ఉప ఎన్నికపై టీడీపీ, జ‌న‌సేన తిక‌మ‌క‌..బ‌ద్వేల్ వైసీపీ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ సుధ‌

క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ వైసీపీ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ దాస‌రి సుధ‌ను ప్ర‌క‌టించారు. ఆమె ఇటీవ‌ల మ‌ర‌ణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య స‌తీమ‌ణి. అత్య‌ధిక మోజార్టీతో ఆమెను గెలిపించుకుంటామ‌ని ప్ర‌భుత్వం స‌ల‌హాదారు స‌జ్జల రామ‌క్రిష్ణారెడ్డి వెల్ల‌డించారు

  • Written By:
  • Publish Date - September 29, 2021 / 02:08 PM IST

క‌డ‌ప జిల్లా బ‌ద్వేల్ వైసీపీ అభ్య‌ర్థిగా డాక్ట‌ర్ దాస‌రి సుధ‌ను ప్ర‌క‌టించారు. ఆమె ఇటీవ‌ల మ‌ర‌ణించిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్ట‌ర్ వెంక‌ట సుబ్బ‌య్య స‌తీమ‌ణి. అత్య‌ధిక మోజార్టీతో ఆమెను గెలిపించుకుంటామ‌ని ప్ర‌భుత్వం స‌ల‌హాదారు స‌జ్జల రామ‌క్రిష్ణారెడ్డి వెల్ల‌డించారు. ఆమెకు వ‌చ్చే మెజార్టీని రెండేళ్ల జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌కు గీటురాయిగా భావిస్తామ‌ని చెప్పారు. ప్ర‌త్య‌ర్థి పార్టీల పోటీపై ఆయ‌న ట్విస్ట్ ఇస్తూ న‌ర్మ‌గ‌ర్భంగా మాట్లాడారు.
సిట్టింగ్ ఎమ్మెల్యే అకాల మ‌ర‌ణం పొందితే పోటీ పెట్ట‌కుండా ఉండే సంప్ర‌దాయాన్ని వైసీపీ అనుస‌రిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు అదే ఫార్ములాను కొన‌సాగిస్తూ వ‌చ్చింది. గ‌తంలో కూడా ప‌లు పార్టీలు ఇదే సంప్ర‌దాయాన్ని కొన‌సాగించాయి. ఒక‌టి రెండు సంద‌ర్భాల్లో మిన‌హా ఉమ్మ‌డి ఏపీ నుంచి ఆ సంప్ర‌దాయం కొన‌సాగుతోంది. వైసీపీ కూడా గ‌తంలో అదే సంప్ర‌దాయాన్ని అనుస‌రించింది. కానీ, ప్ర‌త్య‌ర్థి పార్టీలు ఆ సంప్ర‌దాయాన్ని కొన‌సాగించాల‌ని విజ్ఞ‌ప్తి చేస్తారా? అనే ప్ర‌శ్న‌కు సజ్జ‌ల ట్విస్ట్ ఇస్తూ స‌మాధానం ఇచ్చారు. అలాంటి అప్పీలు త‌మ పార్టీ చేయ‌ద‌ని చెబుతూ..ప్ర‌త్య‌ర్థి పార్టీల ఇష్ట‌మ‌ని క‌ర్ర ఇర‌గ‌కుండా పాము చావ‌కుండా రిప్లై ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అయింది.
ప‌లు సంద‌ర్భాల్లో టీడీపీ, జ‌న‌సేన‌, వామ‌ప‌క్షాలు సంప్ర‌దాయాల‌ను పాటించాయి. సిట్టింగ్ అభ్య‌ర్థులు మ‌ర‌ణించిన‌ప్ప‌డు ఆ ఇంటిలోని వాళ్లు పోటీ చేస్తే ప్ర‌త్య‌ర్థి పార్టీలు బ‌రిలోకి దిగేవారుకాదు. కొన్ని ప్ర‌త్యేక‌మైన ప‌రిస్థితుల్లో మిన‌హా పోటీ జ‌రిగేది కాదు. ఇప్పుడు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ, జ‌న‌సేన బ‌ద్వేల్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం ఎన్నిక‌ల్లో్కి దిగుతాయా? లేక దూరంగా ఉంటాయా? అనేది చూడాలి. అధికార పార్టీ నుంచి ఎలాంటి విజ్ఞ‌ప్తి లేదు కాబ‌ట్టి పోటీ చేస్తారా? లేదా? అనేది చూడాలి.