ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గిరిజన ప్రాంతాల్లో పీఎం ఆవాస్ యోజనకు సంబంధించి గిరిజన గృహ పథకాన్ని అమలు చేయడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పీఎం ఆవాస్ యోజన 1.0 కింద గృహాల నిర్మాణానికి కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత ఐదేళ్లలో నిర్మాణం ప్రారంభం కాని ఇళ్లను రద్దు చేసే ప్రతిపాదనపై క్యాబినెట్ చర్చించి నిర్ణయం తీసుకుంది. ఇరిగేషన్ శాఖలో జీవో 62 అమలు గురించి కూడా క్యాబినెట్ లో చర్చలు జరిగాయి. ఏపీ ఆయుర్వేద, హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్ చట్టం సవరణకు మంత్రి మండలి ఆమోదం ఇచ్చింది. ఇంటిగ్రేటెడ్ టూరిజం పాలసీ 2024-29ని కేబినెట్ ఆమోదించి, 2024-29 స్పోర్ట్స్ పాలసీలో కూడా కొన్ని మార్పులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
క్యాబినెట్ నిర్ణయాలివే..
- ఆయుర్వేద, హోమియోపతి ప్రాక్టీషనర్ రిజిస్ట్రేషన్ చట్టంలో సవరణలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- పొట్టి శ్రీరాములు వర్ధంతి (డిసెంబరు 15)ని ఆత్మార్పణ సంస్మరణ దినంగా నిర్వహించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ 4.0కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- ఏపీ టెక్స్‌టైల్స్ గార్మెంట్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- ఏపీ మారిటైమ్ పాలసీకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- పులివెందుల, ఉద్దానం, డోన్ తాగునీటి ప్రాజెక్టులకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
జేజేఎం వినియోగంలో జాప్యంపై సీఎం అసంతృప్తి..
క్యాబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్ (జేజేఎం) అమలులో జాప్యంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మిషన్, డీపీఆర్ స్థాయిని దాటి ముందుకు వెళ్లట్లేదని ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కూడా జేజేఎం ప్రాజెక్టు సద్వినియోగం కుదరడం లేదని, దిల్లీలోనూ ఈ విషయం గురించి ప్రచారం జరుగుతోందని తెలిపారు.
బ్యూరోక్రసీ కారణంగా పథకం సక్రమంగా అమలుకావడం లేదని సీఎం అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ పథకం ప్రతి ఒక్కరికీ చేరువయ్యే అత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని, ఇది మిషన్ మోడ్‌లో అమలైతే అద్భుతమైన ఫలితాలను ఇచ్చే అవకాశం ఉందని మంత్రి లోకేశ్ తెలిపారు. పథకాల సక్రమ వినియోగంపై పూర్తిగా దృష్టి పెట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.
ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు పూర్తయిన సందర్భంగా, ఇప్పటివరకు జరిగిన పనులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎవరెవరు ఏం చేసినా అన్న వివరాలతో సహా నివేదిక అందించాలని అన్నారు.
మద్యం, ఇసుక, రేషన్ మాఫియాలను అరికట్టామని, ఇప్పుడు బియ్యం మరియు భూ దురాక్రమణ మాఫియాలపై సవాలు ఎదుర్కొంటున్నామని, వీటిని కూడా అరికట్టాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. అలాగే, కాకినాడ పోర్టులో 41 శాతం వాటాను అరబిందో కంపెనీ స్వాధీనం చేసుకున్నారని, వైకాపా హయాంలో ఆస్తులను లాక్కోవడం ట్రెండ్‌గా మారిందని ఆయన అన్నారు.