Anam Daughter : ఆత్మ‌కూరు టీడీపీ అభ్య‌ర్థిగా వైసీపీ ఎమ్మెల్యే `ఆనం` కుమార్తె?

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల బ‌రిలోకి ఆనం కుటుంబానికి చెందిన కైవ‌ల్యారెడ్డి టీడీపీ త‌ర‌పున పోటీకి దిగబోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

  • Written By:
  • Publish Date - May 28, 2022 / 04:23 PM IST

నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు ఉప ఎన్నిక‌ల బ‌రిలోకి ఆనం కుటుంబానికి చెందిన కైవ‌ల్యారెడ్డి టీడీపీ త‌ర‌పున పోటీకి దిగబోతున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గౌత‌మ్ రెడ్డి అకాల మ‌ర‌ణంతో ఆత్మ‌కూరు ఉప ఎన్నిక వ‌చ్చింది. అందుకు సంబంధించిన షెడ్యూల్ ను ఈసీ ప్ర‌క‌టించింది. ఆ క్ర‌మంలో మ‌హానాడు వేదిక‌గా తెలుగుదేశం పార్టీలో చేరిన మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి కుమార్తె కైవ‌ల్యారెడ్డి ఆత్మ‌కూరు నుంచి పోటీ చేయ‌బోతున్నార‌ని టాక్ న‌డుస్తోంది.

జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌తో వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి కూతురు కైవ‌ల్యా రెడ్డి భేటీ అయ్యారు. టీడీపీ మ‌హానాడు జ‌రుగుతున్న నేప‌థ్యంలో తన భర్త రితేశ్ రెడ్డితో కలిసి ఒంగోలు వచ్చిన కైవ‌ల్యా రెడ్డి టీడీపీలో చేర‌డానికి రంగం సిద్ధం చేసుకున్నారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న ఆత్మ‌కూరు అసెంబ్లీ నియోజక‌వ‌ర్గం నుంచి త‌న‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని ఆమె లోకేశ్‌ను కోరిన‌ట్లు స‌మాచారం. దీనిపై లోకేశ్ ఎలా స్పందించార‌న్నది తెలియ‌రాలేదు.

ఇదిలా ఉంటే, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తండ్రి, దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి అత్యంత స‌న్నిహితంగా మెల‌గిన ఆనం ఆయ‌న కేబినెట్‌లో మంత్రిగా ప‌నిచేశారు. వైఎస్ హ‌ఠాన్మ‌ర‌ణం త‌ర్వాత కూడా ఆయ‌న రోశ‌య్య‌, కిర‌ణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌ల‌లోనూ కీల‌క మంత్రిగానే వ్య‌వ‌హ‌రించారు. రాష్ట్ర విభ‌జ‌న‌, 2014లో కాంగ్రెస్ ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో ఆనం కూడా ఓట‌మి చ‌విచూశారు. ఈ క్ర‌మంలో 2014 త‌ర్వాత టీడీపీలో చేరిన ఆనం ఆ త‌ర్వాత 2019 ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.

2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆత్మ‌కూరు అసెంబ్లీ టికెట్‌ను ఆనం కోర‌గా ఆయ‌న‌కు వెంక‌ట‌గిరి టికెట్‌ను వైసీపీ ఆఫ‌ర్ చేసింది. ఈ నేప‌థ్యంలో వేరే ప్ర‌త్యామ్నాయం లేని నేప‌థ్యంలో వెంక‌ట‌గిరి నుంచే బ‌రిలోకి దిగిన ఆనం వైసీపీ హ‌వాలో గెలిచిపోయారు. అయితే సీనియ‌ర్ అయిన త‌న‌కు మంత్రి ప‌ద‌వి ద‌క్కుతుంద‌ని భావించిన ఆనంకు నిరాశే ఎదురైంది. తాజాగా ఇటీవ‌లే జ‌రిగిన మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వస్థీక‌ర‌ణ‌లోనూ జ‌గ‌న్ అవ‌కాశం ఇవ్వ‌లేదు. ఈ క్ర‌మంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆనం త‌న కుమార్తెను వ్యూహాత్మ‌కంగా నారా లోకేశ్ తో భేటీకి పంపార‌ని ప్ర‌చారం సాగుతోంది.