AP Theatres : ఏపీలో ఆ థియేటర్ల యజమానులకు వార్నింగ్! 24 గంటల్లో సంతకం చేయాలి.. లేదంటే సీజ్!

అందరికీ సినిమా వేసే థియేటర్ యజమానులకే బొమ్మ చూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అధికారుల ధోరణితో సత్తెనపల్లిలోని కొన్ని సినిమా థియేటర్ల యజమానులకు చుక్కలు కనిపిస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - June 20, 2022 / 02:02 PM IST

అందరికీ సినిమా వేసే థియేటర్ యజమానులకే బొమ్మ చూపిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అధికారుల ధోరణితో సత్తెనపల్లిలోని కొన్ని సినిమా థియేటర్ల యజమానులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం నిర్వహించే ఆన్ లైన్ విధానం ద్వారా టిక్కెట్ల అమ్మకాలకు ఓకే చెబుతూ సంతకాలు చేయాలని స్థానిక రెవెన్యూ శాఖ అధికారులు హుకుం జారీ చేశారు. దీనికోసం ప్రత్యేకంగా తయారుచేసిన ప్రొఫార్మాతో అధికారులంతా థియేటర్ల బాట పట్టారు.

ఇప్పటికే ఆన్ లైన్ టిక్కెట్ల అమ్మకాలు జరుగుతున్నాయి. కాకపోతే ప్రైవేటు సంస్థలు ఇలా చేస్తున్నాయి. అయినా సరే.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఆఫ్ లైన్ లోనే టిక్కెట్లను అమ్ముతున్నారు. వారికి ఆన్ లైన్ లో బుక్ చేసుకునేంత సదుపాయం ఉండదని థియేటర్ల యజమానులు అంటున్నారు. సినిమా టిక్కె్ట్ల అమ్మకాలపై థియేటర్ యజమానులు ఇప్పటికే జీఎస్టీ చెల్లిస్తున్నారు. ఇప్పుడీ కొత్త విధానం వల్ల ప్రతీ టిక్కెట్ పై రూ.2 సర్వీస్ ట్యాక్స్ కింద చెల్లించాల్సి వస్తుందన్నదానిపై చర్చలు జరుగుతున్నాయి.

నగరాల్లో ఆన్ లైన్ టిక్కె్ట్ల అమ్మకాలకు ఇబ్బందులు ఉండవని.. కానీ మండల కేంద్రాలు, గ్రామాల్లో ఉండే సీ గ్రేడ్ థియేటర్లలో కూడా ఆన్ లైన్ లోనే టిక్కెట్లు అమ్మాలనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు థియేటర్ల యజమానులు. ఒకవేళ సంతకం చేయకపోతే థియేటర్లను సీజ్ చేస్తామని.. రూ.5 లక్షలు జరిమానా వసూలు చేస్తామంటున్నారు అధికారులు. దీంతో అధికారులు తమను ఇబ్బంది పెడితే.. తామే స్వచ్ఛందంగా థియేటర్లను మూసివేస్తామంటున్నారు వాటి యజమానులు. నరరావుపేట , వినుకొండ, మాచర్ల, పిడుగురాళ్ల, చిలకలూరిపేట ఇలాంటి చోట ఈ పరిస్థితి కనిపిస్తోంది.