్లిలోని కోనేరు లక్ష్మయ్య విశ్వవిద్యాలయం ఈ ప్రాజెక్టుతో ముందుకొచ్చింది. దీనిని గుంటూరు అర్బన్ పోలీసులు కనీసం 10 చోట్ల ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు.

“గుంటూరు లాంటి అభివృద్ధి చెందుతున్న నగరాలు వలస జనాభా, అధిక సాంద్రత తాకిడి ఉండటంతో కొన్ని ఏరియాల్లో వీధిదీపాల కొరతతో పాటు ఇతర సమస్యలు తిష్టవేశాయి. అయితే ఆ ప్రాంతాలు నేరాలకు హాట్‌స్పాట్‌లుగా మారుతున్నాయి. 24 గంటలపాటు పోలీస్ నిఘా సాధ్యం కానందున, అర్బన్ పోలీసులు స్మార్ట్ పరిష్కారంతో ముందుకు వచ్చారు. మేం ఒక డెమోని చూశాం కొన్ని ప్రాంతాల్లో ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని ప్లాన్ చేస్తున్నాం’’ అని హఫీజ్ చెప్పారు. ప్రాజెక్ట్ ప్రధాన భాగాలు సోలార్ ప్యానెల్, స్ట్రీట్ లైట్, బ్యాకప్ నిల్వ పరికరం. మోషన్ డిటెక్షన్ సిస్టమ్ 15 మీటర్ల వ్యాసార్థంలో ఏదైనా కదలికను గుర్తించడానికి, GSM మాడ్యూల్ ద్వారా ఏదైనా కనెక్ట్ చేయబడిన పరికరానికి హెచ్చరికను పంపడానికి PIR సెన్సార్‌లను ఉపయోగిస్తుంది. సహజ కాంతి లేనప్పుడు, LDR ప్యానెల్ కాంతి తీవ్రతను గుర్తించి, మాడ్యూల్‌కు కనెక్ట్ చేయబడిన కాంతిని ఆన్ చేస్తుంది. PIR మాడ్యూల్ మనుషుల కదలికలను పసిగట్టి దానిని GSM మాడ్యూల్‌కి పంపుతుంది. నిఘా కోసం సమీపంలోని పోలీసు కంట్రోల్ రూమ్‌కి సందేశం పంపుతుంది. తద్వారా పోలీసులు అలర్ట్ అయ్యే అవకాశాలున్నాయి.