AP Assembly Sessions: ఏపీలో నేటి అసెంబ్లీ బడ్డెట్ సమావేశాలు (AP Assembly Sessions) ప్రారంభంకానున్నాయి.10 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉంది. ఏపీ కేబినెట్ బడ్జెట్‌కు ఆమోదం తెలపనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో మంత్రి అచ్చెన్నాయుడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. సుమారు రూ.2.7 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే ఈ బడ్జెట్ సమావేశాలను వైసీపీ ఎమ్మెల్యేలు బహిష్కరించిన విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీ సమావేశాల్లో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే పత్రాలకు ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ పూజలు నిర్వహించారు.
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అసెంబ్లీ హాలులోని సీఎం ఛాంబర్‌లో మంత్రులు భేటీ అయ్యారు. ఉదయం 9 గంటలకు వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి సీఎం చంద్రబాబుతోపాటు ఎమ్మెల్యేలు నివాళులు అర్పించారు. అక్కడి నుంచి సచివాలయానికి చేరుకొని మంత్రులతో సీఎం భేటీ కానున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతిపాదనలకు వారు ఆమోదం తెలుపనున్నారు. అయితే ఈ బడ్జెట్‌లో పలు పథకాలపై స్పష్టత రానున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక ఇప్పటికే అన్ని పథకాలపై వాటికి అయ్యే ఖర్చులపై కసరత్తు చేసిన కూటమి ప్రభుత్వం అందుకు తగిన విధంగానే బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు సమాచారం అందుతోంది.
Also Read: Trump Vs Putin : పుతిన్‌కు ట్రంప్ ఫోన్ కాల్.. ఉక్రెయిన్‌తో యుద్ధం ఆపాలని సూచన
ఎమ్మెల్యేలతో జగన్ కీలక భేటీ
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో తన పార్టీ ఎమ్మెల్యేలతో ఉదయం 10:30 గంటలకు వైసీపీ అధినేత జగన్ భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కాగా, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వనందుకు నిరసనగా అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని వారు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మండలికి మాత్రం వైసీపీ ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.