Lokesh CID Notices: లోకేష్‌కు సీఐడీ నోటీసులు

అమరావతి ఇన్నర్‌ రోడ్డు కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అక్టోబర్‌ 4న విచారణకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ శనివారం నోటీసులు జారీ చేసింది.

Lokesh CID Notices: అమరావతి ఇన్నర్‌ రోడ్డు కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ను అక్టోబర్‌ 4న విచారణకు హాజరుకావాలని ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ శనివారం నోటీసులు జారీ చేసింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ కింద సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. గత కొన్ని రోజులుగా నారా లోకేష్ ఢిల్లీలో ఉంటున్నందున నోటీసులు అందజేయడానికి సీఐడీ బృందం ఢిల్లీకి వెళ్లింది. అక్టోబర్ 4వ తేదీ ఉదయం 10 గంటలకు సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని లోకేశ్‌ను ఆదేశించారు.ఈ కేసులో లోకేష్ ను 14వ నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ సెప్టెంబర్ 26న విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేసింది.ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం లోకేష్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. విచారణ సందర్భంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 41ఏ కింద లోకేష్‌కు నోటీసులు జారీ చేస్తామని సీఐడీ కోర్టుకు తెలియజేసింది. ఈ కేసులో సిఐడి విచారణకు సహకరించాల్సిందిగా లోకేష్ కు కోర్టు సూచించింది.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఏపీ ఫైబర్ నెట్ కేసుల్లో నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రిజనర్ ట్రాన్సిట్ (పీటీ) వారెంట్ పిటిషన్లు దాఖలు చేసింది. అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై 2022 మేలో చంద్రబాబు నాయుడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మాజీ మంత్రి నారాయణ, హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ తదితరులపై సిఐడి ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ప్లాన్ రూపకల్పనకు సంబంధించి 2014 నుంచి 2019 మధ్యకాలంలో ఉన్నత స్థానంలో ఉన్న ప్రభుత్వ అధికారులు కొన్ని అక్రమ, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని వైఎస్‌ఆర్‌సీపీ మంగళగిరి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ దాఖలైంది. కాగా ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌, ఏపీ ఫైబర్‌ నెట్‌ కుంభకోణాల్లో లోకేశ్‌ అరెస్ట్‌ నేపథ్యంలో ఆయన హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కూడా దాఖలు చేశారు. అక్టోబరు 4వ తేదీ వరకు ఆయనను అరెస్టు చేయవద్దని సీఐడీని ఆదేశిస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Also Read:RBI Extends : రూ.2 వేల నోట్ల మార్పిడి డేట్ ను పొడిగించిన RBI