Site icon HashtagU Telugu

Avinash Reddy Story: అమ్మ దొంగా.. అవినాష్!మే 26కథ అదేనా!

Amma Donga.. Avinash! May 26 Story Is The Same!

Amma Donga.. Avinash! May 26 Story Is The Same!

Avinash Reddy Same Story to CBI : ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు డజను టాబ్లేట్లు వేసిన విపక్షాలకు కడుపు మంట ఏమోగానీ సీబీఐ కి మాత్రం వై ఎస్ కుటుంబం కేసు అంటే జ్వరం వస్తుంది. మాజీ మంత్రి వివేకా హత్య కేసును మలుపులు తిప్పడానికి వేస్తున్న ఢిల్లీ టాబ్లేట్లు బాగా పనిచేస్తున్నాయి. ఏది చెబితే అది చేసేలా సీబీఐ అధికారులకు వేసిన టాబ్లేట్లు పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయని సర్వత్రా వినిపిస్తుంది.

తమలపాకుతో నువ్వు ఇలా అను తలుపు చెక్కతో నేను ఇలా అంటా అనే తొడికోడల్లా ఆటలా సీబీఐ విచారణ ఉంది.విచారణకు పిలిచినట్టు నోటీసులు జారీ చేస్తే దానికి విరుగుడుగా కొత్త డ్రామా రక్తికట్టిస్తా అన్నట్టు ఉంది అవినాష్ రెడ్డి (Avinash Reddy), సీబీఐ అధికారుల వాలకం. ఏదోలా ఈ నెల 26వ తేదీ వరకు అరెస్ట్ కాకుండా సాగతీయ గలిగితే ఆ రోజు జగన్ ఢిల్లీ వెళుతున్నారు. ఢిల్లీ బీజేపీ పెద్దలతో లైజనింగ్ ఉంటుంది. అప్పుడు అరెస్టుకు బ్రేక్ వేయొచ్చని ఆలోచనగా ఉందని సర్వత్రా వినిపిస్తుంది. ముందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టు, సుప్రీం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. గత నెల రోజులుగా న్యాయ స్థానాల చుట్టూ సీబీఐ ని తిప్పుతున్నారు.

హై కోర్ట్ కు కూడా సుప్రీమ్ కోర్టు మొట్టికాయలు వేసేలా అవినాష్ చేయగలిగారు. న్యాయ వ్యవస్థలోని కొన్ని లోపాలను సానుకూలంగా మలచుకుంటూ అదిగో పులి సామెతలా ఇదిగో అరెస్ట్ అన్నట్టు అవినాష్ రెడ్డి (Avinash Reddy) విషయంలో సీబీఐ వ్యవహరిస్తోంది. హైకోర్టు లో వెకేషన్ పిటిషన్ దాని మీద సుప్రీమ్ కు వెళ్లడం అన్నీ అయ్యాయి. ఇక శుక్రవారం అరెస్ట్ ఖాయం అన్నట్టు సీబీఐ బిల్డప్ ఇచ్చింది. సీన్ కట్ చేస్తే సీబీఐ విచారణకు హాజరు కాకుండా అమ్మ పోటు డ్రామాను అవినాష్ రెడ్డి నడిపించారు. దీంతో సీబీఐ 70యం యం సినిమా చూసినట్టు హైదరాబాద్ నుంచి పులివెందుల వెళుతున్న అవినాష్ రెడ్డి ప్రయాణాన్ని తిలకించారు. ఇంకేమైంది మరోసారి ఈ నెల 26 తరువాత విచారణకు హాజరు కావాలని నోటీసులు సీబీఐ ఇస్తుంది. అప్పుడు ఇంకో స్టోరీ నడిపిస్తారని తొలి నుంచి వివేకా మర్డర్ కేసు విచారణ తీరును పరిశీలిస్తున్న వాళ్ల భావించడంలో తప్పు లేదేమో.

ఈనెల 26 న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. నీతి ఆయోగ్ సమావేశం 27న ఉండగా ముందు రోజే హస్తిన ప్రయాణం కట్టారు. ఆ రోజు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా , ప్రధాని నరేంద్ర మోదీని కలిసేలా ప్లాన్ చేస్తున్నారు. కానీ , కర్ణాటక ఓటమి బాధలో ఉన్న బీజేపీ ఢిల్లీ పెద్దలు ఈ సారి జగన్ కలవడానికి అవకాశం ఇవ్వలేదని తెలుస్తుంది. అయితే , చివరి నిమిషంలో నైనా అపాంట్మెంట్ తీసుకోవడానికి భారీ లాబీయింగ్ చేస్తున్నారట.

ఇటీవల వరకు ఢిల్లీ చక్రం ఎంపీ విజయసాయిరెడ్డి నడిపారు. ఆయనే జగన్ ఢిల్లీ పర్యటనలను కోఆర్డినేట్ చేసుకునే వాళ్లు. కానీ , ఇటీవల ఆయన్ను జగన్ దూరం పెట్టారు. కేవలం తాడేపల్లికి పరిమితమ్ చేస్తూ పవర్స్ కట్ చేశారు. దీంతో ఆయన అంటీముట్టనట్లు ఉంటున్నారు. ఫలితంగా ఢిల్లీ లాబీయింగ్ గతంలో మాదిరిగా బలంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ ఈ నెల 26 ఢిల్లీ పర్యటన ఫలించే అవకాశాలు పెద్దగా లేవు. అయినప్పటికీ దింపుడుకళ్ళం ఆశ మాత్రం జగన్ అండ్ టీం కు పోవటం లేదు. సో అవినాష్ రెడ్డి అరెస్ట్ ఈ నెల 26 వ తేదీ వరకు ఉండదని భావిస్తున్న వాళ్ళు ఎక్కువే. అందుకు భిన్నంగా జరిగితే జగన్ ప్రభుత్వం కు కౌంట్డౌన్ ప్రారంభం అయినట్టే.

మాజీ మంత్రి మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నేడూ విచారణకు హాజరుకాలేదు. తన తల్లి శ్రీలక్ష్మి అనారోగ్య కారణాల దృష్ట్యా విచారణకు రాలేనని పేర్కొంటూ సీబీఐకు ఆయన లేఖ రాశారు. ఈ మేరకు లిఖిత పూర్వకంగా సమాచారం ఇచ్చేందుకు ఎంపీ తరఫు న్యాయవాదులు సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. తన తల్లికి గుండెపోటు రావడంతో ఆమెను పులివెందులలోని ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో చేర్చినట్లు లేఖలో అవినాష్‌ పేర్కొన్నారు. సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి చివరి నిమిషంలో గైర్హాజరు కావడం వరుసగా ఇది రెండోసారి. ఈనెల 16న ఆయన విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ ముందస్తు కార్యక్రమాలను కారణంగా చూపుతూ హైదరాబాద్‌ నుంచి కడప వెళ్లిపోయారు. దీంతో సీబీఐ బృందం కూడా అంతేవేగంగా కడప చేరుకోవడం, అవినాష్‌రెడ్డి ఇంట్లో లేకపోవడంతో ఈ నెల 19న(నేడు) విచారణకు రావాలంటూ డ్రైవర్‌కు నోటీస్‌ ఇవ్వడం ఉత్కంఠ రేపింది. తాజాగా విచారణ కోసం పులివెందుల నుంచి హైదరాబాద్‌ చేరుకున్న అవినాష్‌ మళ్లీ చివరి నిమిషంలో సీబీఐకి లేఖ రాస్తూ తన తల్లి అనారోగ్య కారణాల రీత్యా విచారణకు రాలేనని పేర్కొన్నారు. అనంతరం తిరిగి ఆయన పులివెందులకు బయల్దేరారు.

శుక్రవారం ఉదయం హైదరాబాద్‌లోని తన ఇంటి నుంచి సీబీఐ కార్యాలయానికి అవినాష్‌రెడ్డి (Avinash Reddy) బయల్దేరారని, మార్గంమధ్యలో తల్లి ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం వచ్చిందని ఆయన తరఫు న్యాయవాది మల్లారెడ్డి తెలిపారు. అవినాష్‌ తల్లి గుండెపోటుతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. దీంతో వెంటనే ఆయన పులివెందుల బయల్దేరినట్లు తెలిపారు. దీనిపై సీబీఐకి లిఖిత పూర్వకంగా సమాచారం ఇస్తామని, వాళ్లు తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఎలా ముందుకెళ్లాలనేది తాము ఆలోచిస్తామన్నారు. తండ్రి భాస్కర్‌రెడ్ది జైల్లో ఉన్నందున తల్లిని అవినాష్‌రెడ్డే చూసుకోవాల్సి ఉందని న్యాయవాది చెప్పారు.

Also Read:  Delhi Liquor Scam : సిసోడియాపై సాక్ష్యాలున్నాయ్.. సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ లో సీబీఐ