AP Debts: ఏపీ అప్పులు దాదాపు రూ.7,88,836 కోట్లా? జగన్ సర్కారు లెక్కల్లో మతలబేంటి?

ఆంధ్రప్రదేశ్ కు అప్పులు గుదిబండగా మారిపోయాయి. ఒక్క అడుగును కూడా ముందుకు పడనీయడం లేదు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలు నిజమే అని లెక్కలు చూస్తే అర్థమవుతుంది.

  • Written By:
  • Updated On - July 22, 2022 / 11:48 AM IST

ఆంధ్రప్రదేశ్ కు అప్పులు గుదిబండగా మారిపోయాయి. ఒక్క అడుగును కూడా ముందుకు పడనీయడం లేదు. ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర ప్రభుత్వం చేసిన హెచ్చరికలు నిజమే అని లెక్కలు చూస్తే అర్థమవుతుంది. శ్రీలంక పరిస్థితిని చూసైనా సరే జాగ్రత్తపడాలని ఏపీతోపాటు మరో పది రాష్ట్రాలను హెచ్చరించింది. కానీ ఆ సమావేశంలో కేంద్రం చెప్పినదానికన్నా ఎక్కువ అప్పులే ఏపీకి ఉన్నాయి అంటున్నారు ఆర్థిక నిపుణులు.

రాష్ట్ర జీఎస్పీడీపీలో అప్పులు 4 శాతానికి మించకూడదు. ఇది ఆర్థిక సంఘం చెప్పిన లెక్కే. ఆ విధంగా ఏపీ చేసిన అన్ని అప్పులను కాని లెక్కలు తీస్తే.. ఆ లిస్టు చాంతాడంత ఉంటుందంటున్నారు ఆర్థికనిపుణులు. ఏపీ అప్పును దాదాపు రూ. 4.25 లక్షల కోట్లుగా కేంద్రం చెప్పినట్టు కొందరు అంటున్నారు. అసలు లెక్కలు చూస్తే.. ఏపీ సర్కారు గత మూడేళ్లుగా బడ్జెట్ లో చూపకుండా చేసిన అప్పే రూ.28,837 కోట్లు. ఇది కేంద్రం చెప్పిన లెక్కే. 2019 నుంచి 2022 వరకు ఉన్న లెక్కల ఆధారంగా ఈ అప్పులను చూపినట్లు తెలుస్తోంది.

ఏపీ సర్కారు.. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ద్వారా సుమారు రూ.23,000 కోట్ల అప్పును గత మూడేళ్లలోనే తీసుకుంది. దీంతోపాటు వివిధ కార్పొరేషన్లకు గ్యారంటీలు ఇచ్చి సుమారు రూ.70 వేల కోట్లు తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు డిపాజిట్లను మళ్లించడానికి నాన్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిందన్న ఆరోపణలున్నాయి. అంటే ఇలా బడ్జెట్ లో చూపకుండానే సుమారు రూ. లక్ష కోట్లకు పైగా రుణాలు తీసుకుందంటున్నారు ఆర్థిక నిపుణులు. వీటికి ఏటా అసలు, వడ్డీల రూపంలో చెల్లిస్తోంది రూ.15 వేల కోట్లు ఉంటుందని అంచనా.

కేంద్రం మాత్రం ఒక లెక్కను స్పష్టంగా చెప్పింది. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా సరే.. ప్రభుత్వ రంగ సంస్థలు, ఎస్పీవీ, వివిధ కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకుని.. వాటి అసలు, వడ్డీలను బడ్జెట్ ద్వారా కాని, సర్కారుకు వచ్చే పన్నుల రూపంలో కాని చెల్లిస్తే.. అవి రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే గుర్తిస్తామంది. అంటే ఈ లెక్కన ఏపీ సర్కారు అప్పు చాలా ఉందని అర్థమవుతోంది.

నిపుణుల అంచనాలను చూస్తే.. 2022 మార్చి 31 నాటికి.. ఏపీ బహిరంగ రుణాలు రూ. 4,13,000 కోట్లు, కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పు రూ. 1,38,603 కోట్లు, స్టేట్ ఫైనాన్షియల్ సర్వీస్ కార్పొరేషన్ ద్వారా తీసుకున్న అప్పు రూ. 10,000 కోట్లు, నాన్ గ్యారంటీ రుణాలు రూ. 77,233 కోట్లుగా అంచనా వేస్తున్నారు నిపుణులు. గత మూడేళ్లుగా ఉన్న పెండింగు బిల్లులు సుమారు రూ.1,50,000 కోట్లు ఉంటుందని మరో అంచనా. అంటే ఇవన్నీ కలిపితే.. మొత్తం అప్పు రూ. 7,88,836 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది.