అర్చకుల గౌరవ వేతనం పెంచేందుకు జగన్ సర్కార్ సిద్ధం అవుతోంది. ఆలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు యూనిఫాం డ్రెస్ కోడ్ అమలు చేయనుంది. దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయాల్లో దసరా వేడుకలను ప్రత్యేకంగా నిర్వహించడానికి ప్రయత్నం జరుగుతోంది. జిల్లా స్థాయి ఎండోమెంట్స్ అధికారులు ఉత్సవాలను పర్యవేక్షించేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేవాదాయ శాఖ ఉద్యోగులకు పదోన్నతుల ప్రకటించడానికి జగన్ సర్కార్ జాబితాను సిద్ధం చేసింది. ఆ మేరకు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యానాయణ అధికారుల సమీక్షలో వెల్లడించారు.
దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయ భూములను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ భరోసా ఇచ్చారు. దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఆలయ భూములపై కోర్టు కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎండోమెంట్స్ శాఖ వ్యవహారాలపై ప్రతి మంగళవారం సమీక్షా సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. శాఖ పరిధిలోని పలు దేవాలయాల భూములు వివాదాలు, వ్యాజ్యాల్లో ఉన్నాయని మంత్రి గుర్తు చేశారు. సివిల్ కోర్టుల్లో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా తీర్పులు వెలువడుతున్నాయని అన్నారు.
ఈ కేసులను అసిస్టెంట్ కమిషనర్ (ఎండోమెంట్స్)కి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, వాటి పర్యవేక్షణకు స్టాండింగ్ కమిటీ కూడా ఉందని చెప్పారు. అవసరమైతే అన్యాక్రాంతమైన భూములకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్తామని అన్నారు. 2019కి ముందు 1,600 దేవాలయాలకు మాత్రమే వర్తింపజేసిన ధూప దీప నైవేద్యం పథకం (డీడీఎన్‌ఎస్) రాష్ట్రవ్యాప్తంగా 2,000కు పైగా ఆలయాలకు విస్తరింపజేయనున్నట్లు సత్యనారాయణ వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో ధూపదీప నైవేద్యాలు నిర్వహించేలా చూడాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని మంత్రి అన్నారు.