Site icon HashtagU Telugu

Jagan: సమతామూర్తి సేవలో ‘జగన్ ‘.. ప్రశంసించిన జీయర్ స్వామి’!

ramanujacharya

ramanujacharya

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో జరుగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో సోమవారం ఉంటుంది. గన్నవరం నుండి స్పెషల్ ఫ్లైట్ లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న జగన్… అక్కడి నుంచి రోడ్డు మార్గాన ముచ్చింతల్ కు విచ్చేశారు. సాంప్రదాయ దుస్తులు ధరించి వచ్చిన సీఎం జగన్, నేరుగా ప్రవచన మండపానికి చేరుకున్నారు. అనంతరం చిన జీయర్ స్వామి సమక్షంలో ప్రవాస భారతీయ చిన్నారుల విష్ణు సహస్రనామ అవధానాన్ని ఏపీ సీఎం వీక్షించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం జగన్ మోహన్ రెడ్డి… సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు రామానుజాచార్యులు కృషి చేశారని కొనియాడారు. పూర్వమే అసమానతలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారని జగన్ అన్నారు. రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి విగ్రహ ప్రతిష్ఠ లాంటి గొప్ప కార్యక్రమం అయిన చినజీయర్ స్వామికి ప్రత్యేక అభినందనలు తెలిపారాయన. రామానుజ స్వామి కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఆ తర్వాత చిన్నారులకు ప్రజ్ఞా పుస్తకాలను బహుకరించారు జగన్.

మరోవైపు సమతామూర్తిని దర్శించుకున్న ఏపీ సీఎం పై ప్రశంసల జల్లు కురిపించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి. జగన్ నిబద్దత చూసి ఆశ్చర్యపోయానని…. ఆంధ్రప్రదేశ్ లో విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించిన వైఎస్ జగన్ ను అభినందిస్తున్నానని అన్నారు చిన జీయర్ స్వామి. ప్రతి పాలకుడు అందరినీ సమానంగా చూస్తూ వారి అవసరాలను గుర్తించి వాటిని పూర్తి చేయాలని సూచించారాయన. విద్య, వయసు, దనం, అధికారం నాలుగు ఉన్న వారు ఇతరుల సలహాలు తీసుకోరనీ… కానీ అవన్నీ ఉన్నా కూడా వైఎస్ జగన్ లో ఎలాంటి గర్వం లేదని అన్నారు చిన జీయర్ స్వామి. జగన్ అందరి సలహాలు స్వీకరించడంతో పాటు సలహాలు పాటిస్తారని తెలిపారు. ఏపీ సీఎం మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుతున్నారు. అనంతరం సహస్రాబ్ది ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన సమతామూర్తి విగ్రహాన్ని జగన్ మోహన్ రెడ్డి దర్శించుకున్నారు. విగ్రహ విశేషాలను ఏపీ సీఎం జగన్ కు చినజీయర్ స్వామి వివరించారు. ఆ తర్వాత అక్కడి నుంచి జగన్ తిరుగుప్రయాణం అయ్యారు.