BJP Master Plan : జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి గండం?

మూడేళ్ల త‌రువాత జ‌రిగిన వైఎస్సాఎల్పీ స‌మావేశంలో ఎమ్యెల్యేలు, మంత్రుల‌కు జ‌గ‌న్ దిశానిర్దేశం చేశాడు.

  • Written By:
  • Updated On - March 15, 2022 / 09:20 PM IST

మూడేళ్ల త‌రువాత జ‌రిగిన వైఎస్సాఎల్పీ స‌మావేశంలో ఎమ్యెల్యేలు, మంత్రుల‌కు జ‌గ‌న్ దిశానిర్దేశం చేశాడు. రెండేళ్లలో రాబోతున్న ప‌రీక్ష‌కు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చాడు. మంత్రులుగా ఉన్న క్రేజ్ ను పార్టీకి ఉప‌యోగించాల‌ని కోరాడు. జిల్లా అధ్య‌క్షులు, రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్లుగా ఇప్పుడున్న మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గిస్తాన‌ని సంకేతం ఇచ్చాడు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయ‌డానికి ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రులుగా ఉన్న వాళ్లు ప‌నిచేయాల‌ని దిశానిర్దేశం చేయ‌డం గ‌మ‌నార్హం.మంత్రివ‌ర్గం మార్పులు సంపూర్ణంగా ఉంటుంద‌నే సంకేతాన్ని జ‌గ‌న్ ఇచ్చేశాడు. మ‌ళ్లీ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే మీరే మంత్రులు అవుతార‌ని భ‌రోసా ఇచ్చాడు. ఏప్రిల్ 2 వ తేదీ నుంచి గ‌డ‌ప గ‌డ‌ప‌కు వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కార్య‌క్ర‌మం నిర్వ‌హించాల‌ని సూచించాడు. ఎమ్మెల్యేలు వార్డు, గ్రామ స‌చివాయాల‌ను సంద‌ర్శించాల‌ని ఆదేశించాడు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మీరు గెలిచి..పార్టీని గెలిపించండ‌ని జ‌గ‌న్ సూచించాడు.
ఏపీలోని 175 నియోజ‌కవ‌ర్గాల్లోని ఎమ్మెల్యేలు, ఇంచార్జిల పనితీరుపై జ‌గ‌న్ స‌ర్వేలు చేయించాడు. వాటి ఫలితాల ఆధారంగా మాత్ర‌మే పార్టీ టిక్కెట్ల‌ను కేటాయిస్తుంద‌ని వైఎస్సార్ ఎల్పీ స‌మావేశంలో తేల్చి చెప్పాడు. ఆ స‌ర్వేల్లో వెనుక‌బ‌డిన వాళ్ల‌కు టిక్కెట్లు ఇవ్వడానికి పార్టీ సిద్ధంగా లేద‌ని క‌రాఖండిగా చెప్పాడు. రెండేళ్ల‌లో ఉన్న ప‌రీక్షా కాలాన్ని గ‌మ‌నించి ప‌నిచేయాల‌ని కోరాడు. మంత్రులు ప‌నితీరుపై స‌ర్వేలు చేయించుకున్న జ‌గ‌న్ కొంద‌రికి మాత్ర‌మే పార్టీ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించ‌నున్నాడు.


ఈనెల 27వ తేదీన ఇప్పుడున్న మంత్రివ‌ర్గంలోని మంత్రులు రాజీనామా చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అదే రోజున కొత్త మంత్రివ‌ర్గాన్ని ప్ర‌క‌టించ‌డానికి ముహూర్తం పెట్టుకున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న‌ట్టే ఐదుగురు డిప్యూటీ సీఎంల‌తో పాటు హోంమంత్రిగా మ‌హిళ‌కు అవ‌కాశం ఇస్తార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే రోజా పేరు హోంమంత్రిగా ప్ర‌చారంలో ఉన్న‌ప్ప‌టికీ ఆ స్థాయి ప‌ద‌విని ఆమెకు ఇవ్వ‌డానికి అవ‌కాశం త‌క్కువ‌గా ఉంద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. చిత్తూరు జిల్లా లీడర్ల‌తో ఆమెకు పొస‌గ‌క‌పోవ‌డం, న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలోని వ్య‌తిరేక‌త ఆధారంగా రోజాను ప‌క్క‌న పెట్టొచ్చ‌ని స‌మాచారం.ఇత‌ర‌త్రా ఈక్వేష‌న్స్ లో ఆమెకు ప‌ద‌విని ఇవ్వాల్సి వ‌స్తే, డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌విని ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఇప్పుడున్న మంత్రుల్లో 90శాతం మంది రాజీనామా చేస్తార‌ని తెలుస్తోంది.చివ‌రి నిమిషంలో అంద‌ర్నీ రాజీనామా చేయించినా ఆశ్చ‌ర్యంలేద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల టాక్‌. మంత్రివ‌ర్గంలోని 90శాతం మంది ప‌నితీరు బాగాలేద‌ని స‌ర్వేల సారాంశం. కొంద‌రు డ‌బ్బు సంచుల‌తో దొరికిన ఆరోప‌ణ‌ల‌ను ఎదుర్కొన్నారు. అలాంటి వాళ్ల‌కు స్తానికంగా కూడా ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉంద‌ని స‌ర్వేల ద్వారా జ‌గ‌న్ తెలుసుకున్నాడని గుస‌గుస‌లు ఉన్నాయి. మొత్తం మీద ఉగాది నాటికి కొత్త మంత్రివ‌ర్గంతో స‌రికొత్త పాల‌న దిశ‌గా జ‌గ‌న్ అడుగులు వేయ‌బోతున్నాడు.

సుమారు 45 మంది ఎమ్మెల్యేలు జ‌గ‌న్ పై అసంతృప్తిగా ఉన్నార‌ని బీజేపీ భావిస్తోంది. స‌గానికిపైగా మంత్రులు రాజీనామా చేసిన త‌రువాత బీజేపీ వైపు చూసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. జ‌న‌సేన‌కు బీజేపీ రోడ్ మ్యాప్ ఇచ్చిన త‌రువాత వైసీసీ అస‌లు క‌థ ప్రారంభం అవుతుంది. రాజ్యాధికారం దిశ‌గా ద‌క్షిణ భార‌త దేశంపై దండ‌యాత్ర చేస్తోన్న బీజేపీ ఏపీలోనూ పాగా వేయాల‌ని చూస్తోంది. నేరుగా అమిత్ షా సీన్లోకి రాబోతున్నాడు. వ‌చ్చే నెల 17వ తేదీ నుంచి ఆయ‌న ప్ర‌త్యేక ఆప‌రేష‌న్ ప్రారంభం కానుందని క‌మ‌ల‌నాథులు ఆశ పెట్టుకున్నారు. ప‌వ‌న్ ఫేస్ ను చూపించ‌డం ద్వారా అధికారంలోకి రావాల‌ని బీజేపీ స్కెచ్ వేస్తోంది. ఆ క్ర‌మంలో టీడీపీ, వైసీపీ పార్టీల‌ను వీలున్నంత వ‌ర‌కు ప్ర‌జ‌ల్లో
డ్యామేజ్ చేసే ఎత్తుగ‌డ‌లను క‌మ‌ల‌నాథులు ర‌చిస్తున్నారు. జ‌గ‌న్ మీద ఆయ‌న స‌ర్కార్ మీద అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలు గ‌త ఏడాది కూడా గ‌ళం విప్పారు. సుమారు 10 మంది వ‌ర‌కు ఆనాడే బ‌య‌ట ప‌డ్డారు. ఇంకా బ‌య‌ట ప‌డ‌కుండా చాలా మంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఉన్నార‌ని బీజేపీ, టీడీపీ చెబుతున్న మాట‌లు. అవే, నిజం అయితే…క్యాబినెట్ మార్పుల త‌రువాత పెద్ద ఎత్తున వైసీపీ నుంచి వ‌ల‌స‌లు ఉండే అవ‌కాశం ఉంది. ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడ‌తామ‌ని కూడా కొంద‌రు బీజేపీ నేత‌లు గ‌త ఏడాది ఉప ఎన్నిక‌ల సంద‌ర్భంగా వ్యాఖ్య‌లు చేశారు. ఆ దిశ‌గా బీజేపీ దూకుడుగా వెళితే, ఏపీ మ‌రో అస్సాం, మ‌ణిపూర్ లాగా అధికార మార్పిడి రాజ‌కీయాన్ని సంత‌రించుకోనుంది. అలాంటి గండం ఎదురైతే, జ‌గ‌న్ ఏమి చేస్తాడో..చూడాలి.!