అనకాపల్లి జిల్లా నక్కపల్లి(Anakapally )లో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు వ్యతిరేకంగా మత్స్యకారుల ఆందోళన (Fishermen’s Concern)మళ్లీ ఉధృతమైంది. గత నెల రోజులుగా కొనసాగుతున్న నిరసన దీక్షలు ఇవాళ కొత్త మలుపు తిప్పాయి. వందలాది మత్స్యకారులు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో విశాఖపట్నం–విజయవాడ రహదారిపై సుమారు 12 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. రహదారి బ్లాకుతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోవడంలో విఫలమైందని ఆరోపిస్తూ, మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Vizag Development : హైదరాబాద్ కు 30 ఏళ్లు.. విశాఖకు 10 ఏళ్లు చాలు – లోకేశ్
మత్స్యకారుల ప్రధాన డిమాండ్ – బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్టును రద్దు చేయాలని, అది సముద్ర తీర ప్రాంత పర్యావరణానికి, వారి జీవనాధారానికి హానికరమని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ పార్క్ వల్ల సముద్ర జల కాలుష్యం పెరిగి, చేపల వనరులు నశిస్తాయని, దీని ప్రభావం వేలాది కుటుంబాలపై పడుతుందని వారు చెబుతున్నారు. “మా జీవితాలు సముద్రంపై ఆధారపడ్డాయి. ఆ సముద్రాన్నే విషపూరితం చేస్తే మేము ఎలా బ్రతుకుతాం?” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం పర్యావరణ నియంత్రణ నిబంధనలు పాటిస్తుందని చెబుతున్నా, మత్స్యకారులు మాత్రం ఆ భరోసాను నమ్మడం లేదు. గతంలో ఇతర ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరిశ్రమల వల్ల ఏర్పడిన కాలుష్యాన్ని ఉదాహరణగా చూపిస్తూ, “మాకు హామీలు కాదు, చర్యలు కావాలి” అని అంటున్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆందోళనను విరమించబోమని వారు హెచ్చరించారు. అధికారులు రవాణా అంతరాయం తొలగించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, ఆందోళన ముగిసే సూచనలు కనిపించడం లేదు. నక్కపల్లి తీరంలో మత్స్యకారుల ఈ పోరాటం, పర్యావరణం వర్సెస్ అభివృద్ధి అనే చర్చను మరోసారి ముందుకు తెచ్చింది.
