AP CM Jagan Administration: చంద్ర‌బాబు బాట‌న జ‌గ‌న్ పాల‌న‌?

వారానికి `మూడు రోజులు విశాఖ‌ప‌ట్నం, రెండు రోజులు అమ‌రావ‌తి, ఒక రోజు క‌ర్నూలు..ఇదీ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ద‌స‌రా త‌రువాత ప‌రిపాల‌న షెడ్యూల్‌.

  • Written By:
  • Publish Date - September 13, 2022 / 01:01 PM IST

వారానికి `మూడు రోజులు విశాఖ‌ప‌ట్నం, రెండు రోజులు అమ‌రావ‌తి, ఒక రోజు క‌ర్నూలు..ఇదీ ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ద‌స‌రా త‌రువాత ప‌రిపాల‌న షెడ్యూల్‌. ` ఆ మేర‌కు తాడేప‌ల్లి వ‌ర్గాల్లో న‌డుస్తోన్న విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. ద‌స‌రా త‌రువాత ఏ రోజైనా ఆ షెడ్యూల్ ను అమ‌లు చేయ‌డానికి వీలుంద‌ని తెలుస్తోంది. మూడు రాజ‌ధానుల అంశాన్ని ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభం అయ్యే అసెంబ్లీ స‌మావేశాల్లో చ‌ర్చించ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌రోసారి సిద్ధమ‌వుతున్నార‌ని తెలుస్తోంది.

విశాఖ‌ప‌ట్నంలో నిర్వ‌హ‌ణ రాజ‌ధాని, శాస‌న రాజ‌ధాని అమ‌రావ‌తి, న్యాయ రాజ‌ధాని క‌ర్నూలులో ఉండాల‌ని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ భావిస్తోంది. ఆ విష‌యాన్ని మంత్రులు అమ‌ర్నాథ్‌, ధ‌ర్మాన ప్ర‌సాద్ తదిత‌రులు తాజాగా స్ప‌ష్టం చేశారు. మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని కూడా మూడు రాజ‌ధానుల అంశాన్ని మ‌ళ్లీ చెబుతున్నారు. పేద‌ల‌కు స్థ‌లాలు ఇవ్వ‌డానికి లేదంటోన్న అమ‌రావ‌తి వ‌ద్దంటూ వైసీపీ తాజాగా స్లోగ‌న్ అందుకుంది. అందుకే, ద‌స‌రా నుంచి విశాఖ‌ప‌ట్నం నుంచి ప‌రిపాల‌న సాగించ‌డానికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సిద్ధం అయిన‌ట్టు వైసీపీ వ‌ర్గాల్లోని టాక్‌. ఆ మేర‌క విశాఖ‌ పీఠాధిప‌తి స్వ‌రూపానందేంద్ర‌స్వామి ముహుర్తాన్ని ఫిక్స్ చేస్తున్నార‌ని తెలుస్తోంది.

గ‌తంలో చంద్ర‌బాబు కూడా వారానికి మూడు రోజులు విజ‌య‌వాడ‌, రెండు రోజులు హైద‌రాబాద్, ఒక రోజు ఢిల్లీ నుంచి ప‌రిపాల‌న సాగించాల‌ని భావించారు. 2014లో ఆయ‌న సీఎం అయిన త‌రువాత ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ లోని స‌చివాల‌యాన్ని సుమారు రూ 20కోట్ల‌తో రీమెడ‌ల్ చేయించారు. విజ‌యవాడ కేంద్రంగా క్యాంప్ ఆఫీస్ ను సిద్ధం చేసుకున్నారు. ఎన్డీయేలో ఆనాడు భాగ‌స్వామిగా ఉన్న ఆయ‌న ఒక రోజు ఢిల్లీలో ఉండ‌డానికి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, అనూహ్యంగా ఓటుకు నోటు కేసు వ‌చ్చింది. ఆ త‌రువాత జ‌రిగిన ప‌రిణామాలు అంద‌రికీ తెలిసిన‌వే. సీన్ క‌ట్ చేస్తే ఉండ‌వ‌ల్లికి మ‌కాం పూర్తిగా మార్చేశారు.

ప్ర‌తిప‌క్ష నాయ‌కునిగా ఆనాడు ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హైద‌రాబాద్ లోని లోట‌స్ పాండ్ నుంచి రాజ‌కీయాల‌ను న‌డిపారు. విజ‌య‌వాడ స‌మీపంలోని తాడేప‌ల్లి వ‌ద్ద నివాసం ఉన్న‌ప్ప‌టికీ హైద‌రాబాద్ కేంద్రంగా న‌డిపించారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత తాడేప‌ల్లికి ఆయ‌న షిప్ట్ అయ్యారు. ఇప్పుడు సీఎం హోదాలో విశాఖ‌ప‌ట్నం నుంచి ప‌రిపాల‌న సాగించ‌డానికి స‌ర్వం సిద్ధం చేసుకున్నార‌ట‌. ఒక వైపు అమ‌రావతి ఏకైక‌ రాజ‌ధాని కోసం రైతులు మ‌హాపాద‌యాత్ర 2.0 ను నిర్వ‌హిస్తున్నారు. ఇంకో వైపు ద‌స‌రా నుంచి విశాఖ నుంచి ప‌రిపాల‌న సాగించ‌డానికి జ‌గ‌న్ సిద్ధం అవుతున్నార‌ని తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో ఆయ‌న అనుకున్న షెడ్యూల్ ప్ర‌కారం పాల‌న చేస్తారా? లేక ఆనాడు చంద్ర‌బాబునాయుడు విష‌యంలో జ‌రిగిన‌ట్టు షెడ్యూల్ రివ‌ర్స్ అవుతుందా? అనేది చూడాలి.