Life Threat on PK: హ‌త్యకు కుట్ర‌ల్లో నిజ‌మెంత‌? రెక్కీల్లో వాస్త‌వ‌మెంత‌?

హ‌త్య‌కు కుట్ర అనేది ఇప్పుడు రాజ‌కీయాల్లో స‌ర్వ‌సాధార‌ణ అంశంగా మారింది. ఒక‌ప్పుడు ఈ ప‌దం చాలా సీరియ‌స్ గా వినిపించేది. సానుభూతి కోసం ఇలాంటి వాటిని ఉప‌యోగించ‌డం స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో రొటిన్ అయింది. అధికార‌, ప్ర‌తిప‌క్షం, విప‌క్షం తేడాలేకుండా `హ‌త్యకు కుట్ర‌` అనే అంశాన్ని వాడేస్తున్నారు. ప్ర‌త్యేకించి ఏపీ రాజ‌కీయాల్లో గ‌త మూడేళ్ల నుంచి ఎక్కువ‌గా ఇలాంటి ప‌దం వినిపిస్తోంది.

  • Written By:
  • Updated On - November 3, 2022 / 04:30 PM IST

హ‌త్య‌కు కుట్ర అనేది ఇప్పుడు రాజ‌కీయాల్లో స‌ర్వ‌సాధార‌ణ అంశంగా మారింది. ఒక‌ప్పుడు ఈ ప‌దం చాలా సీరియ‌స్ గా వినిపించేది. సానుభూతి కోసం ఇలాంటి వాటిని ఉప‌యోగించ‌డం స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో రొటిన్ అయింది. అధికార‌, ప్ర‌తిప‌క్షం, విప‌క్షం తేడాలేకుండా `హ‌త్యకు కుట్ర‌` అనే అంశాన్ని వాడేస్తున్నారు. ప్ర‌త్యేకించి ఏపీ రాజ‌కీయాల్లో గ‌త మూడేళ్ల నుంచి ఎక్కువ‌గా ఇలాంటి ప‌దం వినిపిస్తోంది.

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ లీడ‌ర్ వంగ‌వీటి రాధా హ‌త్య‌కు కుట్ర జ‌రిగింద‌ని ఆ మ‌ధ్య ప్ర‌చారం జ‌రిగింది. కొంద‌రు అనుమానితుల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హ‌త్య‌కు రెక్కీ నిర్వ‌హించార‌ని రాధా కూడా మీడియాకు చెప్పారు. కానీ, ఆ మేర‌కు ఫిర్యాదు చేయ‌డానికి మాత్రం ఆయ‌న ముందుకు రాలేదు. దాదాపు నెల రోజుల పాటు రాధా హ‌త్య‌కు కుట్ర అనే న్యూస్ సంచ‌ల‌నంగా న‌డిచింది. ఆ త‌రువాత నిజానిజాలు ఏమిటో ఎవ‌రికీ తెలియ‌కుండానే పోయింది. ఇప్పుడు జ‌న‌సేనాని ప‌వ‌న్ మీద రెక్కీ అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. దీనిపై తెలంగాణ పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డం జ‌రిగింది. ఇక ఒక మీడియా అధిప‌తి మీద రెక్కీ నిర్వ‌హించార‌ని ఏడాది క్రితం అనుమానం వ్య‌క్తం చేస్తూ న్యూస్ హ‌ల్ చ‌ల్ చేసింది.

ఏడాది క్రితం ప‌ల్నాడు కేంద్రంగా సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి బ‌హిరంగ స‌భ వేదిక‌గా మారీచులు, రాక్షసులతో యుద్ధం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఉంటూ తనను విమర్శించే వారికి గుండెపోటు వస్తుంద‌ని ఆయ‌న అన్నారు. ఆ వ్యాఖ్య‌ల‌ను ఆధారంగా చేసుకుని చంద్ర‌బాబు, ప‌వ‌న్ మీద హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతోంద‌ని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఆనాడు మీడియా ముందు అనుమానం వ్య‌క్తం చేశారు. ఆ త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హ‌త్య‌కు కుట్ర జ‌రుగుతోంద‌ని ఆనాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న‌ నారాయణ స్వామి సంచలనం రేపారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు హాని తలపెడతారని భయపడుతున్నట్లు వెల్లడించారు. ఏపీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబును చంద్రబాబు సామాజికవర్గం చందాలు పోగు చేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్‌కు ప్రాణహాని ఉందంటూ అనంతపురం జిల్లా రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపు దుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన కామెంట్స్ చేసిన వెంట‌నే ఆనాడు డిప్యూటీ సీఎంగా ఉన్న‌ నారాయణ స్వామి చేసిన వ్యాఖ్యలు సెన్సేషనల్‌గా మారాయి. చిత్తూరు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సాక్షిగా నారాయణ స్వామి ఆ మేరకు సంచలన వ్యాఖ్యలు చేయ‌డంతో కొన్ని రోజుల పాటు ఆ ఎపిసోడ్ ఏపీ రాజ‌కీయాల‌ను కుదిపేసింది. ఇక అదే పార్టీకి చెందిన రెబ‌ల్ ఎంపీ ర‌ఘ‌రామ‌క్రిష్ణంరాజు కూడా హ‌త్య‌కు కుట్ర ప‌న్నుతున్నార‌ని ప‌లుమార్లు ఆందోళ‌న చెందారు. ఐపీఎస్‌ అధికా రి సునీల్‌ కుమార్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం జగన్మోహన్‌రెడ్డి, సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్రతో కలిసి హత్య కుట్రపన్నారని త్రిబుల్ ఆయ‌న్ను అరెస్ట్ చేసిన సంద‌ర్భంగా ఆరోప‌ణ‌లు గుప్పించారు.

ద‌శాబ్దాల క్రితం జ‌రిగిన వంగ‌వీటి రంగా హ‌త్య కేసును రెండు రోజుల క్రితం వైసీపీలోని కాపు నేత‌లు తెర‌మీద‌కు తీసుకొచ్చారు. ఆ పాపాన్ని చంద్ర‌బాబుకు రుద్ద‌డానికి ప్ర‌య‌త్నం చేశారు. త‌ర‌చూ ఎన్టీఆర్ ను చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా చంపేశార‌ని కొడాలి నాని అండ్ కో మీడియా ముందు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఇక ప‌రిటాల రవి హ‌త్య‌, కొడెల శివ‌ప్ర‌సాద్ ఆత్మ‌హ‌త్య తదిత‌రాల‌ను ప్ర‌స్తావిస్తూ వైసీపీ రాజ‌కీయం చేస్తోంది. బాబాయ్ హ‌త్య కేసు అంటూ వివేకానంద‌రెడ్డి హ‌త్య‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అండ్ కో మీద అనుమానం క‌లిగేలా టీడీపీ, జ‌న‌సేన ప్ర‌య‌త్నం చేస్తున్నాయి. జ‌రిగిన హ‌త్య‌లు, ఆత్మ‌హ‌త్య‌ల‌తో పాటు జ‌ర‌గ‌బోయే హ‌త్య‌ల‌కు కుట్ర అంటూ తెర‌మీద కు తీసుకొస్తూ ఏపీ రాజ‌కీయాన్ని భ‌యాన‌కంగా మార్చుతున్నారు. ఆ కోవ‌లోకి ఇప్పుడు ప‌వ‌న్ హ‌త్య‌కు కుట్ర అనే అంశం చేరింది. దీనిలో ఎంత నిజం ఉందో తెలియ‌దుగానీ, ప్ర‌చారం మాత్రం హోరెత్తుతోంది.