Amaravathi : అమ‌రావ‌తిలో `షా` పుఠాణీ

`కేంద్ర ప్ర‌భుత్వానికి తెలియ‌కుండా జ‌గ‌న్ ఏమీ చేయ‌డు. ప్ర‌తి అంశాన్ని మోడీ, అమిత్ షాకు చెప్పిన త‌రువాత మాత్ర‌మే చేస్తున్నాం..` ఇలా చెప్పింది ఎవ‌రో కాదు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి.

  • Written By:
  • Publish Date - November 19, 2021 / 01:02 PM IST

`కేంద్ర ప్ర‌భుత్వానికి తెలియ‌కుండా జ‌గ‌న్ ఏమీ చేయ‌డు. ప్ర‌తి అంశాన్ని మోడీ, అమిత్ షాకు చెప్పిన త‌రువాత మాత్ర‌మే చేస్తున్నాం..` ఇలా చెప్పింది ఎవ‌రో కాదు ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి. వైసీపీలో నెంబ‌ర్ 2 స్థానంలో ఉన్న ఆయ‌న రాజ్య‌స‌భ మెంబ‌ర్. ఢిల్లీ వ్య‌వ‌హారాల‌ను వైసీపీ త‌ర‌పున‌ చ‌క్క‌దిద్దుతోన్న కీల‌క నేత‌. పైగా `ఏం విజ‌య్..` బాగున్నావా..అంటూ పార్ల‌మెంట్ హాలులో మోడీ ప‌ల‌కరింపులు. ఇవ‌న్నీ మోడీతోనూ, కేంద్రంతోనూ సాయిరెడ్డికి ఉన్న చ‌నువుకు నిద‌ర్శ‌నం. అందుకే.. కేంద్రం, జ‌గ‌న్ స‌ర్కార్ కు మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని ఎవ‌రైనా విశ్వ‌సించ‌కుండా ఉండ‌లేరు.బీజేపీ, వైసీపీ మ‌ధ్య తెర‌చాటు సంబంధాలు తొలి నుంచి చాలా బ‌ల‌మైన‌వి. కేంద్రానికి తెలియ‌కుండా అమ‌రావతి రాజ‌ధాని కాద‌ని జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకునే అవకాశం లేదు. సీఆర్డీయే బిల్లు, అభివృద్ధి వికేంద్రీక‌ర‌ణ బిల్లుల ఆమోదం కూడా కేంద్రంతో చ‌ర్చించిన త‌రువాత మాత్ర‌మే జ‌రిగి ఉంటుంది. పార్ల‌మెంట్లో అనేక సంద‌ర్భాల్లో ఏపీ రాజ‌ధాని గురించి ప్ర‌శ్నిస్తే, దానికి సూటిగా సమాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి కేంద్రానిది. ఒక‌సారి ఉమ్మ‌డి రాజ‌ధాని హైద‌రాబాద్ అని, మ‌రోసారి మూడు రాజ‌ధానుల నిర్ణ‌యం ఉంద‌ని, ఇంకోసారి అమ‌రావ‌తి రాజ‌ధానిగా గెజిట్ ఇవ్వ‌లేద‌ని..ఇలా ర‌క‌ర‌కాల స‌మాధానాలు చెప్పింది.

LIVE UPDATES :  వైజాగ్‌కు మరో గండం

అమ‌రావ‌తి మీద డ్రామా ఆడుతోన్న కేంద్ర ప్ర‌భుత్వంలోని కీల‌క నేత అమిత్ షా ఇప్పుడు భూములు ఇచ్చిన రైతుల ప‌ట్ల సానుకూలంగా స్పందించాడు. మ‌హాపాద‌యాత్ర‌కు బీజేపీ ఏపీ శాఖ మ‌ద్ధ‌తు ప‌ల‌కాల‌ని కూడా ఆదేశించాడు. ఆ మేర‌కు ఈనెల 21న సోమువీర్రాజు, పురంధరేశ్వ‌రి, జీవీఎల్ త‌దిత‌ర కీల‌క నేత‌లు మ‌హాపాద‌యాత్ర‌లో అడుగులు వేయ‌డానికి సిద్ధం అయ్యారు. ఇదంతా చూస్తుంటే…వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్ ఆడుతోన్న‌ మ‌రో రాజ‌కీయ గేమ్ మాదిరిగా కొంద‌రు భావిస్తున్నారు.తెలుగుదేశం ఆధ్వ‌ర్యంలోని ఆనాటి ఎన్డీయే ప్ర‌భుత్వం ఏపీ రాజ‌ధానిగా అమ‌రావ‌తిని తీర్మానం చేసింది. పైగా శంకుస్థాప‌న‌కు ప్ర‌ధాని హోదాలో న‌రేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజ‌ర‌య్యాడు. ఢిల్లీ నుంచి మ‌ట్టి, నీళ్లు కూడా తీసుకొచ్చాడు. దేశ రాజ‌ధాని ఢిల్లీని త‌ల‌ద‌న్నేలా అమ‌రావ‌తి కావాల‌ని ఆకాంక్షించాడు. కానీ, గెజిట్ ను ఇవ్వ‌డానికి మోడీ ఆధ్వ‌ర్యంలోని ఎన్డీయే ప్ర‌భుత్వం గేమ్ ఆడింది. రాజ‌ధాని అమ‌రావ‌తి ఛిన్నాభిన్నం కావ‌డానికి మోడీ చేసిన ప‌ని ఏపీలోని ప్ర‌తి ఒక్క‌రికీ తెలుసు. అమిత్ షా ఇప్పుడు జ‌రిగిన న‌ష్టాన్ని పూడ్చుకునే ప‌నిచేస్తున్నాడా? లేక తెలుగుదేశం పార్టీని బ‌ల‌హీనం చేయ‌డానికి ఎత్తుగ‌డ వేశాడా? అనేది సందిగ్ధం.

Also Read : కుప్పంగిప్పం జాన్తానై.! షా ఆప‌రేష‌న్ షురూ!!

మోడీ, షాలకు తెలియకుండా ఏపీ బీజేపీలోని కొంద‌రు కీల‌క నేత‌లు అధికార పార్టీ కోవర్టులుగా పనిచేయ‌డం అసంభవం. కేంద్రపార్టీ అనుమతితోనే వాళ్ళు అందరూ ఇన్నాళ్లూ అమ‌రావ‌తికి వ్య‌తిరేకంగా దిగజారి ప‌నిచేశార‌ని అనుకోకుండా ఉండ‌లేం. హ‌ఠాత్తుగా ఇప్పుడు అమిత్ షా అమ‌రావ‌తి రైతుల ప‌ట్ల ప్రేమ చూప‌డం వెనుక రాజ‌కీయ కోణాన్ని ప‌రిశీస్తే…తెలంగాణ‌లో టీఆర్ఎస్‌, ఏపీలో వైసీపీతో కేంద్రం బీజేపీతో సాన్నిహిత్యం ఉంది.
అందుకు నిద‌ర్శ‌నంగా రాష్ట్ర‌ప‌తి, ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు, పార్ల‌మెంట్లోని ప‌లు బిల్లుల ఆమోదం స‌మ‌యంలో ఏమి జ‌రిగిందో గుర్తు చేసుకోవ‌చ్చు. కాంగ్రెస్ ముక్త్ భార‌త్ నినాదం దిశ‌గా వెళుతోన్న బీజేపీ తెలంగాణ‌లో టీఆర్ ఎస్ ను, ఏపీలో వైసీపీని కాపాడుతోంది. తెలంగాణ‌లో కాంగ్రెసు పార్టీని బలహీనపరచే మాస్ట‌ర్ ప్లాన్ లో భాగంగా అమిత్ షా తాజా తిరుపతి నాటకం అని టీడీపీ భావిస్తోంది. తెలంగాణ‌లోని ఆంధ్రా ఓట‌ర్లు కాంగ్రెస్ వైపు మ‌ళ్ల‌కుండా అమ‌రావ‌తికి అనుకూల‌మ‌నే బాణం షా విడిచాడ‌ని అంచ‌నా.

Also Read :  షా చాటు జ‌గ‌న్‌.!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అమరావతికి, తెలుగుజాతికి ఇన్నాళ్లూ చేయాల్సిన తీవ్రనష్టం కేంద్రం చేసింది. ఇప్పుడు ఆంధ్రులను మభ్యపెట్టడానికి, తెలంగాణాలో ఆంధ్రా ఓటర్లను త‌మ వైపు ఆకర్షించ‌డానికి మసిపూసి మారేడుకాయ చేసే ప్లాన్ లో భాగంగా మేం తిట్టినట్టు నటిస్తాము, మీరు బాధపడినట్లు నటించండి అన్న‌ట్టు తెర‌చాటు డ్రామాలకు తెరలేపి ఉండవచ్చని భావించే వాళ్లు లేక‌పోలేదు. అమ‌రావ‌తి రాజ‌ధాని ప్రాజెక్టు డామేజ్ కావ‌డం సంతోష‌మ‌నే విష‌యాన్ని హ‌రీష్ తో స‌హా టీఆర్ఎస్ నేత‌లు కొంద‌రు అన్నారు. ఆంధ్రా అస్త‌వ్య‌స్తం కావ‌డంతో తెలంగాణ అభివృద్ధి వేగ‌వంతం అయింద‌ని అసెంబ్లీలోనే కేసీఆర్ వ్యాఖ్యానించాడు. చంద్ర‌బాబు విజ‌న్ తో పోటీ ప‌డ‌డం ఎవ‌రి త‌రమూ కాద‌ని కేటీఆర్ అన్నాడు. ఇవ‌న్నీ వింటుంటే, అమ‌రావ‌తి ప్రాజెక్టును కేసీఆర్, జ‌గ‌న్‌, మోడీ, షా క‌లిసి ఎటూకాకుండా చేశార‌ని ఏపీలోని కొంద‌రి భావ‌న‌.

ఇన్నాళ్లూ అధికారపార్టీకి అనధికార అధికారప్రతినిధులుగా పనిచేస్తున్న ఏపీలోని కొంద‌రు బీజేపీ సీనియ‌ర్ల అవినీతి భాగోతాలపై బీజేపీలోని వాళ్ల ప్ర‌త్య‌ర్థి గ్రూప్ ఢిల్లీ పెద్ద‌ల‌కు అంద‌చేసింద‌ని వినికిడి. వాళ్లు అధికారపార్టీ నుంచి కోట్లాది రూపాయ‌ల‌ ముడుపులు, కాంట్రాక్టులు, పైరవీలు చేశార‌ని కేంద్ర ఇంటెలిజెన్స్ శాఖ సేక‌రించింద‌ట‌. ఇవ‌న్నీ ఢిల్లీ పెద్ద‌ల‌కు తెలుసు కాబ‌ట్టే, కొన్ని మీడియా సంస్థ‌ల‌ను ఎందుకు బ‌హిష్క‌రించారు? అనే ప్ర‌శ్న అమిత్ షా నుంచి వ‌చ్చింది. ఎవ‌రో ఒక‌రి మీద చెప్పు విసిరినంత మాత్రాన మీడియాను దూరం చేసుకోవ‌డం ఏంటి? అంటూ ప‌రోక్షంగా విష్ణువ‌ర్థ‌న్ రెడ్డి వాల‌కాన్ని షా ఎత్తిచూపాడు. ఇక వీర్రాజు మీద కారామీరాలు నూరాడు. ఇవ‌న్నీ నిజం అయితే, రాబోవు రోజుల్లో అమరావ‌తి రాజ‌ధాని ఏపీకి ఒక‌టే ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ, బీజేపీ, టీఆర్ఎస్‌ డ్రామాలో భాగంగా షా ఆ వ్యాఖ్య‌లు చేసి ఉంటార‌ని భావిస్తోన్న వాళ్ల ఆలోచ‌న క‌రెక్ట్ అయితే మూడు రాజ‌ధానులు ఏపీకి రాబోతున్నాయ‌ని అర్థం చేసుకోవ‌చ్చు.