Site icon HashtagU Telugu

AP Real Estate : జ‌గ‌న‌న్న ‘రియ‌ల్ ఎస్టేట్ ‘

Jagan Real Estate

Jagan Real Estate

ఏపీ ప్ర‌భుత్వం సేవ రూపంలో వ్యాపారం చేయ‌డానికి ముంద‌డుగు వేస్తోంది. రియ‌ల్ ఎస్టేట్ రంగంలోకి తాజాగా అడుగుపెట్టింది. అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ ను త‌యారు చేసింది. ఇక నుంచి జ‌గ‌న‌న్న స్మార్ట్ టౌన్ షిప్ లు ఏపీ వ్యాప్తంగా రాబోతున్నాయి. ప్ర‌భుత్వం ఇచ్చే క్లియ‌ర్ టైటిల్ ఈ ప‌థ‌కంలోని కీల‌క అంశం. దాన్ని ఉప‌యోగించి పెద్ద ఎత్తున రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం చేయ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేసింది. న‌మూనాగా తొలుత అనంతపురం జిల్లా ధర్మవరం, కడప జిల్లా రాయచోటి, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు, గుంటూరు జిల్లా నవులూరు ప్రాంతాల్లో లేఔట్లు వేయ‌నుంది.ప్రైవేటు రియ‌ల్డ‌ర్లు ఇప్ప‌టి వ‌ర‌కు లే వౌట్లు వేసి మార్కెటింగ్ చేయ‌డం చూశాం. ఇదో పెద్ద వ్యాపార రంగంగా ప్ర‌స్తుతం ఉంది. కొన్ని ల‌క్ష‌ల మంది ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ ఆ రంగాన్ని న‌మ్ముకుని బ‌తుకుతున్నారు. కొంద‌రు ఆ వ్యాపారాన్ని న‌మ్ముకుని వేల కోట్లు సంపాదించారు.

సామాన్యుల‌కు అంద‌నంతగా కృత్రిమ ధ‌ర‌ల‌ను క్రియేట్ చేసి మోసం చేసే వాళ్లు రియ‌ల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ‌గా ఉంటారు. పైగా ఒకే ప్లాట్ ను ఒక‌రి కంటే ఎక్కువ మందికి విక్ర‌యించ‌చ‌డం ద్వారా మోసం చేసే వ్యాపారులు అనేక మంది ఉన్నారు. రియ‌ల్ ఎస్టేట్‌కు సంబంధించిన కేసులు కూడా కోర్టుల్లో ఎక్కువ‌గా ఉన్నాయి. వీట‌న్నింటినీ దృష్టిలో పెట్టుకుని సామాన్యుల‌కు అందుబాటులో రియ‌ల్ ఎస్టేట్ ను తీసుకురావ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ సిద్ధం అయింది.
మార్కెట్ ధర కంటే తక్కువగా మధ్య తరగతి ప్రజలకు ప్లాట్లను అందించ‌డ‌మే జ‌గ‌న‌న్న స్మార్ట్ సిటీ టౌన్ షిప్ ల ల‌క్ష్యం. లాభాపేక్ష లేకుండా క్లియర్ టైటిల్ ఉన్న ప్లాట్లు అందించ‌డానికి ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఎంఐజీ (మిడిల్ ఇన్ కమ్ గ్రూప్) లేఔట్లలో అన్ని సౌకర్యాలతో ప్లాట్లు అందుబాటులో ఉంచాల‌ని ప్రాథ‌మికంగా నిర్థారించారు. మూడు కేటగిరీల్లో ప్లాట్లను విభ‌జించింది. ఎంఐజీ-1 కింద 150 గజాలు, ఎంఐజీ-2 కింద 200 గజాలు, ఎంఐజీ-3 కింద 240 గజాల స్థలాన్ని అందించ‌నుంది. మంగ‌ళ‌వారం నుంచి ప్లాట్లను ఆన్ లైన్లో రిజిస్టర్ చేసుకునే వెసుల‌బాటు క‌ల్పించింది. అందుకు సంబంధించిన `స్మార్ట్ టౌన్ షిప్స్` వెబ్ సైట్ ను జ‌గ‌న్ ప్రారంభించాడు.నాలుగు విడతల్లో డ‌బ్బును చెల్లించ‌డం ద్వారా ప్లాట్ ను సొంతం చేసుకునే వెసుల‌బాటు ఉంది. ఒకేసారి డబ్బు కట్టే వారికి 5 శాతం రాయితీ క‌ల్పించారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గానికి ఈ పథకాన్ని విస్త‌రింప చేయ‌డానికి జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తోంది. సో..ఇక ప్రైవేటు రియ‌ల్ దందాల‌కు ఏపీలో చెక్ ప‌డిన‌ట్టే భావిస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అనుమ‌తులు లేకుండా లే ఔట్లు వేసి కోట్ల రూపాయాలు దండుకున్న రియ‌ల్డ‌ర్లు ఉన్నారు. అలాంటి వాళ్ల‌కు చెక్ పెట్టేలా జ‌గ‌న్ చేస్తోన్న ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు ఫ‌లిస్తుందో చూద్దాం.!