Anantapur: ఐకాన్ సిటీ త‌ర‌హాలో పుట్ట‌ప‌ర్తి అభివృద్ధి…!

అనంతపురం : పుట్ట‌ప‌ర్తి ఒక‌ప్పుడు అంద‌మైన ఆధ్యాత్మిక టౌన్ షిప్ గా ఖ్యాతిని పొందింది.

  • Written By:
  • Publish Date - November 28, 2021 / 10:07 AM IST

అనంతపురం : పుట్ట‌ప‌ర్తి ఒక‌ప్పుడు అంద‌మైన ఆధ్యాత్మిక టౌన్ షిప్ గా ఖ్యాతిని పొందింది. స‌త్య‌సాయి బాబా బ్ర‌తికి ఉన్న‌ప్పుడు ఈ ప‌ట్ట‌ణానికి వంద‌లాది మంది విదేశీ భ‌క్తులు వ‌స్తుండేవారు.ఇక్క‌డ అనేక మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌తో పాటు చాలా మందికి ఉపాధి దొరికింది.ఈ ప‌ట్ట‌ణానికి దేశ ప్ర‌ధాన మంత్రులు, ఇత‌ర దేశాల నుంచి ప్ర‌ముఖులు వ‌చ్చిన‌ప్ప‌టికీ ఇక్క‌డ ప‌ర్యాట‌క రంగం మాత్రం అభివృద్ధి చెంద‌లేదు. రాష్ట్రంలో 2019లో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లా కలెక్టర్‌ స్థాయిలో ఇక్క‌డ కొన్ని ప‌నుల‌కు అధికారులు శ్రీకారం చుట్టారు. స్థానిక ఎమ్మెల్యేన దుద్దుకుంట శ్రీధ‌ర్ రెడ్డితో కమిటీ వేశారు. రూ.1,000 కోట్ల అభివృద్ధి, పెట్టుబడి ప్రణాళికలు ర‌చించారు. ఈ ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వానికి ప‌రిశీల‌న‌కు పంపించారు. అయితే ఈ ప్ర‌ణాళిక‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రంపై పెద్ద‌గా ఒత్తిడి తీసుకురావ‌డం లేదు.

ప్రధానమంత్రులు అటల్ బిహారీ వాజ్‌పేయ్, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ పుట్ట‌ప‌ర్తిలోనిప్రశాంతి నిలయాన్ని సందర్శించారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, బాబా భక్తులు పట్టణాన్ని సందర్శిస్తూనే ఉన్నారు. కానీ కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ కూడా పుట్టపర్తిని ప‌ర్యాటక కేంద్రంగా ఎన్నడూ చూడలేదు. గత 40 ఏళ్లలో దాని అభివృద్ధికి నిధులు కూడా ఇవ్వలేదు. చిత్రావతి నదిపై 18 కోట్ల రూపాయలతో నిర్మించిన వంతెన తప్ప అసలు ఇక్క‌డ‌ ఏమీ అభివృద్ది జరగలేదు. మంత్రాలయంలోని ఐకాన్ సిటీ తరహాలో పిలిగ్రిం పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని స్థానిక ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధ‌ర్ రెడ్డి తెలిపారు. రూ. 1000 కోట్ల‌తో సత్యసాయి నేషనల్ పార్క్, అండ‌ర్ గ్రౌండ్ డ్రైనేజ్‌, అండ‌ర్ గ్రౌండ్ ఎల‌క్ట్రిక‌ల్ కేబుల్స్‌,రోడ్లు, R&B సర్క్యూట్ గెస్ట్ హౌస్, ఫుడ్ పార్క్, యోగా వెల్నెస్ సెంటర్ లాంటి మౌళిక వ‌స‌తులకు ప్ర‌తిపాదించ‌బ‌డ్డాయి.

ఫుడ్ పార్క్ కోసం 100 ఎకరాల భూమి ఇస్తామని ఏపీఐఐసీ హామీ ఇచ్చింది. మణిళ్లకుంట క్రాస్, కొత్తచెరువు, పుట్టపర్తి, బుక్కపట్నం మండలాల్లో 31.5 కి.మీ మేర రింగ్ రోడ్డు అభివృద్ధికి రోడ్లు, భవనాల శాఖ రూ.350 కోట్లు వెచ్చించనుంది. యోగా వెల్‌నెస్ సెంటర్ కోసం ఇప్పటికే 60 ఎకరాలను గుర్తించారు. వాస్తవానికి చిత్రావతి నదీతీర సుందరీకరణ చేపట్టి ప్రాజెక్టులో భాగంగా వంతెన నిర్మించారు. అయితే ఇప్ప‌టికీ ఇక్క‌డ ప‌ర్యాట‌క రంగం అభివృద్ధి చెంద‌క‌పోవ‌డంపై స్థానికులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.